ఇంద్ర మేఘ్వాల్‌పై దాడిని నిరసిస్తూ లోయర్ ట్యాంక్‌బండ్ అంబేడ్కర్ విగ్రహం వద్ద ఆందోళన చేస్తున్న దృశ్యం
కవాడిగూడ (హైదరాబాద్): రాజస్తాన్‌లో అగ్రకుల ఉపాధ్యాయుడు వారికి కేటాయించిన కుండలో దళిత విద్యార్థి నీటిని తాగినందుకు చితకబాది ఇంద్ర మేఘ్వాల్ హత్యకు కారణం కావడం అగ్ర కుల దురహంకారానికి నిదర్శనమని పీవోడబ్ల్యూ జాతీయ కన్వీనర్ సంధ్య ఆగ్రహం వ్యక్తంచేశారు. దళిత, మహిళా ట్రాన్స్‌జెండర్, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో లోయర్ ట్యాంక్‌బండ్ అంబేడ్కర్ విగ్రహం వద్ద మంగళవారం విద్యార్థి ఇంద్ర మేఘ్వాల్‌కు కొవ్వొత్తులతో నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ప్రజా సంఘాలు, దళిత సంఘాలు, మహిళ, విద్యార్థి సంఘాలు అగ్రకుల దురంహకార హత్యలను నిరసిస్తూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. సంధ్య మాట్లాడుతూ.. భారత్ గర్వించేలా వజ్రోత్సవాలు జరుపుకోవడం అదే రోజు రాజస్తాన్‌లో దళిత విద్యార్థి అగ్రకుల అహంకారా నికి బలికావడం అంటే స్వాతంత్య్రం ఎవరికి వచ్చిందని ఆమె ప్రశ్నించారు. రాజకీయ లబ్ధి కోసం బీజేపీ అంబేడ్కర్ పేరును వాడుకోవడం దుర్మార్గమని మండిపడ్డారు.
భారత రాజ్యాంగంపై నిజంగా ప్రేమ ఉంటే దళిత, ఆదివాసీ, గిరిజన, మైనార్టీలు, మహిళలపై జరుగుతున్న హత్యలు అత్యాచారాలపై ఎందుకు మాట్లాడటం లేదని సంధ్య నిలదీశారు. అనంతరం ప్రజా సంఘాల నేతలు శంకర్, చైతన్య, ఝాన్సీ, సజయ, స్నేహలత, కొండల్, మల్లేశ్ తదితరులు మాట్లాడుతూ దళిత విద్యార్థిపై అగ్రకుల ఉపాధ్యాయుడు చిత్రహింసలకు పాల్పడి హత్యకు కారణమైతే కనీసం ఎంపీలు, ఎమ్మెల్యేలు ఒక్కరూ ఖండించకపోవడం దురదృష్టకరమన్నారు. మంచినీరు అనేది దేశ సహజ సంపద అని, దీనిపై అందరికీ హక్కు ఉంటుందని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment