సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో డెంగీ కేసులు పెరుగుతున్నాయని, దీనిపై సర్కారు యుద్ధం ప్రకటించిందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. ప్రతీ ఐదేళ్లకోసారి కేసులు పెరుగుతుంటాయని, ఇది ఐదో సంవత్సరం అయినందున పెరుగుతున్న తీరు గమనిస్తున్నామన్నారు. ఈ నేపథ్యంలో వైద్య ఆరోగ్య, పురపాలక, పంచాయతీ శాఖలు కలిసి పనిచేస్తే మంచి ఫలితాలు వస్తాయని చెప్పారు. మంత్రి కేటీఆర్‌తో కలిసి సోమవారం ఆయన జూమ్ ద్వారా వైద్య, జీహెచ్‌ఎంసీ, మున్సిపల్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ, జీహెచ్‌ఎంసీ పరిధిలో జూలైలో 542 డెంగీ కేసులుంటే, ఆగస్టులో 1,827 కేసులు నమోదయ్యాయన్నారు. కాబట్టి ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. స్వతంత్ర భారత్ వజ్రోత్సవాల సందర్భంగా పది వేల బ్లడ్ యూనిట్లు సేకరించామని, ఎంత రక్తం అవసరమైనా ఉచితంగా ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఈనెల 17న హైదరాబాద్, చుట్టుపక్కల నియోజకవర్గాల్లో రక్తదాన శిబిరాలు పెట్టి ఉచితంగా ప్రజలకు బ్లడ్ ఇచ్చేలా వైద్య ఆరోగ్య శాఖ తరపున ఏర్పాట్లు చేస్తామన్నారు. డెంగీ కేసులు ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో జీహెచ్‌ఎంసీ అధికారుల సమన్వయంతో వైద్య సిబ్బంది డోర్ టు డోర్ జ్వర సర్వే నిర్వహించాలని ఆదేశించారు. జ్వర సర్వేతోపాటు కరోనా వ్యాక్సిన్ బూస్టర్ డోస్‌ను ప్రతీ ఒక్కరికి జీహెచ్‌ఎంసీ పరిధిలో వేసేందుకు ప్రత్యేకంగా కృషి చేయాలని చెప్పారు.
ప్రతి ఆదివారం పది నిమిషాలు: కేటీఆర్
ఏయే వార్డుల్లో డెంగీ కేసులు ఎక్కువ ఉన్నాయో జీహెచ్‌ఎంసీ కమిషనర్లు, జోనల్, డిప్యూటీ కమిషనర్లు పరిశీలించాలని, నివారణకు ప్రత్యేక ప్రణాళిక తయారుచేయాలని మంత్రి కేటీఆర్ ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లోనూ ఈ ప్రణాళిక రూపొందించాలన్నారు. ‘గత మూడేళ్లలో ప్రతీ ఆదివారం పది గంటలకు పది నిమిషాలు ఇంటిని, పరిసరాలను శుభ్రం చేసే కార్యక్రమాన్ని బాగా చేశాం. ఈ కార్యక్రమంలో చిన్న పిల్లలు, మహిళలనూ భాగస్వాములను చేయాలి. మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఐఏఎస్ అధికారులు కూడా తమ గృహాల్లో ఈ కార్యక్రమం నిర్వహించాలి. కలెక్టర్లు జిల్లాల్లో ఈ కార్యక్రమం చేసేలా ఉంటే ప్రజల్లో చైతన్యం వస్తుంది. విద్యార్థులు, టీచర్లు, ప్రజా ప్రతినిధులు అందరూ పాల్గొని పని చేసేలా కార్యక్రమాలు రూపొందించాలి. ఈ కార్యక్రమంలో పాల్గొనే ఇళ్లకు స్టిక్కర్లు అతికించాలి. డిజిటల్ మాధ్యమంలో బాగా ప్రచారం నిర్వహించాలి’ అని కేటీఆర్ చెప్పారు. డెంగీ దోమలు మురికి నీళ్లలో కాకుండా మంచినీటిలో ఉంటాయని అందువల్ల నీరు నిలువ లేకుండా చూడాలని చెప్పారు. పోలీసులు కార్డన్ సెర్చ్ చేసినట్లు జీహెచ్‌ఎంసీ పరిధిలోని కాలనీలన్నింటిలో జ్వర సర్వే నిర్వహించాలని సూచించారు. హైదరాబాద్ సహా జిల్లాల్లో, డెంగీ కేసులున్న పట్టణ ప్రాంతాల్లోనూ జ్వర సర్వే ఉద్యమంలా నిర్వహించాలన్నారు.
ఇదీ చదవండి: ఏడాదిగా రోజూ రూ.లక్షల్లో డిపాజిట్
Comments
Please login to add a commentAdd a comment