కార్యక్రమంలో మాట్లాడుతున్న మంత్రి కేటీఆర్
గోల్కొండ: ప్రపంచవ్యాప్తంగా మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థులు, టీచర్లు తమ నైపుణ్యాలను ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకోవాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారక రామారావు సూచించారు. ఇందుకోసం వారంతా స్కిల్, అప్ స్కిల్ రీ–స్కిల్ అనే మంత్రాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ప్రభుత్వ పాఠశాలతోపాటు ప్రైవేటు బడ్జెట్ స్కూళ్లకు చెందిన 6–10వ తరగతి విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికితీసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన తెలంగాణ స్కూల్ ఇన్నోవేషన్ చాలెంజ్–2021 ఫినాలే సోమవారం హైదరాబాద్ గోల్కొండలోని తారామతి–బారాదరిలో జరిగింది.
ఈ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్‌తోపాటు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. తుది పోటీలో గెలిచిన ఐదు విద్యార్థుల బృందాలకు అవార్డులు, చెక్కులు అందించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ పిల్లల్లో సృజనాత్మకతకు పదును పెట్టేందుకు దేశంలోనే తొలిసారిగా పిల్లలు, యువత కోసం ‘వై–హబ్’ఇంక్యుబేటర్‌ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. త్వరలో అందుబాటులోకి రానున్న టీ–హబ్ 2.0 భవనంలో 10 వేల చ.అ. విస్తీర్ణంలో వై–హబ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
డాక్టర్, ఇంజనీర్‌నే చేయాలన్న ధోరణి వద్దు..
తల్లిదండ్రులు వారి పిల్లల్ని కేవలం డాక్టర్, ఇంజనీర్ లేదా లాయర్‌గా తయారు చేయాలన్న ఆలోచనా ధోరణిని వదిలేయాలని మంత్రి కేటీఆర్ హితవు పలికారు. తల్లిదండ్రుల ధోరణి వల్ల విద్యార్థులకు కేవలం ర్యాంకులు, మార్కులు తప్ప ఇంకేమీ తెలియట్లేదని.. ముఖ్యంగా హైదరాబాద్‌లో చదివే చాలా మందికి బియ్యం, కూరగాయలు ఎలా పండుతాయో, పాలు ఎక్కడి నుంచి వస్తాయో తెలియని పరిస్థితి నెలకొందని ఉదహరించారు. అందువల్ల పిల్లల భవిష్యత్తును వారే నిర్ణయించుకొనే హక్కును వారికి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అలాగే విద్యార్థులు సైతం ఉద్యోగం కోరుకొనే స్థాయి నుంచి ఉద్యోగం ఇచ్చే స్థాయికి ఎదగాలనే ధోరణిని పెంపొందించుకోవాలని సూచించారు.
ఎన్నో ఆవిష్కరణలు...
తెలంగాణ స్కూల్ ఇన్నోవేషన్ చాలెంజ్‌లో విద్యార్థులు వైవిధ్యంతో కూడిన ఎన్నో ప్రాజెక్టులు తయారు చేశారని, వారికి విద్యాశాఖ అధికారులు అండగా ఉండి ప్రోత్సహించారని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ చాలెంజ్‌లో 5,387 పాఠశాలలకు చెందిన 25,166 మంది విద్యార్థులు, వారికి దిశానిర్దేశం చేసేందుకు 7,003 మంది ఉపాధ్యాయులు పాల్గొన్నారని చెప్పారు.
మొత్తం 11,037 బృందాలు తమ ఆలోచనలను సమర్పించగా పలు వడపోతల అనంతరం వాటిలో ఐదు బృందాలను న్యాయ నిర్ణేతలు విజేతలుగా ఎంపిక చేశారన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్య కమిషనర్ ఎ. దేవసేన, ఐటీ, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్, యునిసెఫ్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ మురళీకృష్ణ, ఇంక్వి–ల్యాబ్ ఫౌండేషన్ డైరెక్టర్ వివేక్ సిద్ధంపల్లి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment