సీసీఎస్ కార్యాలయం గేట్ వద్ద నిరసన తెలుపుతున్న సాహితి సర్వణి ఎలైట్ బాధితులు
హిమాయత్‌నగర్ (హైదరాబాద్): తమ సొంతింటి కలను ‘సాహి తి సర్వణి ఎలైట్’భగ్నం చేసిందని బాధితులు ఆరోపించారు. తమకు పోలీసుల ద్వారా న్యాయం చేయాలని, తమను మోసం చేసిన వ్యక్తులను తమ ఎదుటనే శిక్షించాలని డిమాండ్ చేస్తూ శనివారం సీసీఎస్ కార్యాలయానికి భారీగా చేరుకున్నారు. కార్యాలయం గేట్ వద్ద బ్యానర్‌లతో కూర్చుని నినాదాలు చేశారు.
1,700 మందిని నుంచి ఫ్రీలాంచ్ పేరుతో రూ.1,539 కోట్లు మోసం చేసిన ‘సాహితి సర్వణి ఎలైట్’ఎండీ లక్ష్మీనారాయణపై బాధితులు ఫిర్యాదు చేయడంతో ఇప్పటికే ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈనేపథ్యంలో కేసులో పురోగతి లేదని, దోషులను శిక్షించడంలో, తమకు న్యాయం చేయడంలో ఆలస్యం జరుగుతోందనే కారణంతో 100 మందికి పైగా బాధితులు సీసీఎస్ కార్యాలయానికి వచ్చారు.
సీసీఎస్ జాయింట్ సీపీ గజరావు భూపాల్‌ను కలిసేందుకు బాధితులు ప్రయత్నించారు. తమవెంట తెచ్చుకున్న బ్యానర్‌లతో కార్యాలయం వద్ద ధర్నాను నిర్వహించి, ఆ ప్రాంతం అంతా హోరెత్తేలా నినాదాలు చేశారు. అమీన్‌పురాలో కోట్లాది రూపాయలు విలువ చేసే భూమిని తమకు అప్పగించాలని బాధితులు డిమాండ్ చేశారు. సొంతింటి కలను నిజం చేయాలని, లేనిపక్షంలో తమ డబ్బు తమకు ఇప్పించాలన్నారు. లేదంటే రోజూ సీసీఎస్ కార్యాలయానికి వచ్చి ధర్నా చేస్తామని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment