
సాక్షి, హైదరాబాద్: దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాలోని ‘నాటు నాటు’ పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ అవార్డు దక్కిన విషయం తెలిసిందే. రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి స్టెప్పులేసిన ఈ సాంగ్‌ను రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ అద్భుతంగా పాడారు. ఆర్‌ఆర్‌ఆర్‌కు ఆస్కార్ అందడంతో తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా యావత్ దేశం నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ సందర్భంగా ఆర్ఆర్ఆర్ సినిమా బృందానికి తెలంగాణ డిజిటల్ మీడియాడైరెక్టర్ కొణతం దిలీప్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పాటను రాసిన చంద్రబోస్‌కు కంగ్రాట్స్ చెప్పారు. అయితే ఆర్ఆర్ఆర్ విడుదల సమయంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యల వీడియోను ఆయన షేర్ చేశారు. సినిమా విడుదల చేసేందుకు ప్రయత్నిస్తే కొడతామని, థియేటర్లకు ఎవరూ వెళ్లకొడదని వార్నింగ్ ఇచ్చారు. థియేటర్లు కాల్చేస్తాం అంటూ ఆర్ఆర్ఆర్ చిత్రంపై బండి సంజయ్ అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు వీడియోలో కనిపిస్తుంది.
అయితే సంజయ్ లాంటి మతోన్మాదులు సినిమాపై ఎలాంటి విషయం చిమ్మారో గుర్తుంచుకోవడానికి ఇదే సరైన సమయమని కొణతం దిలీప్ పేర్కొన్నారు. ఇలాంటి ధ్వేషపూరిత వ్యక్తులను దూరంగా ఉంచుదామని అన్నారు. ఈ ట్వీట్‌పై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ స్పందించారు. ‘ఇంకేముంది నాటు నాటు పాటకు కూడా మోదీ వల్లే అవార్డు వచ్చిందని ఇలాంటి మతోన్మాద వ్యక్తులు చెప్పుకుంటారేమో’ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.
Not before long, the SAME Bigot will tell you the Award was given only because of Modi 😂 https://t.co/8Z0hp6FETl
— KTR (@KTRBRS) March 13, 2023