కోట్ల గొంతుకలు.. ఒక్క స్వరమై | mass singing of national anthem telangana hyderabad | Sakshi
Sakshi News home page

సామూహిక జాతీయ గీతాలాపనతో మార్మోగిన తెలంగాణ

Published Wed, Aug 17 2022 1:37 AM | Last Updated on Wed, Aug 17 2022 7:15 AM

mass singing of national anthem telangana hyderabad - Sakshi

మంగళవారం ఉదయం 11.30 గంటలు.. రాష్ట్రంలో ఓ అద్భుత ఘట్టానికి తెర లేచింది.. హైదరాబాద్‌లో అన్ని చౌరస్తాల్లో రెడ్‌ సిగ్నల్‌ పడింది.. వాహనాలన్నీ ఆగిపోయాయి.. మెట్రో రైళ్లన్నీ ఎక్కడివక్కడ నిలిచిపోయాయి.. హైదరాబాద్‌తోపాటు రాష్ట్రవ్యాప్తంగా రోడ్లపై ఉన్నవారి దగ్గర నుంచి కార్యాలయాలు, ఇళ్లలో ఉన్నవారు.. పంటపొలాల్లో పనిచేస్తున్నవారు.. పెళ్లి వేడుకల్లో ఉన్నవారు.. చివరకు అంత్యక్రియల్లో పాల్గొన్నవారు కూడా ఎక్కడివారు అక్కడ లేచి నిలబడి జాతీయ గీతాన్ని ఆలపించారు. కోట్లాది మంది ఒకేసారి గొంతు కలపడంతో రాష్ట్రం మొత్తం జనగణమనతో మార్మోగింది. హైదరాబాద్‌ అబిడ్స్‌ చౌరస్తాలో సీఎం కేసీఆర్‌ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

యావత్‌ తెలంగాణ రాష్ట్రం మంగళవారం జాతీయ గీతం ‘జనగణమన’తో మార్మోగిపోయింది. ఉద యం 11.30 గంటలకు  ఎక్కడున్నవార క్కడే నిలబడి సామూహికంగా జాతీయ గీతాన్ని ఆలపించి దేశభక్తిని ఎలుగెత్తి చాటారు. కోట్ల మంది ఒకేసారి గొంతు కలపడంతో రాష్ట్రమంతటా ప్రతిధ్వనించింది. ఓ అద్భుతం ఆవిష్కృతమైంది. భరతమాత మది పులకించింది. స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఇచ్చిన పిలుపు మేరకు.. ఊరూవాడ, పల్లెపట్నం అనే తేడా లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రధాన కూడళ్లు, ప్రభుత్వ కార్యాలయాలు, బడులు, కళాశాలలు, ఇతర విద్యాసంస్థలు, ప్రైవేటు సంస్థలు, అంగన్‌వాడీలు, పంట పొలాల్లో సైతం ప్రజలు జాతీయ గీతాన్ని ఆలపించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, ప్రముఖులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సీఎంతో గొంతు కలిపిన జనం 
సీఎం కేసీఆర్‌.. పలువురు మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి అబిడ్స్‌ సర్కిల్‌ వద్ద నిర్వహించిన ‘సామూహిక జాతీయ గీతాలాపన’ కార్యక్రమంలో పాల్గొన్నారు. తొలుత దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం వేదికపై నుంచి నిర్దేశిత సమయంలో జాతీయ గీతాలాపననను ఆయన ప్రారంభించారు. చౌరస్తాకు నలు దిక్కులతో పాటు భవనాలపై నుంచి వేలాది మందితో కూడిన జన సమూహం సీఎం కేసీఆర్‌తో గొంతు కలిపి ముక్త కంఠంతో ‘జనగణమన’ పాడారు. దీంతో అబిడ్స్‌ ప్రాంతం జాతీయ గీతాలపనతో ప్రతిధ్వనించింది. గీతాలాపన ముగియగానే..జై భారత్‌...భారత్‌ మాతా కీ జై...జై తెలంగాణ...అంటూ సీఎం కేసీఆర్‌ పిడికిలెత్తి నినదించారు.

అనంతరం ‘బోలో స్వతంత్ర భారత్‌ కీ జై’ నినాదం మారుమోగింది. హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ, వజ్రోత్సవ కమిటీ చైర్మన్‌ ఎంపీ కె.కేశవరావు, మంత్రులు మహమూద్‌ అలీ, తలసాని శ్రీనివాస్‌ యాదవ్, వేముల ప్రశాంత్‌రెడ్డి, వి.శ్రీనివాస్‌ గౌడ్, ఎర్రబెల్లి దయాకర్‌ రావు, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీలు మధుసూదనాచారి, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, బేతి సుభాష్‌ రెడ్డి, ఎ.జీవన్‌ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్, ఇతర ప్రజాప్రతినిధులు, పలు సంస్థల చైర్మన్లు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

జిల్లాల్లో..
హన్మకొండలోని అంబేడ్కర్‌ సర్కిల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, జెడ్పీ చైర్మెన్‌ సుధీర్‌ కుమార్, హనుమకొండ జిల్లా కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు, వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ డా.తరుణ్, మున్సిపల్‌ కమిషనర్‌  ప్రావీణ్య పాల్గొన్నారు. వరంగల్‌ ఆర్టీవో ఆఫీస్‌ వద్ద 2 వేల మందితో సామూహిక జాతీయ గీతాలాపన నిర్వహించారు. నల్లబెల్లి మండలం మూడుచుక్కలపల్లిలో రైతులు పంట పొలాల్లో జాతీయ జెండాను ఎగురవేసి జాతీయ గీతాలాపన చేశారు.
నల్లగొండ జిల్లా కేంద్రంలోని క్లాక్‌ టవర్‌ సెంటర్‌లో జరిగిన కార్యక్రమంలో శాసన మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి పాల్గొన్నారు. యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌ ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద జరిగిన కార్యక్రమంలో మంత్రి జి.జగదీశ్‌రెడ్డి, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్‌ పాల్గొన్నారు. మిర్యాలగూడ టూ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ ఆధ్వర్యంలో భారత మాత చిత్రపటం ఆకారంలో నిలబడి విద్యార్థులు జనగణమన ఆలపించారు.
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో 150 అడుగుల జాతీయ జెండా వద్ద ఎమ్మెల్యే దివాకర్‌ రావు, కలెక్టర్‌ భారతీ హోళికెరీ, డీసీపీ అఖిల్‌ మహా జన్‌ వేలాది మందితో సామూహిక జాతీయ గీతాలాపన      నిర్వహించారు. 
ఖమ్మంలో కలెక్టర్‌ వీపీ గౌతమ్, సీపీ ఎస్‌.విష్ణువారియర్, వైరాలో ఎమ్మెల్యే రాములునాయక్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో ప్రభుత్వ విప్‌ రేగా కాంతారావు, పాల్వంచలో ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, కొత్తగూడెం జిల్లా కేంద్రంలో కలెక్టర్‌ అనుదీప్, జెడ్పీ చైర్‌పర్సన్‌ కోరంలు కనకయ్య సామూహిక జాతీయ గీతాలాపనలో పాల్గొన్నారు. 
మహబూబాబాద్‌ జిల్లా నరసింహులపేట మండలం పెద్దనాగారం గ్రామ పంచాయతీ పరిధిలో కూలీలు వరినాట్లు వేస్తూ జాతీయ గీతాలాపన చేశారు. వనపర్తి జిల్లాలో ఈ సందర్భంగా దాదాపు మూడు కిలోమీటర్ల జాతీయ పతాకం ప్రదర్శించారు.

చదవండి: రిపోర్టింగ్‌ టు ప్రియాంక

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement