IWD2023: విలేజ్‌వనిత ఘనత | Income generation by setting up model enterprises | Sakshi
Sakshi News home page

IWD2023: విలేజ్‌వనిత ఘనత

Published Wed, Mar 8 2023 2:49 AM | Last Updated on Wed, Mar 8 2023 7:11 AM

Income generation by setting up model enterprises - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, హైదరాబాద్‌: గ్రామీణ మహిళలు రూట్‌ మార్చారు. అవకాశాలను అందిపుచ్చుకుంటూ వ్యవసాయేతర కార్యకలాపాల వైపు మళ్లుతున్నారు.‘మోడల్‌ ఎంటర్‌ప్రైజెస్‌’ వీరికి చేదోడుగా నిలుస్తున్నాయి. చిన్న చిన్న యూనిట్లు ఏర్పాటు చేసుకుంటున్న మహిళలు తాము ఆదాయాన్ని పొందుతూ కుటుంబానికి ఆసరాగా నిలవడమే కాకుండా ఇతరులకూ ఉపాధి కల్పిస్తున్నారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్‌) ద్వారా శిక్షణ పొందుతున్న మహిళలు వివిధ రకాల యూనిట్లు ఏర్పాటు చేసుకుంటున్నారు.

హైదరాబాద్‌ మినహా మిగతా 32 జిల్లాల్లో స్టార్టప్‌ విలేజ్‌ ఎంట్రప్రెన్యూర్‌షిప్‌ ప్రోగ్రామ్‌  కింద విలేజ్‌ ఆర్గనైజేషన్స్‌ (గ్రామ సంస్థలు)లో ఈ ‘మోడల్‌ ఎంటర్‌ప్రైజెస్‌’ ఏర్పాటవుతున్నాయి. ఒక్కో విలేజ్‌ ఆర్గనైజేషన్‌లో 5–8 దాకా మోడల్‌ ఎంటర్‌ప్రైజెస్‌ ఉంటున్నాయి. గత రెండేళ్లలో 1.70 లక్షలకు పైగా మోడల్‌ ఎంటర్‌ప్రెజెస్‌ను ప్రమోట్‌ చేసినట్లు చెబుతున్నారు.

మరోవైపు రాష్ట్ర గ్రామీణ జీవనోపాధి కార్యక్రమం కింద కూడా గ్రామ ప్రాంతాల్లో స్టార్టప్‌ ప్రమోషన్, ఎంటర్‌ప్రైజ్‌ ఫైనాన్సింగ్, ధాన్యం సేకరణ, తదితరాల ద్వారా మహిళలకు ఆర్థిక సాధికారత దిశగా చర్యలు కొనసాగుతున్నాయి. స్వయం సహాయక బృందాల్లో (ఎస్‌హెచ్‌జీల) సభ్యులుగా ఉంటున్న మహిళలు స్థానికంగా అందుబాటులో ఉన్న వనరులు, కమ్యూనిటీ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌ వంటి వాటిని ఉపయోగించుకుంటూ ఆర్థికంగా బలపడుతున్నారు. 2022–23లో ఈ విలేజ్‌ ఆర్గనైజేషన్స్‌ రైతుల నుంచి 20 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించాయి. కమీషన్ల రూపంలో రూ.64 కోట్ల మేర ఆదాయం పొందాయి. 


నాడు వ్యవసాయ కూలీ..
మంచిర్యాల జిల్లా భీమారానికి చెందిన  పండ్ల శ్రీలత స్కూల్‌ స్థాయిలోనే చదువు మానేశారు. వ్యవసాయ కూలీగా పనిచేసిన ఆమె.. శ్రీరామ విలేజ్‌ ఆర్గనైజేషన్‌లోని ఝాన్సీ ఎస్‌హెచ్‌జీలో సభ్యురాలు. ప్రస్తుతం భీమారంలోనే ఆదివాసీ విస్తరాకుల తయారీ కేంద్రం ఏర్పాటు చేశారు.

ప్రారంభంలో కొన్ని ఇబ్బందులు ఎదు ర్కొన్నా.. బ్యాంకులు, ఇతర రూపాల్లో అందిన రుణాలతో మోదుగ, అడ్డాకులతో పర్యావరణహిత టేబుల్‌ ప్లేట్లు, బఫె ప్లేట్లు, టిఫిన్‌ ప్లేట్లు, దొప్పలు తయారీకి సంబంధించి సొంత మెషిన్లను ఏర్పాటు చేసుకున్నారు. శ్రీలత, ఆమె భర్త, పిల్లలు ఈ యూనిట్‌లోనే పనిచేస్తున్నారు. మరో ఇద్దరు పనివాళ్లను కూడా పెట్టుకున్నారు. తాము ఆదాయం పొందుతూ ఇతరులకు ఉపాధి కల్పించడంతో పాటు బ్యాంకు రుణం కూడా తీరుస్తున్నారు. 


బిస్కెట్ల యూనిట్‌తో భరోసా.. 

♦ వికారాబాద్‌ జిల్లా యాలాల మండలానికి చెందిన కొడంగల్‌ హజీరా బేగం గతంలోనే మహబూబ్‌ సుభానీ ఎస్‌హెచ్‌జీలో చేరారు. తర్వా త బిస్కెట్ల తయారీ, మార్కెటింగ్‌ యూనిట్‌ వైపు మళ్లారు. బ్యాంకులు, స్త్రీనిధి, ఇతర రూపాల్లో ఆర్థిక సహకారం అందడంతో బేకరీ ఉత్పత్తులతో పాటు పలురకాల తినుబండారాలు తయారు చేస్తూ తమ వ్యాపారాన్ని విస్తరింపజేశారు.

వివిధ రకాల బిస్కెట్లు, బ్రెడ్డు, బన్ను, టోస్టులు, ఎగ్, కర్రీ పఫ్‌లు విక్రయిస్తున్నారు. కుటుంబంలోని ముగ్గురు వ్యక్తులు ఈ వ్యాపారంలో నిమగ్నం కావడంతో పాటు మరో ఐదుగురు పనివారికి ఉపాధి కల్పిస్తున్నారు. కేంద్ర మైక్రో, స్మాల్‌ అండ్‌ మీడియం ఎంటర్‌ప్రైజెస్‌ సర్టఫికెట్, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ సర్టఫికెట్‌ పొందారు. ప్రస్తుతం ఈ కుటుంబానికి అన్ని ఖర్చులు పోను నెలకు రూ.50 వేల దాకా ఆదాయం మిగులుతోంది. 


అవుషా ఫుడ్స్‌ అదుర్స్‌.. 

మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్‌ మండలం అవుషాపూర్‌ గ్రామంలోని వివిధ స్వయం సహాయక బృందాలకు చెందిన 18 మంది మహిళా సభ్యులు కామన్‌ ఇంట్రెస్ట్‌ గ్రూప్‌గా ఏర్పడి ఎన్‌ఐఆర్‌డీలోని రూరల్‌ టెక్నాలజీ పార్క్‌లో శిక్షణ అనంతరం ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ ఏర్పా టు చేశారు. తమ తమ సంఘాల నుంచి రుణ రూపేణా తీసుకున్న మొత్తంతో ఆహార భద్రత, ప్రమా ణాల ప్రాధికార సంస్థ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) లైసెన్స్‌ పొంది అవుషా ఫుడ్స్‌ ఏర్పాటు చేశారు.

ఈ యూనిట్‌ కారంపొడి, పసుపు, అల్లం–వెల్లుల్లి పేస్ట్, కోల్డ్‌ప్రెస్డ్‌ నూనెలు, రాగి, జొన్న ఇతర పిండి పదార్థాలు కలిపి మొత్తం 41 వస్తువులను ఉత్పత్తి చేస్తోంది. ఈ యూనిట్‌ నెలవారీ టర్నోవర్‌ రూ.3 లక్షలుగా ఉంది. గ్రూపులోని మహిళలంతా సొంతకాళ్లపై నిలబడడమే కాకుండా ఎస్‌హెచ్‌జీలకు చెందిన మరో పది మంది మహిళలకు నెలకు రూ. 4 వేల చొప్పున ఉపాధి కల్పి స్తున్నారు. 

ఔత్సాహిక మహిళలకు ప్రోత్సాహం 
రాష్ట్రవ్యాప్తంగా 1.70 లక్షలకు పైగా ఎంటర్‌ప్రెజెస్‌ ప్రమోట్‌ చేశాం. వాళ్లకు రూ.75 వేల నుంచి రూ.5 లక్షల దాకా ఫండింగ్‌ సపోర్ట్‌ కల్పించాం. బ్యాంకులు, స్త్రీనిధి ద్వారా అందిన రుణాలను ఈ ఔత్సాహిక మహిళలు తమ తమ యూనిట్లతో పొందే ఆదాయం ద్వారా తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.

ఎస్‌హెచ్‌జీ బృందాల్లోని ఉత్సాహవంతులు, సొంత వ్యాపారంపై ఆసక్తి ఉన్నవారిని బ్యాంక్‌లతో టయ్యప్‌ చేయిస్తాం. 2021–22లో దీనిని మొదలు పెట్టాం. ఆ ఏడాది 65 వేల దాకా ఎంటర్‌ప్రెజెస్‌ గ్రౌండ్‌ చేశాం. 2022–23లో 1.34 లక్షలు టార్గెట్‌గా పెట్టుకుని 1.10 లక్షల దాకా సాధించాం. 
– రాష్ట్ర గ్రామీణ పేదరిక నిర్మూలనా సంస్థ (సెర్ప్‌) అధికారులు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement