సాక్షి, హైదరాబాద్: మహిళా కమిషన్ ఆఫీసులో కేటీఆర్ విచారణ ముగిసింది. మహిళలపై చేసిన వ్యాఖ్యలపై కమిషన్ ఎదుట విచారణకు కేటీఆర్ హాజరయ్యారు. ఈ క్రమంలో కమిషన్‌కు ఏం చెప్పారో వివరణ ఇచ్చారు.
కాగా, మహిళలపై వ్యాఖ్యలకు గాను మహిళ కమిషన్‌కు వివరణ ఇచ్చేందుకు కేటీఆర్ ఆఫీసుకు వచ్చారు. వివరణ ఇచ్చిన అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ..‘నా వ్యాఖ్యలపై ఇప్పటికే మహిళలకు క్షమాపణలు చెప్పాను. ఇదే విషయాన్ని మహిళా కమిషన్ ముందు కూడా చెప్పాను. కమిషన్ ఎదుట క్షమాపణ కూడా కోరాను. రాజకీయాల్లో హుందాతనం ఉండాలి. పొరపాటు జరిగినప్పుడు జరిగిందని ఒప్పుకోవాలి. అంతేకానీ, మా మీద పడటం, దాడి చేయడం(కాంగ్రెస్ మహిళా నేతలను ఉద్దేశించి) మంచిది కాదన్నారు. అలాగే, రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడులను కూడా మహిళా కమిషన్ దృష్టికి తీసుకెళ్లాం’ అని అన్నారు.
మహిళా కమిషన్ ముందు వివరణ ఇచ్చేందుకు ఆఫీసుకు కేటీఆర్ వస్తున్న నేపథ్యంలో మహిళా కాంగ్రెస్ నేతలు కమిషన్ వద్దకు భారీ సంఖ్యలో చేరుకున్నారు. అనంతరం, మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు కేటీఆర్ వాహనాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నం చేశారు. కేటీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మహిళలకు కేటీఆర్ బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక, అదే సమయంలో అక్కడే ఉన్న బీఆర్‌ఎస్ మహిళా కార్యకర్తలు కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో, ఇరు వర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఒకరిపైకి మరొకరు దూసుకెళ్లారు. అనంతరం, కమిషన్ ఆఫీసులోకి కాంగ్రెస్ మహిళా కార్యకర్తలు దూసుకెళ్లారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment