సాక్షి, హైదరాబాద్: సైబర్ నేరగాళ్లు ఎప్పటికప్పుడు కొత్త ఎత్తులు వేస్తున్నారు. బాధితులకు తెలియకుండా వారితోనే కాల్ డైవర్షన్ యాక్టివేట్ చేయిస్తున్నారు. ఆపై వారి వాట్సాప్‌ను తమ అధీనంలోకి తీసుకుని డబ్బు కోరుతూ పలువురికి సందేశాలు పంపుతున్నారు. నగరానికి చెందిన ఓలా గ్రాడ్యుయేట్ బుధవారం సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఏసీపీ కేవీఎం ప్రసాద్ కథనం ప్రకారం వివరాలు..
నగరానికి చెందిన బాధితురాలికి మంగళవారం 96––––––44 నుంచి ఫోన్ వచ్చింది. జియో సర్వీస్ సెక్షన్ నుంచి మాట్లాడుతున్నామంటూ పరిచయం చేసుకున్న అవతలి వ్యక్తి సర్వీస్‌లో ఇబ్బందిపై కాల్ సెంటర్‌కు ఫిర్యాదు చేశారా? అని అడిగాడు. తాను అలాంటి ఫిర్యాదులేమీ చేయలేదని బాధితురాలు చెప్పింది. తమ రికార్డుల్లో ఫిర్యాదు నమోదై ఉందని చెప్పిన కేటుగాడు అది క్లోజ్ కావాలంటే తాను చెప్పినట్లు చేయాలన్నాడు. ]401] తర్వాత 709–––––57 నంబర్ జోడించి రింగ్ చేయాలని చెప్పాడు.
అతడి మాటలు నిజమే అని నమ్మిన ఆమె అలానే చేశారు. దీంతో నేరుగా ప్రమేయం లేకుండా తెలియకుండానే ఆమె ఫోన్‌లో కాల్ డైవర్షన్ యాక్టివేట్ అయింది. ఆమెకు రావాల్సిన కాల్స్ అన్నీ కేటుగాడు సూచించిన 709–––––57 నంబర్‌కు వెళ్తున్నాయి. అంతటితో ఆగని అతగాడు ఆమె వాట్సాప్‌ను తన అధీనంలోకి తీసుకోవాలని భావించాడు. దీనికోసం తన ఫోన్‌లో వాట్సాప్ ఇన్‌స్టాల్ చేసుకున్నాడు. ఈ యాప్ యాక్టివేట్ కావాలంటే అందులో వినియోగదారుడి ఫోన్ నంబర్ పొందుపరచాలి. ఆపై దానికి ఎస్సెమ్మెస్ లేదా కాల్ రూపంలో వచ్చే ఆరు అంకెల యాక్టివేషన్ కోడ్ పొందుపరచాలి.
చదవండి: రి‘కార్డ్’ స్థాయిలో క్రెడిట్!.. జాగ్రత్తగా ఉండకపోతే జేబుకు చిల్లే
కేటుగాడు తన ఫోన్‌లోని వాట్సాప్‌లో బాధితురాలి నంబర్ పొందుపరిచి, కాల్ రూపంలో యాక్టివేషన్ కోడ్ వచ్చే ఆప్షన్ ఎంచుకున్నాడు. దీంతో బాధితురాలి ఫోన్‌కు రావాల్సిన ఈ కాల్ డైవర్షన్ కారణంగా కేటుగాడు పొందుపరిచిన 709–––––57 నంబర్‌కు వచ్చింది. దీని ద్వారా ఆ యాప్ యాక్టివేట్ చేసుకోవడంతో బాధితురాలి వాట్సాప్ అతడి అధీనంలోకి వెళ్లిపోయింది.
ఆపై అసలు కథ మొదలెట్టిన సైబర్ నేరగాడు ఆమె వాట్సాప్ కాంటాక్ట్స్ లిస్ట్‌లో ఉన్న అందరికీ సందేశాలు పంపాడు. అత్యవసరంగా రూ.10 వేలు ఫోన్ పే లేదా గూగుల్ పే ద్వారా బదిలీ చేయాలని వాటిలో సూచించాడు. ఆ మొత్తాన్ని 709–––––57 నంబర్‌కు పంపాలని కోరాడు. వారి ద్వారా విషయం తెలుసుకున్న బాధితురాలు బుధవారం సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. నేరగాళ్లు వాడిన ఫోన్ నెంబర్ల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఆ ఫోన్ కాల్స్ నమ్మవద్దు
అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్ నమ్మవద్దు. సరిచూసుకోకుండా ఆ ఫోన్లు చేసిన వాళ్లు చెప్పినట్లు చేస్తే ఆర్థికంగా నష్టపోవడంతో పాటు వ్యక్తిగత డేటాను కోల్పోవాల్సి వస్తుంది. ]401]తో ఏ నంబర్ కలిపి డయల్ చేస్తామో ఆ నంబర్‌కు కాల్ డైవర్షన్ యాక్టివేట్ అయిపోతుంది. దీన్ని గమనించిన వాళ్లు డీ యాక్టివేట్ చేసుకోవాలంటే ఫోన్‌లోని కాల్ సెట్టింగ్స్‌లోకి వెళ్లాలి. ఈ–బైక్స్ తయారీ సంస్థ అథర్ ఎనర్జీ లిమిటెడ్ పేరుతో నగరవాసికి కాల్ చేసిన సైబర్ నేరగాళ్లు డీలర్‌షిప్ అంటూ ఎర వేశారు. అతడు సరి చూసుకోకుండా నమ్మేయడంతో రూ.12 లక్షలు కాజేశారు. దీనిని దృష్టిలో పెట్టుకుని అపరిచితులు చేసే ఫోన్ కాల్స్ వలలో పడకుండా ఉండాలి.
– కేవీఎం ప్రసాద్, సిటీ సైబర్ క్రైమ్ ఏసీపీ
Comments
Please login to add a commentAdd a comment