సాక్షి, హైదరాబాద్: బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హైదరాబాద్ పర్యటన ఆద్యంతం తీవ్ర ఉత్కంఠ రేకెత్తించింది. మంగళవారం సాయంత్రం శంషాబాద్ విమానాశ్రయంలో దిగడం మొదలు పార్టీ కార్యాలయానికి చేరుకునే దాకా ఉత్కంఠ భరితంగానే కొనసాగింది. ఇటు ఎయిర్‌పోర్టులో, అటు సికింద్రాబాద్ ఎంజీరోడ్డులో కార్యకర్తలు పెద్ద సంఖ్యలో గుమిగూడటం, పోలీసులు భారీయెత్తున మోహరించడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడినా ఎలాంటి ఘర్షణ వాతావరణం నెలకొనలేదు.
నడ్డా ప్రకటనతో టెన్షన్
కోవిడ్ నిబంధనల ఉల్లంఘన పేరిట తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ను అరెస్ట్ చేసి 14 రోజుల రిమాండ్‌కు పంపించడంపై బీజేపీ శ్రేణులు అగ్గిమీద గుగ్గిలం అవుతున్న నేపథ్యంలో నడ్డా నగరానికి చేరుకున్నారు. సంజయ్ అరెస్టుకు నిరసనగా మంగళవారం సాయంత్రం ఎంజీ రోడ్డులోని గాంధీ విగ్రహం నుంచి రాణిగంజ్ వరకు తాను స్వయంగా ‘ప్రజాస్వామ్య పరిరక్షణ’ మౌన ప్రదర్శన, కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొంటానని, అరెస్ట్‌కు కూడా భయపడేది లేదని నడ్డా సోమవారం ఢిల్లీలోనే ప్రకటించారు. దీంతో అటు పోలీసులు, ఇటు పార్టీ నాయకుల్లో ఏం జరుగుతుందోనన్న టెన్షన్ నెలకొంది.
ఈ క్రమంలో జేపీ నడ్డాతో పాటు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఇతర నేతలు పాల్గొనే కొవ్వొత్తుల ప్రదర్శనకు అనుమతి కోరుతూ నార్త్ జోన్ డీసీపీ జి.చందన దీప్తికి బీజేపీ సికింద్రాబాద్ శాఖ అధ్యక్షుడు బి.శ్యామ్ సుందర్‌గౌడ్ దరఖాస్తు చేశారు. అయితే కోవిడ్ కేసులు పెరుగుతుండటంతో పాటు నగరంలో నెలకొన్న పరిస్థితులు, ర్యాలీతో తలెత్తే ట్రాఫిక్ ఇబ్బందుల దృష్ట్యా దీనికి పోలీసులు అనుమతి నిరాకరించడంతో పాటు అదే విషయం లిఖిత పూర్వకంగా తెలిపారు. మంగళవారం విమానాశ్రయంలోనూ, బీజేపీ శాంతియాత్ర నిర్వహిస్తామన్న ఎంజీరోడ్డులో భారీగా మోహరించారు.
శంషాబాద్‌లో ఘన స్వాగతం
సాయంత్రం 5 గంటల సమయంలో నడ్డా శంషాబాద్ విమానాశ్రయంలో దిగారు. ఈ సందర్భంగా అక్కడ హైడ్రామా నెలకొంది. ఎయిర్‌పోర్టులో నడ్డాకు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, డాక్టర్‌కె.లక్ష్మణ్, రాజాసింగ్, విజయశాంతి, బంగారు శ్రుతి తదిత రులు స్వాగతం పలికారు. ఎయిర్‌పోర్ట్ లాంజ్‌లోనే రాష్ట్ర పార్టీ ఇన్‌చార్జి తరుణ్‌ఛుగ్, నేతలు డీకే అరుణ, ఏపీ జితేందర్‌రెడ్డి, ఎన్.రామచంద్రరావు, గుజ్టుల ప్రేమేందర్‌రెడ్డి తదితరులతో నడ్డా భేటీ అయ్యారు. సంజయ్ అరెస్ట్, రిమాండ్ పరిస్థితులు, తదనంతర పరిణామాలు, రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, ఉద్యోగుల విభజన, నిరుద్యోగుల సమస్య, ఇతర అంశాలపై పార్టీ ఆధ్వర్యంలో చేపడుతున్న ఉద్యమాలు, టీఆర్‌ఎస్ ప్రభుత్వ తీరును గురించి నడ్డాకు పార్టీ నాయకులు వివరించారు.
ర్యాలీలకు అనుమతి లేదన్న జాయింట్ కమిషనర్
కాగా, అనుమతి లేకున్నా నడ్డా, నేతలు నిరసన ర్యాలీ కొనసాగించాలని నిర్ణయించారు. అప్పటికే ఎయిర్‌పోర్ట్‌కు బీజేపీ శ్రేణులు తరలివచ్చాయి. దీంతో అప్రమత్తమైన నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్, సికింద్రాబాద్‌లో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తూనే సంయుక్త పోలీసు కమిషనర్ కార్తికేయను విమానాశ్రయం దగ్గరకు పంపించారు. అక్కడ నడ్డాను కలిసిన కార్తికేయ ప్రస్తుతం రాష్ట్రంలో కోవిడ్ ఆంక్షలు అమలులో ఉన్నాయని, సభలు, సమావేశాలు, ర్యాలీలకు అనుమతి లేదని వివరించారు. సికింద్రాబాద్‌లో తలపెట్టిన కార్యక్రమాలు రద్దు చేసుకోవాలని కోరారు.
నల్లజెండాలు, రిబ్బన్లతో నిరసనలు
అనంతరం పార్టీ నేతలతో కలిసి నడ్డా ఎంజీ రోడ్డుకు చేరుకున్నారు. సికింద్రాబాద్‌లో మాజీ మేయర్, బీజేపీ నేత బండా కార్తీకరెడ్డి ఇతర నాయకులు ఆయనకు స్వాగతం పలికారు. పెద్దసంఖ్యలో పార్టీ కార్యకర్తలు కూడా అక్కడకు చేరుకున్నారు. చేతుల్లో నల్లజెండాలు ధరించి, నోటికి నల్లరిబ్బన్లు కట్టుకుని నిరసన తెలిపారు. సంజయ్‌ను విడుదల చేయాలంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. అక్కడ బీజేపీ నాయకులతో కలిసి మహాత్మా గాంధీ విగ్రహానికి నడ్డా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు.
సంజయ్‌ను వెంటనే విడుదల చేయాలి
ఒక జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా, ఎంపీగా ఉన్న బండి సంజయ్‌ని ఎలా అరెస్టు చేస్తారు? అని నడ్డా నిలదీశారు. సంజయ్ అరెస్టు అక్రమమని పేర్కొన్నారు. వెంటనే ఆయనను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల బదిలీలకు సంబంధించిన జీవో 317ను వెంటనే రద్దు చేయాలన్నారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కూడా సంజయ్ అరెస్టును ఖండించారు. టీఆర్‌ఎస్ నిరంకుశ ప్రభుత్వంపై ప్రజాస్వామ్య పద్ధతిలో, గాంధీ చూపిన మార్గంలో శాంతియుతంగా తమ పోరాటం కొనసాగుతుందని చెప్పారు. అనంతరం కరోనా దృష్ట్యా ర్యాలీని రద్దు చేసినట్లు, సత్యాగ్రహం పూర్తయిందని కిషన్‌రెడ్డి ప్రకటించారు.
బాంబే హోటల్ వరకు ర్యాలీ
అయితే గాంధీ విగ్రహం నుంచి ఎంజీరోడ్డు మీదుగా బాంబే హోటల్ వరకు ర్యాలీ సాగింది. నడ్డా కారులోనే ఉండి ర్యాలీలో పాల్గొన్నారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలు క్యాండిల్స్ చేత పట్టుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నల్ల జెండాలు, నల్ల బ్యాడ్జీలు ప్రదర్శిస్తూ ర్యాలీలో పాల్గొన్నారు. అనం తరం బీజేపీ శ్రేణులను పోలీసులు అక్కడి నుంచి పంపించేశారు. ఎలాంటి ఘర్షణ వాతావరణం తలెత్తకుండా యాత్ర ప్రశాంతంగా ముగియడంతో పోలీసులు ఉపిరి పీల్చుకున్నారు. ర్యాలీ సందర్భంగా, ర్యాలీ అనంతరం సుమారు ఒక గంట పాటు ట్రాఫిక్ జామ్ కొనసాగింది. ర్యాలీ తర్వాత నడ్డా నేరుగా నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకున్నారు. కాసేపు పార్టీ నేతలతో భేటీ అయిన తర్వాత మీడియాతో మాట్లాడారు. అనంతరం ఘట్‌కేసర్ సమీపంలోని తారామతిపేట గ్రామంలోని బీజేపీ నేత నల్లు ఇంద్రసేనారెడ్డి గెస్ట్‌హౌస్‌కు రాత్రి బస నిమిత్తం వెళ్లారు. బుధవారం నుంచి మూడురోజుల పాటు ఇక్కడికి సమీపంలోని అన్నోజిగూడలో జరిగే ఆరెస్సెస్ అఖిల భారత కార్యకారణి సమావేశాల్లో నడ్డా పాల్గొంటారు.
నా ప్రజాస్వామ్య హక్కును అడ్డుకోలేరు: నడ్డా
తాము కోవిడ్ ప్రొటోకాల్ పాటిస్తూనే ప్రజాస్వామ్యబద్ధంగా తమ కార్యక్రమాలు నిర్వహిస్తామని, గాంధీ విగ్రహానికి పూలమాలలు నివాళులు అర్పించడం వరకే పరిమితం అవుతా మని జేసీకి నడ్డా చెప్పారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ బాధ్యతగల పౌరు డిగా నిబంధనలు పాటించి.. ప్రజాస్వామ్య పద్ధతిలో గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి నిరసన వ్యక్తం చేస్తానని చెప్పారు. జాయింట్ సీపీ కార్తికేయ తనతో మాట్లాడారని, రాష్ట్రంలో కోవిడ్ నిబంధనలు అమల్లో ఉన్నాయని చెప్పారని తెలిపారు. కానీ నా ప్రజాస్వామ్య హక్కులను ఎవరూ అడ్డుకోలేరని నడ్డా స్పష్టం చేశారు. ఒకవేళ పోలీసులు అరెస్ట్ చేస్తే.. అన్న విలేకరుల ప్రశ్నకు అరెస్ట్ చేస్తే చూద్దామని వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment