సాక్షి, హైదరాబాద్: ఢిల్లీ మద్యం పాలసీ విషయంగా వచ్చిన ఫిర్యాదు, నమోదైన కేసుకు సంబంధించిన పూర్తి సమాచారం ఇవ్వాలని సీబీఐని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కోరారు. తాను కోరిన డాక్యుమెంట్లు అందితే నిర్దేశిత సమయంలో సమాధానాలు ఇచ్చేందుకు వీలవుతుందని.. తనకు పత్రాలు అందిన తర్వాత హైదరాబాద్‌లో సమావేశ తేదీని ఖరారు చేయవచ్చని పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం ఆమె సీబీఐ అవినీతి నిరోధక విభాగం డీఎస్పీ అలోక్ కుమార్ షాహికి లేఖ రాశారు.
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో సీబీఐ శుక్రవారం రాత్రి కవితకు నోటీసులు జారీచేసిన విషయం తెలిసిందే. ఢిల్లీలో నమోదైన ఆర్సీ 53(ఎ)/2022 కేసు దర్యాప్తులో భాగంగా సీఆర్పీసీ సెక్షన్ 160 కింద ఈ నోటీసులు జారీ చేశారు. దానిపై వెంటనే స్పందించిన కవిత ఈ నెల 6న హైదరాబాద్‌లోని తన నివాసంలో అందుబాటులో ఉంటానని సమాధానమిచ్చారు. అయితే శనివారం ఉదయం కవిత ప్రగతిభవన్‌లో కేసీఆర్, ఇతర కుటుంబ సభ్యులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సీబీఐ నోటీసులు, ఇతర పరిణామాలపై వారు చర్చించినట్టు సమాచారం. ఆ తర్వాత శనివారం సాయంత్రం సీబీఐకి కవిత లేఖ రాశారు.
ఉదయం నుంచీ ప్రగతిభవన్‌లోనే..
ఎమ్మెల్సీ కవిత శనివారం ఉదయం తన నివాసం నుంచి ప్రగతిభవన్‌కు వెళ్లారు. రాత్రి వరకు అక్కడే ఉన్నారు. ఈ సందర్భంగా లిక్కర్ స్కాం వెలుగు చూసినప్పటి నుంచి జరిగిన పరిణామాలపై తన తండ్రి, సీఎం కేసీఆర్‌తోపాటు కుటుంబ సభ్యులు, న్యాయ నిపుణులు, ముఖ్య నేతలతో చర్చించినట్టు తెలిసింది. కేంద్ర విధానాలకు వ్యతిరేకంగా నిరంతరం పోరాడుతున్న నేపథ్యంలో.. కేసీఆర్ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టే ఉద్దేశంతోనే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఢిల్లీ స్కాంలో తన పేరును ప్రస్తావించిందని కవిత పేర్కొన్నట్టు సమాచారం.
ఈ నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహాలపై కేసీఆర్‌తో సుదీర్ఘంగా చర్చించారని తెలిసింది. ముఖ్యంగా న్యాయపరంగా ముందుకెళ్లాల్సిన తీరు, రాజకీయంగా బీజేపీ చేస్తున్న దాడులను ఎలా తిప్పికొట్టాలన్న వ్యూహాలు, సీబీఐ నోటీసులతో రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయి? దీన్ని రాజకీయంగా ఎలా ముందుకు తీసుకెళ్లాలి? ప్రజల్లో చర్చనీయాంశం ఎలా చేయాలన్న దానిపై సీఎం తన అభిప్రాయాలను వ్యక్తం చేసినట్టు చెప్తున్నారు. తెలంగాణలో రాజకీయంగా టీఆర్‌ఎస్‌ను దెబ్బతీయడానికి జరుగుతున్న కుట్రలను ధైర్యంగా ఎదుర్కోవాలని సూచించినట్టు తెలిసింది.
భారీగా తరలివచ్చిన టీఆర్‌ఎస్ శ్రేణులు
ఎమ్మెల్సీ కవితకు సీబీఐ నోటీసుల నేపథ్యంలో శనివారం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ఆమె అభిమానులు, తెలంగాణ జాగృతి, టీఆర్‌ఎస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో బంజారాహిల్స్‌లోని ఆమె నివాసం వద్దకు వచ్చారు. తామంతా కవిత వెంట ఉన్నామని.. బీజేపీ, ప్రధాని మోదీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. కవిత ఉదయం నివాసం బయటికి వచ్చి కార్యకర్తలతో కాసేపు మాట్లాడారు. తర్వాత ప్రగతి భవన్‌కు వెళ్లారు. ఇక రాజకీయ కక్షతోనే ఎమ్మెల్సీ కవితను వేధింపులకు గురిచేస్తున్నారంటూ జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట తదితర ప్రాంతాల్లో ఫ్లెక్సీలు వెలిశాయి.
ఫిర్యాదు కాపీ ఇచ్చాక విచారణకు వస్తా!
Published Sun, Dec 4 2022 4:06 AM | Last Updated on Sun, Dec 4 2022 3:56 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment