సాక్షి, హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ సామ్ కోషి గురువారం బాధ్యతలు చేపట్టారు. ఉద యం 10 గంటలకు హైకోర్టు మొదటి హాల్లో ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్ అలోక్ అరాధే ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఛత్తీస్‌గఢ్ హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేస్తు న్న జస్టిస్ సామ్ కోషిని సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు మేరకు తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేసిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో జస్టిస్ సామ్ కోషి కుటుంబ సభ్యులు, న్యాయమూర్తులు, న్యాయవాదులు పాల్గొన్నారు.
మధ్యప్రదేశ్‌లో నా సీనియర్‌గా జస్టిస్ అరాధే
కొత్తగా బాధ్యతలు చేపట్టిన జస్టిస్ సామ్ కోషిని హైకోర్టు బార్ అసోసియేషన్ సన్మానించింది. ఈ సందర్భంగా జస్టిస్ కోషి మాట్లాడుతూ.. నాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. మధ్యప్రదేశ్‌లో న్యాయవాద వృత్తిలో ఉన్నప్పుడు తన సీనియర్ న్యాయవాదిగా జస్టిస్ అలోక్ అరాధే ఉన్నారని, మళ్లీ ఆయన సీజేగా ఉన్న తెలంగాణ హైకోర్టుకు జడ్జిగా రావడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు.
తెలంగాణ హైకోర్టుకు మంచి పేరు ఉందని, దాన్ని కాపాడేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు. తనతో న్యాయవాదిగా పనిచేసిన జస్టిస్ సామ్ కోషి.. తెలంగాణ హైకోర్టుకు రావడం ఆనందంగా ఉందని సీజే జస్టిస్ అరాధే పేర్కొన్నారు. ఈ కార్య క్రమంలో అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్, అసోసియేషన్ అధ్యక్షుడు పల్లె నాగేశ్వర్‌రావు, వైస్ చైర్మన్ కల్యాణ్‌రావు చెంగల్వ పాల్గొన్నారు. అనంతరం సీజేతోపాటు న్యాయ మూర్తులు బార్ అసోసియేషన్‌ను సందర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment