సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాల విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ లేని వివాదాన్ని సృష్టిస్తున్నారని, తద్వారా రాజకీయ, ఆర్థిక లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ మహాజాదూ అని, ఆయన నీళ్ల నుంచి కూడా ఓట్లు సృష్టించగలరని వ్యాఖ్యానించారు. నిజంగా కృష్ణా జలాల వినియోగంపై రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కృష్ణా జలాల్లో రాష్ట్ర వాటా కోసం సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లు ఢిల్లీలోని జంతర్‌మంతర్ దగ్గర ఆమరణ నిరాహార దీక్ష చేయాలని, ఆ దీక్షకు కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు ప్రకటిస్తుందని రేవంత్ చెప్పారు. ఆదివారమిక్కడ తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఏపీ ప్రభుత్వం తెచ్చిన జీవోలపై తాము ఫిర్యాదు చేసినప్పుడు స్పందించని కేసీఆర్ ఇప్పుడు ఏదో చేస్తానంటూ ప్రగల్భాలు పలుకుతున్నారని మండిపడ్డారు. కేసీ ఆర్ అనుమతి తీసుకున్న తర్వాతే ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి రాయలసీమ ప్రాజెక్టును ప్రారంభించారన్నారు. ఈనెల 9న జరగాల్సిన కృష్ణా రివర్‌బోర్డు అపెక్స్ కమిటీ సమావేశాన్ని వాయిదా వేయాలని కోరడం సరైంది కాదన్నారు. ఈ సమావేశంలో మాజీ ఎంపీ మల్లురవి, మాజీ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, టీపీసీసీ నేతలు హర్కర వేణుగోపాల్, సిరిసిల్ల రాజయ్య, మెట్టు సాయికుమార్, చరణ్‌కౌశిక్ యాదవ్ పాల్గొన్నారు.
రోశయ్యను కలిసిన రేవంత్
తాను టీపీసీసీ అధ్యక్షుడిగా నియమితులైన తర్వాత రాష్ట్ర కాంగ్రెస్ నేతలను రేవంత్ రెడ్డి కలుస్తూనే ఉన్నారు. ఆదివారం రాత్రి హైదరాబాద్‌లోని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ గవర్నర్ రోశయ్య ఇంటికి వెళ్లారు. ఆయనతో మాట్లాడి ఆశీర్వాదం తీసుకున్నారు. అలాగే, పీజేఆర్ కుమారుడు, మాజీ ఎమ్మె ల్యే విష్ణువర్ధన్ రెడ్డి, మాజీ మంత్రి గడ్డం వినోద్, ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రావణ్, మాజీ ఎంపీ ఎం.ఎ. ఖాన్ , ఏఐసీసీ కిసాన్ సెల్ వైస్‌చైర్మన్ ఎం.కోదండరెడ్డి తదితరులను వారి నివాసానికి వెళ్లి కలిశారు. ఈ సందర్భంగా రేవంత్ పలు చోట్ల మాట్లాడుతూ పార్టీ మారిన ఎమ్మెల్యేల గురించి తాను మాట్లాడితే చెప్పుతో కొడతామని కొందరు అంటున్నారని, వాళ్లకు చెప్పుల దండలు వేసి ఊరేగిస్తామని వ్యాఖ్యానించారు. సీఎల్పీ ఎవరబ్బ సొత్త ని టీఆర్‌ఎస్ పార్టీలో విలీనం చేస్తారని ప్రశ్నించిన రేవంత్ ఈనెల 7 తర్వాత అందరి సంగతి చెపుతా మని, కార్యకర్తలతో ఉరికిచ్చి కొడతామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment