
న్యూఢిల్లీ: లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు నేడు(సోమవారం) తీర్పు వెల్లడించనుంది. మూడు నెలలుగా తీహార్ జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న కవిత బెయిల్ పిటిషన్‌పై నేడు మధ్యాహ్నం 2.30 గంటలకు జస్టిస్ స్వర్ణకాంత శర్మ తీర్పు వెలువరించనున్నారు.
ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత బెయిల్ పిటిషన్‌ను ట్రయల్ కోర్టు కొట్టివేయడంతో ఆమె ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. కవిత తరపున న్యాయవాదుల వాదనలతో పాటు ఈడీ, సీబీఐ వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును జులై1కు రిజర్వు చేసింది.
సీబీఐ అవినీతి కేసుతో పాటు ఈడీ మనీ లాండరింగ్ కేసులో కవిత బెయిల్ దరఖాస్తులను కొట్టివేస్తూ మే 6న ట్రయల్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ఆమె సవాల్ చేశారు. ఈ కేసులోని 50మంది నిందితుల్లో కవిత ఒక్కరే మహిళని.. దీన్ని పరిగణనలోకి తీసుకొని బెయిల్ ఇవ్వాలని కవిత తరఫు న్యాయవాది కోర్టును కోరారు. అయితే ఈ వాదనను సీబీఐ, ఈడీ వ్యతిరేకించాయి. ఈక్రమంలో కవితకు బెయిల్ వస్తుందా లేదా అనేది ఆసక్తిగా మారింది.

Comments
Please login to add a commentAdd a comment