సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రత్యర్థి పారీ్టల రాజకీయ ఎత్తుగడలను నిశితంగా గమనిస్తున్న అధికార టీఆర్‌ఎస్ మరోవైపు సొంత పార్టీ నేతల పనితీరుపైనా దృష్టి సారించింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిచే అవకాశం ఉన్న వారికే టికెట్ ఇవ్వాలని పార్టీ భావిస్తోంది. ఐ ప్యాక్ నివేదికల నేపథ్యంలో 40 మందికి పైగా సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఈసారి అవకాశం దక్కక పోవచ్చని తెలుస్తోంది. శాసనసభ నియోజకవర్గాలవారీగా ప్రస్తుత ఎమ్మెల్యేలతో పాటు సెగ్మెంట్ పరిధిలోని ఇతర ముఖ్య నేతల పనితీరు, గుణగణాలపై టీఆర్‌ఎస్ లోతుగా వివరాలు సేకరిస్తోంది.
ప్రశాంత్ కిషోర్‌కు చెందిన ‘ఐ ప్యాక్’బృందం ఈ మేరకు నివేదికలు రూపొందిస్తోంది. ఇప్పటికే సుమారు 70 నియోజకవర్గాలకు సంబంధించిన నివేదికలు టీఆర్‌ఎస్ అధ్యక్షులు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వద్దకు చేరాయి. మరో 40కి పైగా నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి, నేతల పనితీరుపై నివేదికలకు ఈ నెల 20లోగా తుది రూపు వచ్చే అవకాశముంది. వివిధ కోణాల్లో సేకరిస్తున్న సమాచారాన్ని క్రోడీకరించి రూపొందిస్తున్న ఈ నివేదికల ఆధారంగా క్షేత్ర స్థాయిలో దిద్దుబాటు చర్యలు చేపట్టడంతో పాటు వచ్చే ఎన్నికల్లో గెలుపు వ్యూహానికి కూడా ఇప్పటినుంచే పదును పెట్టాలని అధినేత కేసీఆర్ భావిస్తున్నట్టు తెలిసింది.
మీడియా సంబంధాలపైనా విశ్లేషణ
ప్రధాన మీడియా, వాటి ప్రతినిధులతో పార్టీ పరంగా ఉన్న సంబంధాలు, సమాచారం పంపిణీ, సామాజిక మాధ్యమాల్లో పార్టీకి అనుకూలం, ప్రతికూలంగా జరుగుతున్న ప్రచారం తదితరాలను కూడా ఐ ప్యాక్ బృందాలు అంచనా వేస్తున్నాయి. మీడియాలో వస్తున్న ప్రతికూల ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు ఎలాంటి కంటెంట్ (అంశాలు) అవసరమనే కోణంలోనూ మదింపు జరుగుతోంది.
మరోవైపు వివిధ సందర్భాల్లో పార్టీ తరఫున మీడియాలో గళం విప్పుతున్న ప్రతినిధుల సమర్ధత, వారికి వివిధ అంశాలపై ఉన్న అవగాహన, వారి భాషా పరిజ్ఞానం తదితరాలను కూడా ఐ ప్యాక్ విశ్లేషిస్తోంది. బీజేపీ, కాంగ్రెస్ పారీ్టలు ఏ తరహా ప్రచార వ్యూహాన్ని అమలు చేస్తున్నాయి, ఆ పారీ్టకి ఉన్న మీడియా సంబంధాలపై కూడా టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు ఇటీవల నివేదికలు అందజేసింది.
అన్ని వైపుల నుంచీ ఆరా..
పార్టీ ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలు పూర్తి వివరాలను ఐ ప్యాక్ బృందం సేకరిస్తోంది. వైవాహిక స్థితి, కుటుంబంలో ఎవరైనా రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారా, ఏయే పదవుల్లో ఉన్నారు? ఎలాంటి పనితీరు కనపరుస్తున్నారు? వంటి కోణాల్లో బృందాలు ఆరా తీస్తున్నాయి. మరోవైపు ఎమ్మెల్యేలు, నేతల ఆర్థిక స్థితిగతులు, వారికి ఉన్న వ్యాపార నిర్వహణ బాధ్యతలు చూస్తున్నదెవరు?, పార్టీ, సామాజిక కార్యక్రమాల్లో ఎంత మేర చురుగ్గా పనిచేస్తున్నారు? తదితర వివరాలు కూడా సేకరిస్తున్నారు. ఒకవేళ సిట్టింగ్ ఎమ్మెల్యేపై ప్రతికూలత ఉండే పక్షంలో ఎవరు సరైన ప్రత్యామ్నాయం అనే కోణంలోనూ సమాచార సేకరణ జరుగుతోంది.
పార్టీలో అంతర్గత గ్రూపులు, వీటి వెనుక ఉన్న కీలక నేతలు, పార్టీ యంత్రాంగంపై గ్రూపు రాజకీయాల ప్రభావం తదితర అంశాలను కూడా నివేదికలో పొందుపరుస్తున్నారు. ఇలావుండగా ఇతర పారీ్టల నుంచి టీఆర్‌ఎస్‌లో చేరేందుకు ఆసక్తి చూపుతున్న నేతలు లేదా ఇతర పారీ్టల్లో బలమైన నేతల వివరాలు కూడా ఈ నివేదికల్లో ఉన్నట్టు తెలుస్తోంది. విపక్ష ఎమ్మెల్యేల పనితీరు, వారి బలాబలాలను కూడా అంచనా వేస్తున్న ఐ ప్యాక్ బృందాలు ఆ మేరకు నివేదికలు రూపొందిస్తున్నట్టు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment