రుద్రవరంలో రోడ్డుపై నిర్వాసితుల ధర్నా
వేములవాడ అర్బన్: రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మధ్యమానేరు ముంపు గ్రామాల్లో ఏళ్లుగా నెలకొన్న సమస్యలు పరిష్కరించాలంటూ నిర్వాసితులు సోమవారం రోడ్డెక్కారు. ఐక్యవేదిక ఆధ్వర్యంలో మహాధర్నాకు పూనుకున్నారు. ముందస్తుగా పోలీసులు ముంపు గ్రామాలైన అనుపురం, రుద్రవరం గ్రామాల్లో భారీగా మోహరించారు. సోమవారం వందలాది మంది నిర్వాసితులను పోలీసులు అడ్డుకోవడంతో అనుపురం వద్ద కరీంనగర్–సిరిసిల్ల రోడ్డుపై బైఠాయించారు.
అదే సమయంలో వివిధ ముంపు గ్రామాల నిర్వాసితులు నందికమాన్ వద్దకు భారీగా తరలివచ్చారు. ‘మేం వ్యవసాయం చేసుకుందామంటే భూములు లేవు. చేతిలో పనిలేక అడ్డాకూలీలుగా మారాం’అని నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేశారు. పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉపాధి కల్పిస్తామన్న ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలేదని మండిపడ్డారు.
పట్టా ఇచ్చిన ప్రతీ కుటుంబానికి రూ.5.04 లక్షలు ఇస్తామన్న సీఎం కేసీఆర్ హామీ నెరవేర్చలేదన్నారు. తమకు ఇళ్లు, భూముల పరిహారం, పట్టాలు, యువతకు ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. దాదాపు 300 మందిని పోలీసులు కోనరావుపేట పీఎస్‌కు తరలించారు. మహాధర్నాకు తరలివస్తున్న మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ తదితరులను వేములవాడ బ్రిడ్జిపై పోలీసులు అరెస్ట్ చేసి తంగళ్లపల్లి ఠాణాకు తరలించారు.
నిర్వాసితులకు అండ: రేవంత్‌రెడ్డి
మిడ్‌మానేరు నిర్వాసితులకు సీఎం ఇచ్చిన హామీని నెరవేర్చలేదని, వారికి న్యాయం జరిగేంతవరకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి వెల్లడించారు. ధర్నా చేస్తున్న నిర్వాసితులపై పోలీసులు దౌర్జన్యం చేయడం దుర్మార్గమని, నిర్వాసితులతో పాటు కాంగ్రెస్ నేతల అరెస్టును ఖండిస్తున్నట్టు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
న్యాయం చేయాలి: బండి
రాష్ట్ర ప్రభుత్వం మిడ్‌మానేరు బాధితుల డిమాండ్లపై స్పందించి వెంటనే న్యాయం చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. ముంపు బాధితులకు న్యాయం చేయాలని ఆందోళన చేస్తున్న జేఏసీ, బీజేపీ నేతలను, మహిళలను అరెస్ట్ చేయడాన్ని ఆయన ఒక ప్రకటనలో ఖండించారు. అరెస్ట్ చేసిన వారిని బేషరతుగా విడుదల చేయాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment