
సాక్షి, హైదరాబాద్: ఉత్తరాదిలో వానలు దంచికొడుతున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో రోడ్డు, ఇళ్లు జలమయ్యాయి. దీంతో, ప్రజలు తీవ్ర ఇబ్బందుల ఎదుర్కొంటున్నారు. ఇదిలాఉండగా.. రెండు తెలుగు రాష్ట్రాల్లో రానున్న మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ శాఖ కేంద్రం హెచ్చరించింది.
వివరాల ప్రకారం.. కోస్తాంధ్ర మీదుగా ఒక ఉపరిత ఆవర్తనం, నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన మరో ఆవర్తనం ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక, పగటి పూట మబ్బులు ఉండి, రాత్రవేళ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ పేర్కొంది. మరోవైపు.. హైదరాబాద్‌కు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
ఇదిలా ఉండగా.. తెలంగాణలో బుధవారం నుంచి గురువారం ఉదయం వరకు ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని పేర్కొంది. గురువారం నుంచి శుక్రవారం వరకు ఉమ్మడి ఆదిలాబాద్‌తో పాటు నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లిలో భారీ వర్షాలు పడుతాయని హెచ్చరించారు.
ఇక, శుక్రవారం నుంచి శనివారం వరకు ఉత్తర తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి కరీంనగర్‌తో పాటు నిజామాబాద్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో వర్షాలు పడుతాయని చెప్పింది. శనివారం నుంచి ఆదివారం వరకు ఆదిలాబాద్, కుమ్రంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ పేర్కొంది.
ఇది కూడా చదవండి: తొలి ప్రసంగంలో అదరగొట్టిన కేటీఆర్ కొడుకు హిమాన్షు