చికెన్, మటన్ ఎప్పుడూ తినేవే.. అదే ఏనుగు లెగ్ కర్రీనో, చిరుతపులి ఫ్రైనో ట్రై చేస్తే.. వామ్మో ఏమిటివి అనిపిస్తోందా? ఇవేవో జస్ట్ పేర్లు కాదు. ఆ జంతువుల మాంసంతో చేసే వంటకాలే. కాకపోతే ఇక్కడ సింహాలు, పులులు, ఏనుగులను ఏమీ చంపడం లేదు. మరి ఆ మాంసం ఎలా వస్తుంది అంటారా.. ఆ విశేషాలు ఏమిటో చూద్దాం..
– సాక్షి సెంట్రల్ డెస్క్
మాంసం కాని మాంసం..
జంతువులు, పక్షులను వధించి మాంసం వినియోగించడంపై కొంతకాలంగా ప్రపంచవ్యాప్తంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే మొక్కలు, నాచు సంబంధిత పదార్థాలతో మాంసం వంటి ఉత్పత్తులను తయారు చేసి, అమ్ముతున్నారు. కానీ అవేవీ మాంసం వంటి అనుభూతిని కలిగించలేవు. ఈ క్రమంలోనే జంతువులు, పక్షుల జీవకణాలను కృత్రిమంగా పెంచి మాంసం తయారు చేయడానికి ప్రపంచవ్యాప్తంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే చికెన్ వంటివాటిని తయారు చేశారు కూడా.
ఎవరూ ఊహించని రీతిలో..
కృత్రిమ మాంసం రూపకల్పనకు సంబంధించి లండన్‌కు చెందిన ప్రిమెవల్ ఫుడ్స్ అనే స్టార్టప్ కంపెనీ చిత్రమైన ఆలోచనతో ముందుకు వచ్చింది. చికెన్, మటన్, బీఫ్ వంటి సాధారణమైనవి కాకుండా.. ఎవరూ ఊహించని రీతిలో సింహం, పులి, ఏనుగు వంటి మాంసాలను ఉత్పత్తి చేసేందుకు సిద్ధమైంది. ఈ ప్రక్రియలో జంతువులను చంపడంగానీ, హింసించడంగానీ ఉండదు. ఆయా జంతువుల నుంచి సేకరించిన కొద్దిపాటి రక్తం, ఇతర కణాల నుంచి.. ల్యాబ్‌లో మాంసాన్ని ఉత్పత్తి చేస్తారు.
రుచి.. బలం.. ఎక్కువట!
ఇప్పుడు మనం తింటున్న చికెన్, మటన్, బీఫ్ వంటివి పెద్ద రుచిగా ఉండవని, వాటి నుంచి అందే పోషకాలు కూడా తక్కువేనని ప్రిమెవల్ ఫుడ్స్ కంపెనీ స్థాపనకు పెట్టుబడులు పెట్టిన ఏస్ వెంచర్స్ ప్రతినిధి యిల్మాజ్ బొరా అంటున్నారు. ‘‘కోళ్లు, మేకలు, పశువుల పెంపకం సులువు కాబట్టే.. వాటి మాంసాన్ని మనం వినియోగిస్తున్నాం. వాటిలో కొలెస్టరాల్, శాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువ. అదే కృత్రిమంగా మాంసం ఉత్పత్తి చేయగలిగినప్పుడు కూడా వాటితో పనేముంది? బాగా రుచిగా ఉండే, ఎక్కువ పోషకాలు ఉండే భిన్నమైన జంతువుల వైపు మేం దృష్టిపెట్టాం. ఉదాహరణకు మంచి నిద్ర, మూడ్ ఉండేందుకు చిరుతపులి మాంసాన్ని.. మెదడు పనితీరు మెరుగుపర్చే ఏనుగు మాంసాన్ని మనం భవిష్యత్తులో తినబోతున్నాం’’ అని చెప్తున్నారు. ఇది జస్ట్ ప్రారంభం మాత్రమేనని, ఇంకా అద్భుతమైన ఆహార అనుభూతినీ పొందడం ఖాయమని పేర్కొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment