
నెలలు నిండకుండా జన్మించిన శిశువుల సంరక్షణ కోసం ఫండ్ రైజింగ్
ఎక్స్‌ట్రామైల్ ఫౌండేషన్, అకాన్ రెస్టారెంట్ ఆధ్వర్యంలో నిర్వహణ
లంచ్‌ను ఆస్వాదించండి.. నచ్చినంత చెల్లించండి..
సాక్షి, సిటీబ్యూరో: స్వాతంత్య్ర దినోత్సవం నేపథ్యంలో నగరం వేదికగా ’అకాన్ ఆహ్వానం’ పేరుతో వినూత్నంగా ఫండ్ రైజింగ్ ఫీస్ట్‌ను గురువారం నిర్వహిస్తున్నారు. పేద కుటుంబాల్లో నెలలు నిండకుండానే పుట్టిన చిన్నారుల సంరక్షణ, సహకారం అందించడం కోసం ఈ ఫీస్ట్ నిర్వహించడం విశేషం. దుర్గంచెరువు దగ్గరలోని అకాన్
రెస్టారెంట్ వేదికగా ప్రముఖ స్వచ్ఛంద సేవా సంస్థ ఎక్స్‌ట్రామైల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ ఫండ్ రైజింగ్ ఫీస్ట్ ఏర్పాటు చేస్తున్నారు. ప్రముఖ చెఫ్‌లు తయారు చేసిన పసందైన ఆహార పదార్థాలను, సితార్ ప్రదర్శనను ఆస్వాదిస్తూ ఆరగించవచ్చు. లంచ్ మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 గంటల వరకు అందుబాటులో ఉంటుంది. లంచ్ అనంతరం చెల్లించే ప్రతిపైసా పేద కుటుంబాల్లోని ప్రీ మెచ్యూర్డ్ చిన్నారులకు, అనారోగ్యాలతో జన్మించిన శిశువులకు విరాళంగా అందిస్తారు. సామాజిక బాధ్యతగా ఈ వినూత్నమైన ఆహారానికి, ఆతిథ్యానికి ఎంతైనా చెల్లించవచ్చని నిర్వాహకులు పేర్కొన్నారు.
ఒక్కో శిశువుకు రూ.10 లక్షల వరకు..
నెలలు నిండని శిశు జననాల సంఖ్య ఈ మధ్య కాలంలో విపరీతంగా పెరిగింది. ముఖ్యంగా బతుకు గడవడమే కష్టంగా మారిన పేద కుటుంబాల్లో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంది. ఇలాంటి శిశువులకు, వారి కుటుంబాల చికిత్సకు అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందించడానికి ఎక్స్‌ట్రామైల్ ఫౌండేషన్ కృషి చేస్తోంది. ’అకాన్ ఆహ్వానం’ ఫండ్ రైజింగ్ ఫీస్ట్‌లో పోగైన ప్రతి పైసా ప్రీమెచ్యూర్డ్ చిన్నారులకు, అనారోగ్యంతో జన్మించిన శిశువులకు చేరుతుంది. మా సంస్థ ఆధ్వర్యంలో ప్రతి హాస్పిటల్‌లో ఉండే ఎన్‌ఐసీయూ యూనిట్ల ద్వారా సహాయం అవసరమైన శిశువులకు సహకారం అందిస్తున్నాం. ఇప్పటి వరకు 197 మంది చిన్నారులకు సహకారం అందించాం. 400 గ్రాముల బరువుతో జన్మించిన చిన్నారులను రక్షించాలంటే రూ.10–15 లక్షల వరకు ఖర్చవుతుంది. ఇతర సమస్యలతో జన్మించినా కనీసం రూ.3, 4 లక్షలు అవసరం. ఒక్క లంచ్ ఎన్నో కుటుంబాలకు ఆసరాగా నిలుస్తుంది. లంచ్ రిజర్వేషన్ల కోసం ఫోన్: 96496 52222 – డా.నిటాషా, ఎక్స్‌ట్రామైల్ ఫౌండేషన్
Comments
Please login to add a commentAdd a comment