భూదాన్‌పోచంపల్లి: భూదాన్‌పోచంపల్లి మండలం పిలాయిపల్లి గ్రామంలో వ్యవసాయ పొలం వద్ద మట్టి తవ్వుతుండగా నాలుగు లంకెబిందెలు దొరికినట్లు చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటన పది రోజుల క్రితం జరగగా మంగళవారం వెలుగులోకి వచ్చింది. గ్రామస్తులు ఇచ్చిన సమాచారం మేరకు ఆర్‌ఐ వెంకట్‌రెడ్డి, ఎస్‌ఐ విక్రమ్‌రెడ్డి మంగళవారం సంఘటన స్థలాన్ని సందర్శించి గ్రామంలో విచారించారు.
బాధ్యులను తహసీల్దార్ కార్యాలయానికి పిలిచించి పంచనామా నిర్వహించారు. దొరికిన బిందెలను స్వాధీనం చేసుకున్నారు. పురావస్తు శాఖ అధికారులకు సమాచారం ఇచ్చి వారికి అప్పగిస్తామని తహసీల్దార్ వీరాభాయి తెలిపారు.
ఖాళీబిందెలా.. లంకె బిందెలా..!
10 రోజుల క్రితం గ్రామానికి చెందిన రైతు కొలను బాల్‌రెడ్డి గ్రామ సమీపంలోని తుమ్మల చెరువు సమీపంలో ఉన్న పట్టాభూమిలో జేసీబీతో మట్టిని తవ్విస్తున్నాడు. ఈ క్రమంలో మట్టితో పాటు 4 బిందెలు బయటపడ్డాయి. జేసీబీ డ్రైవర్ పర్వతం నవీన్‌తో పాటు అక్కడే ఉన్న మక్త అనంతారం గ్రామానికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్లు సురేశ్, ధన్‌రాజ్‌లు చూశారు. నవీన్ ఈ విషయం ఎవరికీ చెప్పొద్దు, మీకు మద్యం తాగడానికి డబ్బులు ఇస్తానని చెప్పి పంపించాడు.
అనంతరం నవీన్ ఆ బిందెలను ఇంటికి తీసుకెళ్లాడు. డబ్బుల విషయమై నవీన్‌కు ఫోన్ చేస్తే స్పందించకపోవడంతో వారు నాలుగు రోజుల తరువాత గ్రామంలో బిందెలు దొరికిన విషయం తెలిసినవారికి చెప్పారు. ఈ విషయం కాస్తా ఆ నోట, ఈ నోట బయటకు పొక్కడంతో వెలుగులోకి వచ్చింది. స్థానికంగా ఉన్న వాట్సాప్ గ్రూప్‌ల ద్వారా వైరల్ చేశారు. ఈ విషయం గ్రామంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
అయితే బాధితుడిని ప్రశ్నించగా ఖాళీబిందెలు మాత్రమే దొరకాయని అందులో ఏమీలేవని చెబుతున్నాడు. ఏమీలేక పోతే బిందెలు దొరికిన వెంటనే గ్రామస్తులకు , అధికారులకు గానీ చెప్పకుండా ఎందుకు గోప్యంగా ఉంచారనేది పలు అనుమానాలకు తావిస్తోంది. దొరికినవి ఖాళీ బిందెలా, లంకె బిందెలా అనేది అధికారుల విచారణలో తేలాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment