నేడు: ప్రాజెక్టులో పడిపోయిన నీటిమట్టం
నిర్మల్: ఆరున్నర లక్షల క్యూసెక్కులతో ఏకంగా ప్రాజెక్టు పైనుంచి వరద ఉప్పొంగింది. నిండా నీటితో రిజర్వాయర్ సముద్రాన్ని తలపించింది. ఇదంతా మొన్నటి పరిస్థితి. ఇప్పుడది ఓ చెరువులా మారుతోంది. వరదకు దెబ్బతిన్న గేట్లు కిందకు దిగకపోవడంతో.. వరద జలాలతో కళకళలాడా ల్సిన నిర్మల్ జిల్లాలోని కడెం నారాయణరెడ్డి ప్రాజెక్టు ఖాళీ అవుతోంది. ప్రాజెక్టుకు ఉన్న 18 గేట్లలో వరద రాకముందు నుంచే 12వ గేటు మొరాయించింది.
భారీ వరద నేపథ్యంలో దానిని అలాగే వదిలేసి మిగతా 17 గేట్లు ఎత్తారు. 13న అర్ధరాత్రి వచ్చిన 6.5 లక్షల క్యూసెక్కుల వరద ప్రాజెక్టు పైనుంచి పారింది. దీంతో చెట్లు, కొమ్మలు, చెత్త మొత్తం ప్రాజెక్టు పైభాగంలో గేట్‌లను ఎత్తే యంత్రాలు ఉండే రూమ్‌లలో, గేట్లను ఎత్తే రోలర్లలో, పైభాగంలో పూర్తిగా నిండిపోయింది. గేట్లన్నీ వాటిల్లో కూరుకుపోయాయి. మరోవైపు ఎలక్ట్రికల్ వ్యవస్థ దెబ్బతినడంతో శుక్రవారం ప్రాజెక్టు సిబ్బంది ఎంత ప్రయత్నించినా లాభం లేకుండా పోయింది.
ఒక్క గేటును కష్టంగా కొంత కిందకు దింపినా మిగతావి కదల్లేదు. దీంతో ప్రాజెక్టు ఖాళీ అవుతోంది. గేట్లన్నీ ఎత్తే ఉండటంతో ఉన్న నీళ్లన్నీ దిగువకు వెళ్లిపోతున్నాయి. పైగా ఎగువ నుంచి ఇన్‌ఫ్లో కూడా చాలావరకు తగ్గిపో యింది. కేవలం 16,890 క్యూసెక్కులు వస్తుండగా, 17,307 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో కొనసాగుతోంది. ప్రస్తుతం నీటినిల్వ 3.5 టీఎంసీలకు పడిపోయింది. ఎగువ నుంచి వరద రాకుండా, అవుట్‌ఫ్లో ఇలాగే ఉంటే ప్రాజెక్టు కనీస మట్టానికి పడిపోనుంది. కాగా గేట్ల మరమ్మతుకు శనివారం సాంకేతిక సిబ్బంది రానున్నట్లు అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment