ఉత్తమ భారతీయ రుచుల్లో తొలి స్థానంలో మ్యాంగో లస్సీ
గతేడాది టాప్ 10 జాబితాలో చోటు దక్కని బిర్యానీ
ఫుడ్ ట్రావెల్ గైడ్ టేస్ట్ అట్లాస్ ర్యాంకుల్లో వెల్లడి
సాక్షి, హైదరాబాద్: దేశంలో తనకంటూ ప్రత్యేక ప్రాచుర్యం పొందిన హైదరాబాద్ బిర్యానీ మరోసారి తన ఘనతను నిర్ధారించుకుంది. సంప్రదాయ వంటకాలకు సంబంధించిన పరిశోధన, సమీక్షలకు పర్యాటక ప్రదేశాల గురించిన సమాచారానికి పేరొందిన ఆన్‌లైన్ వేదిక టేస్ట్ అట్లాస్.. అత్యున్నత భారతీయ వంటకాల్లో హైదరాబాద్ బిర్యానీకి 6వ స్థానాన్ని కట్టబెట్టింది. గతేడాది ఇదే సంస్థ అందించిన ర్యాంకుల్లో మన బిర్యానీకి చోటు దక్కని నేప«థ్యంలో ఈ ఏడాది తన పాపులారిటీని తిరిగి నిలబెట్టుకోగలిగింది.
సిటీజనులకు అత్యంత ప్రీతిపాత్రమైన వంటకంగానే కాక నగర సంప్రదాయ వంటకాల విశిష్టతను నలుదిశలా చాటేదిగా, దేశ విదేశీ ప్రముఖులకు నగర సందర్శనలో తప్పనిసరిగా ‘రుచి’ంచే మన బిర్యానీ టేస్ట్ అట్లాస్ జాబితాలో టాప్ 10లో నిలవగా.. మన నగరంలో విరివిగా ఇష్టపడే బటర్ చికెన్, తందూరీ చికెన్ వంటివి కూడా ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాయి.
నెం–1 గా మ్యాంగో లస్సీ...
ఈ జాబితాలో మ్యాంగో లస్సీ నెంబర్ 1 గా నిలిచింది. వేసవిలో విరివిగా జనం ఆస్వాదించే ఈ లస్సీకి జాబితాలో అగ్ర స్థానం దక్కింది. అదే విధంగా దాని తర్వాతి స్థానంలో మసాలా చాయ్ నిలిచింది. ఇది అనేకమందికి, నగర వాసులకు రోజువారీ అవసరం అనేది తెలిసిందే. ఫుడ్ లవర్స్ ఇష్టపడే బటర్ గార్లిక్ నాన్‌కు మూడో ర్యాంక్ దక్కింది. ఆ తర్వాత అమృత్ సర్ కుల్చా, బటర్ చికెన్ వరుసగా నాల్గు, ఐదు ర్యాంక్‌లు దక్కాయి. ఆ తర్వాత మన హైదరాబాద్ బిర్యానీ ఆరు, షాహి పనీర్ ఏడు, చోలే భటూర్ ఎనిమిది, తందూరీ చికెన్ తొమ్మిది, కోర్మా పదో ర్యాంకును దక్కించుకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment