ఫార్ములా–ఈ కేసులో ఏసీబీకి హైకోర్టు ఆదేశం
‘కేటీఆర్ అరెస్టు’పై ఇచ్చిన స్టేను రద్దు చేయాలని ఏసీబీ విజ్ఞప్తి
కానీ మధ్యంతర ఉత్తర్వుల ఎత్తివేతకు నిరాకరించిన కోర్టు
అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశం
విచారణను ఈ నెల 31కి వాయిదా వేసిన న్యాయమూర్తి
సాక్షి, హైదరాబాద్: ఫార్ములా–ఈ కార్ రేసు కేసులో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌ను ఈ నెల 31 వరకు అరెస్టు చేయవద్దని ఏసీబీని హైకోర్టు ఆదేశించింది. కేటీఆర్‌ను అరెస్టు చేయవద్దంటూ గతంలో జారీ చేసిన ఉత్తర్వులను ఎత్తివేయాలన్న ఏసీబీ విజ్ఞప్తిని తోసిపుచ్చింది. వాదనలు వినకుండా ఉత్తర్వులను మార్చలేమని స్పష్టం చేసింది. గత విచారణ సందర్భంగా 30వ తేదీ వరకు అరెస్టు వద్దని మధ్యంతర ఉత్తర్వులిచ్చిన కోర్టు.. శుక్రవారం దానిని 31వ తేదీ వరకు పొడిగించింది. ఆలోగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ.. విచారణను ఈ నెల 31వ తేదీకి వాయిదా వేసింది.
ఫార్ములా–ఈ కార్ రేసు వ్యవహారంపై రాష్ట్ర అవినీతి నిరోధక విభాగం (ఏ సీబీ) ఈ నెల 19న కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. మాజీ మంత్రి కేటీఆర్, ఇద్దరు అధికారులను నిందితులుగా చేర్చింది. ఆ ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలంటూ కేటీఆర్ ఈ నెల 20న హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై న్యాయమూర్తి కె.లక్ష్మణ్ శుక్రవారం విచారణ చేశారు. కేటీఆర్ తరఫున సీనియర్ న్యాయవాది గండ్ర మోహన్‌రావు, ప్రభుత్వం తరఫున ఏజీ సుదర్శన్‌రెడ్డి, ఏఏజీ తేరా రజనీకాంత్‌రెడ్డి కోర్టులో హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏసీబీ కౌంటర్ దాఖలు చేసింది. కేటీఆర్‌ను అరెస్టు చేయవద్దంటూ గతంలో ఇచ్చిన ఆదేశాలను ఎత్తివేయాలంటూ అఫిడవిట్ దాఖలు చేసింది.
నిబంధనలకు విరుద్ధంగా నగదు బదిలీ..
కోర్టులో ఏసీబీ తరఫున కేసు విచారణాధికారి, డీఎస్పీ మాజీద్ అలీఖాన్ కౌంటర్ దాఖలు చేశారు. ‘‘కేటీఆర్ మంత్రిగా ఉండి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. తన పరిధిలోని ప్రజాధనాన్ని నిబంధనలకు విరుద్ధంగా బదిలీ చేయడానికి సహకరించి విశ్వాస ఘాతుకానికి పాల్పడ్డారు. దీనిపై ఈ నెల 18న మున్సిపల్ అడ్మినిస్టేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిశోర్ ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు అందిన తర్వాత దర్యాప్తు ప్రారంభించడం కోసం ప్రభుత్వంలోని అ«దీకృత అధికారులకు ఏసీబీ డీజీ లేఖ రాశారు.
వారి ఆమోదంతో ఈ నెల 19న ఎఫ్‌ఐఆర్ నమోదు చేశాం. ప్రాథమిక దశలోనే దర్యాప్తును తప్పుబడుతూ పిటిషనర్ (కేటీఆర్) హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రారంభ దశలోనే దర్యాప్తులో జోక్యం చేసుకుని నిందితులకు ఊరట కలిగేలా ఉత్తర్వులు జారీచేసే అధికారం కోర్టులకు కూడా స్పల్పమే. ప్రాథమిక దశలోనే విచారణను అడ్డుకునేలా ఎలాంటి ఆదేశాలు ఇవ్వకూడదని సుప్రీంకోర్టు గతంలో తీర్పునిచ్చింది. దర్యాప్తును అడ్డుకునేందుకు, ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలంటూ పిటిషనర్ దాఖలు చేసిన పిటిషన్ విచారణార్హం కాదు. దాన్ని కొట్టివేయాలి. అలాగే ఈ నెల 20న ఇచ్చిన ‘అరెస్టు వద్దు’అనే ఆదేశాలను ఎత్తివేయాలి’’అని ఏసీబీ కౌంటర్‌లో పేర్కొన్నారు.
రాజకీయ పగతోనే కేసు పెట్టారు...
ఏసీబీ కౌంటర్‌పై న్యాయవాది ద్వారా కేటీఆర్ కోర్టుకు సమాధానమిచ్చారు. ‘‘ఏసీబీ కౌంటర్‌లోని అన్ని అంశాలను పరిశీలించాను. ఆ ఆరోపణలు అవాస్తవాలు. నాపై ఎఫ్‌ఐఆర్‌కు ప్రాథమిక ఆధారమేమిటో పేర్కొనలేదు. ఎలాంటి అవినీతి జరగకున్నా ప్రభుత్వం రాజకీయ పగతోనే నేర పరిశోధన సంస్థలను రంగంలోకి దించింది. ఎఫ్‌ఐఆర్‌లో పెట్టిన సెక్షన్లు ఏవీ దీనికి వర్తించవు. కేసు నమోదులో తీవ్ర జాప్యానికి కారణాలు పేర్కొనలేదు. కేసును కొట్టివేసే అధికారం కోర్టుకు ఉంది. ఆర్థికపరమైన చిక్కులేమిటో చెప్పకుండా ప్రైవేట్ స్పాన్సర్ పాత్రను ప్రభుత్వంపై మోపారనే ఆరోపణ సరికాదు.
రెగ్యులేటరీ అధికారుల నుంచి అవసరమైన అనుమతులు పొందకుండానే విదేశాలకు నగదు బది లీ చేశారని ఆరోపిస్తున్నారు. ఎవరి ఆమోదమో స్పష్టంగా చెప్పలేదు. బ్యాంక్ అ«దీకృత డీలర్లు, ఏదైనా ముందస్తు అనుమతి అవసరమైతే సంబంధిత అధికారులు పరిశీలించాల్సి ఉంటుంది. ఎంఏయూడీ మంత్రిగా విధులు నిర్వహించిన నాపై నిందలు మోపారు. ఆ నిర్ణయంలో లోపాలుంటే ప్రభుత్వమే తన నిర్ణయాన్ని రద్దు చేసుకోవాలి.
ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి మంత్రిగా నన్ను బాధ్యుడ్ని చేయడం చట్ట వ్యతిరేకం. అవినీతి నిరోధక చట్టం–1988లోని సెక్షన్ 13(1) (ఎ), సెక్షన్ 13(2) ఈ కేసులో వర్తించవు. ఐపీసీలోని 120–బీ, 409 సెక్షన్ల కింద కేసు నమోదు వెనుక కుట్ర ఉంది. ఇలాంటి తీవ్ర నేరాభియోగాలతో కేసు నమోదు చేస్తే.. నోటీసులిచ్చి విచారణ చేయాల్సిన అవసరం లేకుండా ఉంటుందనే కుట్ర దాగి ఉంది. వ్యక్తిగతంగా నన్ను సర్కార్ టార్గెట్ చేసింది’’అని కేటీఆర్ పేర్కొన్నారు. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి విచారణను ఈ నెల 31కి వాయిదా వేశారు.
Comments
Please login to add a commentAdd a comment