దీపాదాస్ మున్షీకి పుష్పగుచ్ఛమిస్తున్న సీఎం రేవంత్. చిత్రంలో డిప్యూటీ సీఎం భట్టి, మహేశ్‌కుమార్, వంశీచంద్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేసేందుకు గ్రామస్థాయిలో ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటు చేయాలని, ప్రతి గ్రామానికి, వార్డుకు ఐదుగురితో ఏర్పాటు చేసే కమిటీల ద్వారా ఆరు గ్యారంటీలను ప్రజలందరికీ అందించేలా పనిచేయాలని టీపీసీసీ విస్తృతస్థాయి కార్యవర్గ సమావేశం నిర్ణయించింది. మరోవైపు లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ మెజార్టీ స్థానాల్లో విజయం సాధించేలా ఈ భేటీ రోడ్ మ్యాప్‌ను రూపొందించింది.
టీపీసీసీ అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన బుధవారం గాంధీభవన్‌లో ఈ సమావేశం జరిగింది. ఇందులో మూడు తీర్మానాలను ఆమోదించడంతో పాటు లోక్‌సభ ఎన్నికల సందర్భంగా అనుసరించాల్సిన వ్యూహాలు, ఆరు గ్యారంటీల అమలులో పార్టీ పాత్ర తదితర అంశాలపై చర్చించారు. ఆరు గ్యారంటీలను అమలు చేయించే బాధ్యతను పార్టీ తీసుకోవాలని, ప్రజలకు చేరవేసే పనిని పార్టీ కార్యకర్తలకు అప్పగించాలని నిర్ణయించారు.
12 స్థానాల్లో గెలుపే ధ్యేయం
లోక్‌సభ ఎన్నికల్లో కనీసం 12 స్థానాల్లో గెలుపే ధ్యేయంగా ముందుకెళ్లాలని, ఇందుకోసం రేవంత్‌రెడ్డి సమక్షంలో సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. రోడ్‌మ్యాప్‌లో భాగంగా ఈనెల 8వ తేదీన 5 ఉమ్మడి జిల్లాలు, 9న మరో 5 జిల్లాల నేతలతో ఆయన సమీక్ష నిర్వహించాలని, ఆ తర్వాత 10, 11, 12 తేదీల్లో 17 లోక్‌సభ నియోజకవర్గాల సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలని, ఈ నెల 20 తర్వాత ముఖ్యమంత్రి క్షేత్రస్థాయికి వెళ్లాలని నిర్ణయించారు.
రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జిగా కొత్తగా నియమితులైన దీపాదాస్ మున్షీ, ఇప్పటివరకు ఇన్‌చార్జిగా పనిచేసిన మాణిక్‌రావ్ ఠాక్రేలను అభినందిస్తూ వేర్వేరు తీర్మానాలు, లోక్‌సభ ఎన్నికల్లో సోనియాగాంధీ తెలంగాణ నుంచి పోటీ చేయాలని కోరుతూ మరో తీర్మానాన్ని రేవంత్‌రెడ్డి ప్రవేశపెట్టగా సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించింది.
మరింత టీం వర్క్ కావాలి: మున్షీ
సమావేశంలో దీపాదాస్ మున్షీ మాట్లాడుతూ..తెలంగాణలో పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు కార్యకర్తలు పదేళ్ల పాటు కష్టపడ్డారని అన్నారు. భవిష్యత్తులో మన ముందు చాలా ఎన్నికలున్నాయని, ఈసారి ఎన్నికల్లో గెలుపొందేందుకు కార్యకర్తలు మరింత శ్రమించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం, పార్టీ మధ్య సమన్వయం ఉండాలని, మరింత టీంవర్క్‌తో కలిసి పనిచేయాలని కోరారు.
ఆరు గ్యారంటీలు అమలు చేసి తీరతాం: రేవంత్
కాంగ్రెస్ కేడర్ అవిశ్రాంత కృషితోనే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చామని రేవంత్‌రెడ్డి అన్నారు. పార్టీ కోసం కష్టపడిన వారిని గుర్తించి వారికి సముచిత స్థానం కల్పించే బాధ్యతను తాము తీసుకుంటామని హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రజలకిచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరతామన్నారు. ఎన్నికల్లో బోర్లాపడి బొక్కలు విరిగినా బీఆర్‌ఎస్‌కు బుద్ధి రాలేదని, తాము అధికారంలోకి వచ్చి నెలరోజులు గడవక ముందే కాంగ్రెస్ హామీలపై పుస్తకాలు విడుదల చేస్తున్నారని విమర్శించారు.
ఆ పార్టీ విమర్శలను ధీటుగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఆదాయం తగ్గినట్టుందని, అందుకే కాళేశ్వరంపై ఆయన సీబీఐ విచారణ కోరుతున్నారని ఎద్దేవా చేశారు. గతంలో కాళేశ్వరంపై తానే స్వయంగా సీబీఐ విచారణను కోరానని, అప్పుడు బీజేపీ నేతలు ఏం చేశారని ప్రశ్నించారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌లు తోడుదొంగలని, ఇద్దరూ కలిసే కాళేశ్వరం పేరుతో దోచుకున్నారని ఆరోపించారు. కాళేశ్వరంలో అవినీతిపై న్యాయ విచారణ జరిపిస్తామని అన్నారు.
పథకాలు ప్రజలకు చేరవేయండి: భట్టి విక్రమార్క
దశాబ్ద కాలం తర్వాత కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలకు గొప్ప అవకాశం లభించిందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. పారీ్టపై విశ్వాసంతో ప్రజలు గెలిపించారని, వారి నమ్మకాలను వమ్ము చేయకుండా ప్రభుత్వ పథకాలను వారికి చేరవేసే బాధ్యతను పార్టీ శ్రేణులు తీసుకోవాలని కోరారు. పార్టీ కార్యకర్తలు, నేతల త్యాగాల ఫలితంగానే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని, వారి కష్టానికి తగిన ఫలితం ఉంటుందని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు.
టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బి.మహేశ్‌కుమార్‌గౌడ్ సమన్వయకర్తగా వ్యవహరించిన ఈ సమావేశంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్‌బాబు, దామోదర రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పలువురు మాజీ ఎంపీలు, మాజీ మంత్రులు, ఏఐసీసీ కార్యదర్శులు, టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, అధికార ప్రతినిధులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, డీసీసీ అధ్యక్షులు, మండల, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఆరు గంటలకు పైగా ట్రాఫిక్ ఇబ్బందులు
టీపీసీసీ సమావేశం సందర్భంగా గాం«దీభవన్, నాంపల్లి, ఆబిడ్స్, మొజాంజాహి మార్కెట్ పరిసరాల్లో తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మధ్యాహ్నం 2 గంటలకు సమావేశం ప్రారంభం కావాల్సి ఉండగా, సీఎం మధ్యాహ్నం 3: 30కి గాం«దీభవన్‌కు చేరుకున్నారు. అయితే అంతకంటే ముందే ట్రాఫిక్ జామ్ అయింది. మంత్రుల కాన్వాయ్‌లోని వాహనాలు, పైలట్ వాహనాలను రోడ్డుపైనే పార్క్ చేశారు. పెద్ద ఎత్తున వచ్చిన కార్యకర్తల వాహనాలతో గాంధీభవన్ పరిసరాలన్నీ కిటకిటలాడిపోయాయి. దీంతో రాత్రి 8 గంటల వరకు ట్రాఫిక్ జామ్‌తో వాహనదారులు, సాధారణ ప్రజలు ఇబ్బందులు పడాల్సి వచ్చింది.
మల్లు రవిని అడ్డుకున్న పోలీసులు
టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవిని పోలీసులు గాంధీభవన్ ప్రధాన ద్వారం వద్దే ఆపేశారు. భేటీకి హాజరయ్యే నేతల జాబితాలో పేరుంటేనే లోపలికి పంపుతామని చెప్పారు. దీంతో ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను అడ్డుకుంటారా అని గట్టిగా కేకలు వేస్తూ లోనికి వెళ్లారు. మరోవైపు దీపాదాస్ మున్షీ గాం«దీభవన్‌లోకి ప్రవేశించేందుకు పోలీసులు ఓవైపు నుంచి మార్గం ఏర్పాటు చేయగా, డ్రైవర్ ప్రధాన ద్వారం వైపునకు వాహనం తీసుకువచ్చారు. పోలీసులు అనుమతించకపోవడంతో ఆమె అక్కడే దిగి నడుచుకుంటూ గాంధీభవన్‌లోకి Ððవెళ్లాల్సి వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment