పాలమూరులో పాల నురగల జలహేల: కేటీఆర్‌  | Ktr tweet about Palamuru Ranga Reddy Lift Scheme | Sakshi
Sakshi News home page

పాలమూరులో పాల నురగల జలహేల: కేటీఆర్‌ 

Published Sun, Sep 17 2023 1:56 AM | Last Updated on Sun, Sep 17 2023 1:56 AM

Ktr tweet about Palamuru Ranga Reddy Lift Scheme - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ‘పల్లేర్లు మొలిచిన పాలమూరులో పాల నురగల జలహేల కనిపిస్తోంది. వలసల వలపోతల గడ్డపై ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం ఆవిష్కృతమైంది’అని మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. శనివారం పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రారంభం సందర్భంగా ‘కరువు కరాళనృత్యం చేసిన భూముల్లో కృష్ణమ్మ జలతాండవం, శెలిమలే దిక్కైన కాడ ఉద్దండ జలాశయాలు, బాయి మీద పంపుసెట్లు నడవని చోట బాహుబలి మోటార్లు‘ అంటూ కవితాత్మకంగా ట్వీట్‌ చేశారు.

‘స్వరాష్ట్ర ప్రస్థానంలో సగర్వ సాగునీటి సన్నివేశం, ఆరు జిల్లాలు సస్యశ్యామలం దక్షిణ తెలంగాణకు దర్జాగా జలాభిషేకం, నిన్న పరాయి నేలపైన ప్రాజెక్టులకు రాళ్లెత్తిన పాలమూరు లేబర్‌.. నేడు సొంత భూమిలో ప్రాజెక్టుల కింద రతనాలు పండిస్తున్న ఫార్మర్‌‘ అని వ్యాఖ్యానించారు. ‘నాడు నది పక్కన నేల ఎడారిలా ఎండిన విషాదం, సమైక్య పాలకుల పాపం, కాంగ్రెసోళ్ల శాపం.

ఆటంకాలు అవరోధాలు అధిగమించి ప్రతిపక్షాల కుట్రలు, కేసులు ఛేదించి సవాల్‌ చేసి సాధించిన విజయం. నీటి వాటా తేల్చకుండా నిర్లక్ష్యం, అనుమతుల్లో అంతులేని జాప్యం.. అయినా కేంద్ర సర్కారు కక్ష, వివక్షను దీక్షతో గెలిచిన దృఢ సంకల్పం. తీరిన దశాబ్దాల నీటి వెత తెచ్చుకున్న తెలంగాణకు ఇదే సార్థకత‘ అని కేటీఆర్‌ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement