Telangana: Minister KTR Open Letter To Center On The Hike In Petrol Prices - Sakshi
Sakshi News home page

KTR Letter To Center: కేంద్రానికి మంత్రి కేటీఆర్ బహిరంగ లేఖ.. ఏమన్నారంటే..?

Published Wed, Apr 6 2022 5:52 PM | Last Updated on Wed, Apr 6 2022 6:52 PM

Minister KTR Open Letter To Center On The Hike In Petrol Prices - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సబ్ కా సాథ్ సబ్ కా వికాస్ అని గప్పాలు చెప్పుకునే మోదీ పాలనలో సబ్ కా సత్తేనాశ్ అయిందని మంత్రి కేటీఆర్‌ విమర్శించారు. పెట్రో ధరల పెంపుపైన కేంద్ర ప్రభుత్వానికి ఆయన బహిరంగ లేఖ రాశారు. అంతర్జాతీయంగా ముడి చమురు రేట్టు పెరిగినా తగ్గినా దేశంలో రేటు పెంచడమే తమ పనిగా కేంద్ర ప్రభుత్వం పెట్టుకుందని ధ్వజమెత్తారు.

చదవండి: వివాదంలో తెలంగాణ హెల్త్‌ డైరెక్టర్‌.. ఖమ్మంలో విచిత్ర పూజలు..

‘‘దేశ ఆర్థిక వ్యవస్థను నడపలేక  బీజేపీ అవలంబిస్తున్న  అసమర్థ విధానాలే ప్రస్తుత ఈ దుస్థితికి కారణం. పన్నులు పెంచడమే పరిపాలనగా భ్రమిస్తోంది. దేశంలో ఉన్న 26 కోట్ల కుటుంబాల నుంచి 26.51 లక్షల కోట్ల రూపాయల పెట్రో పన్నును వేసిన పనికిమాలిన ప్రభుత్వం బీజీపిదే. ఒక్కో కుటుంబం నుంచి లక్ష రూపాయాల పెట్రో పన్నును కేంద్రం దోచుకుంది. ప్రతిది దేశం కోసం  ధర్మం కోసం అంటారు. ఈ దోపిడీ కూడా... దేశం కోసం.. ధర్మం కోసమేనా?.

ఒకవైపు భారీగా పెట్రో ధరలను పెంచుతున్న కేంద్రం నీతిలేకుండా రాష్ట్ర ప్రభుత్వాలు పన్నులు తగ్గించాలన్న వితండ వాదం చేస్తుంది. పెట్రో ధరల పేరిట ప్రజల జేబులను దోచుకుంటున్న పార్టీ బీజేపీ. అందుకే అచ్చేదిన్ కాదు అందర్నీ ముంచే దిన్ అనుకుంటున్నారు. ప్రజలను దోపిడి చేయడమే లక్ష్యంగా కేంద్రంలోని బిజెపి సర్కారు ప్రధానమంత్రి పెట్రో పన్ను యోజన పథకాన్ని ప్రవేశపెట్టింది. పెట్రో ధరల పెంపును అడ్డుకోవడంలో విఫలమయ్యామని దేశ ప్రజలను ప్రధాని క్షమాపణ కోరాలి. పెట్రో ధరల బాదుడు ఆపకపోతే.. ప్రజలు తిరస్కరించడం ఖాయం’’ అంటూ కేటీఆర్‌లో లేఖలో దుయ్యబట్టారు.

లేఖలో ఏమన్నారంటే..
ప్రతీ రోజూ ప్రజల రక్తం పీల్చేలా పెంచుతున్న పెట్రో ధరల పెంపుపైన కేంద్ర ప్రభుత్వానికి ఈ బహిరంగ లేఖ రాస్తున్నాను. ఒకవైపు నిరంతరం ధరలను పెంచుతూనే మరోవైపు ఆ పాపాన్ని రాష్ట్ర ప్రభుత్వాలపై నెట్టే ఒక కుటిల ప్రయత్నానికి కేంద్రంలోని బీజేపీ ఒడిగడుతుంది. నిజం చెప్పులేసుకునేలోపు అబద్ధం ఊరంతా బలాదూర్‌గా తిరిగొస్తుంది. అందుకే  దేశ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా అత్యంత భారీగా పెట్రో రేట్లు పెంచిన కేంద్ర ప్రభుత్వ అసమర్థ విధానాలు, అది చేస్తున్న అసత్య ప్రచారాన్ని ప్రజల ముందు ఎండగట్టేందుకే  ఈ లేఖ రాస్తున్నాను.

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజలపై ఎక్కడలేని ప్రేమను ఒలకబోసి, పేదల బాధల పట్ల మొసలి కన్నీరు కార్చిన నరేంద్ర మోదీ, అధికారంలోకి వచ్చినంక ప్రజల్ని లెక్క చేయకుండా, ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలి పాలిస్తున్నారు. నరేంద్రమోదీ ప్రధాన మంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేసిన తొలినాళ్ల నుంచే తన చేతకానితనం, తమకు అస్సలు తెలియని ఆర్థిక విధానాలతో ప్రజల్ని పీడించుకు తింటున్నది కేంద్ర ప్రభుత్వం. నేనిలా విమర్శించడానికి అడ్డూ అదుపు లేకుండా రోజువారీగా పెరుగుతున్న పెట్రో రేట్లు, ఆకాశాన్ని దాటి అంతరిక్షానికి చేరుకుంటున్న నిత్యావసరాల ధరలే కారణం. సబ్ కా సాథ్ సబ్ కా వికాస్ అని గప్పాలు చెప్పుకునే మోదీ గారి పాలనలో సబ్ కా సత్తేనాశ్ అయింది. ధరలను అదుపు చేయడం చేతగాని మోదీ ప్రభుత్వం అందుకు కారణాలుగా చెపుతున్న అంశాలన్నీ శుద్ధ అబద్దాలే.

అంతర్జాతీయ ముడి చమురు సరఫరాలో తలెత్తుతున్న ఇబ్బందులనీ కొన్నిరోజులు, ముడి చమురు ధరల పెరుగుదల అని ఇంకొసారి, రష్యా ఉక్రెయిన్ యుద్ధం అని ఇంకొన్ని రోజులు బీజేపీ నేతలు కహానీలు చెప్పారు. కాని ఇదంతా నిజం కాదు. అమెరికా, కెనడా, యూకే, జర్మనీ, ఫ్రాన్స్ లో కూడా ధరలు పెరుగుతున్నాయని చెపుతున్న కేంద్రమంత్రులు అక్కడ లీటర్ పెట్రోల్ రేట్ మనకంటే తక్కువే అన్న సంగతిని కావాలనే దాస్తున్నారు. అంతెందుకు పక్కనున్న దాయాది దేశాలతో పాటు, అర్ధిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకలోనూ ఇప్పటికి అత్యంత చవక ధరకే పెట్రో ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. 

2014 లో బిజెపి ప్రభుత్వం గద్దెనెక్కిన నాటికి అంతర్జాతీయంగా ఉన్న ముడిచమురు ధర సుమారు 105 డాలర్లు. ఆ తర్వాత వివిధ కారణాల వలన ఒకానొక దశలో సుమారు 40 డాలర్ల దిగువకు ముడిచమురు ధరలు తగ్గినా దేశంలో మాత్రం పెట్రో ధరలను బీజేపీ ప్రభుత్వం పెంచుతూనే ఉంది. పేద, మధ్యతరగతి ప్రజలంటే కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వానికి కనికరం లేదనడానికి కరోనా సంక్షోభం కాలంలో పెంచిన ఎక్సైజ్ సుంకమే సాక్ష్యం. కరోనా సంక్షోభంలో బ్యారెల్ ముడిచమురు ధర 20 డాలర్ల కంటే తక్కువకు పడిపోయింది. ఫలితంగా దేశంలో భారీగా పెట్రో రేట్లు తగ్గాల్సి ఉండే. కాని కరొనా సంక్షోభంలో వలస కూలీలను వేల మైళ్లు నడిపించిన కనికరంలేని మోడీ ప్రభుత్వం మాత్రం ప్రజలు  తగ్గిన ధరల ప్రయోజం పొందకుండా ఎక్సైజ్ సుంకాన్ని 20 రూపాయలు పెంచింది. దీంతో తక్కువ రేటుకు పెట్రో ఉత్పత్తులను మన దేశ ప్రజలు పొదలేకపోయారు. 2014లో సుమారు 70.51 రూపాయలుగా ఉన్న పెట్రోల్ ధరను, రు.53.78 గా ఉన్న డీజిల్ ధరను క్రమంగా పెంచుతూ ఈరోజుకి 118.19 కి, డీజిల్ ను 104.62 కు పెంచింది. అంతర్జాతీయంగా ప్రస్తుతం క్రూడ్ ఆయిల్ ధర 106 డాలర్లుగా ఉన్నది. 2014 లో క్రూడ్ ఆయిల్ కు ఎంత ధర ఉందో ఇప్పుడు కూడా అంతే ఉంది. కాని  2014లో మనదేశంలో లీటర్ పెట్రోల్ ఎంత ధరకు దొరికేదో ఇప్పుడు మాత్రం అంతకు దొరకడం లేదు.  రేటు రెట్టింపు అయింది. ఇది ఎలా అయింది? ఎందుకు అయింది? ఏ ప్రయోజనాల కోసం ఇలా ధరలను ఇష్టం వచ్చినట్టు పెంచుతున్నారో ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత బీజేపీ నాయకులపై ఉంది. 

దేశ ఆర్థిక వ్యవస్థను నడపలేక  బీజేపీ అవలంబిస్తున్న  అసమర్థ విధానాలే ప్రస్తుత ఈ దుస్థితికి కారణం. సంపదను సృష్టించే తెలివి లేక, చేతిలో ఉన్న అధికారంతో విపరీతంగా పన్నులు పెంచుతూ దాన్నే సుపరిపాలనగా భావిస్తున్న భావదారిద్ర్యంలో కేంద్రంలోని బీజేపీ పెద్దలు ఉన్నారు. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా  దేశంలో ఉన్న  26 కోట్ల కుటుంబాలపై ఏడున్నర సంవత్సరాలుగా 26.51 లక్షల కోట్ల రూపాయల పెట్రో పన్నును వేసిన పనికిమాలిన ప్రభుత్వం బీజీపిదే. అంటే సగటున ఒక్క కుటుంబం నుంచి లక్ష రూపాయలను దౌర్జన్యంగా పెట్రో ధరల పెంపు పేరుతో లూఠీ చేసింది మోడీ ప్రభుత్వం. ప్రతిది దేశం కోసం  ధర్మం కోసం అంటారు. ఈ దోపిడీ కూడా... దేశం కోసం.. ధర్మం కోసమేనా? దేశ ప్రజలకు సమాధానం చెప్పాలి.

అంతర్జాతీయంగా చవక ధరలకు పెట్రో ఉత్పత్తులను కొని అధిక ధరలకు దేశ ప్రజలకు అమ్ముకుంటున్న దళారి ప్రభుత్వం నరేంద్ర మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం. బహిరంగంగా తాను చేస్తున్న దోపిడిని రాష్ట్ర ప్రభుత్వాలపైకి నెట్టి చేతులు దులుపుకుంటున్న బట్టేబాజ్ సర్కార్ కేంద్రంలో ఉంది. ఒకవైపు భారీగా పెట్రో ధరలను పెంచుతున్న కేంద్రం నీతి లేకుండా రాష్ట్ర ప్రభుత్వాలు పన్నులు తగ్గించాలన్న వితండ వాదాన్ని తీసుకొచ్చింది. ఇందులోని మర్మాన్ని సవిరంగా ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. 

2014కు ముందుకు పెట్రోల్పై ఎక్సైజ్‌ డ్యూటీ రూ.9.48గా ఉండేది. అధికారంలోకి వచ్చినంక మోదీ దాన్ని రూ.32.98కి పెంచారు. గతేడాది కాస్త తగ్గించి దాన్ని రూ.27.90 చేశారు. ఈ ఎక్సైజ్ డ్యూటీలో 41 శాతం రాష్ట్రాలకే తిరిగి వస్తుందంటూ కేంద్ర మంత్రులతో పాటు వాట్సాప్ యూనివర్సిటీ బ్యాచ్ సోషల్ మీడియాలో డప్పు కొడుతున్నది. కాని ఇది పచ్చి అబద్ధం. పెట్రోల్ ధరలో ఎక్సైజ్ డ్యూటీ పేరుతో కేంద్ర ప్రభుత్వం వసూలు చేస్తున్న దాంట్లో అన్ని రాష్ట్రాలతో పంచుకునేది బేసిక్ ఎక్సైజ్ డ్యూటీ మాత్రమే. ఇప్పుడున్న పెట్రో ధరలో బేసిక్ ఎక్సైజ్ డ్యూటీ ఒక రూపాయి 40 పైసలు మాత్రమే. ఇందులో నుంచి 41 శాతాన్ని అంటే అక్షరాల 57 పైసల్ని  కేంద్రం, అన్ని రాష్ట్రాలకు పంచుతుంది. ఇందులో తెలంగాణ వాటా 2.133 శాతం. అంటే లీటరుకు 0.01 పైసలు. కానీ 28 రూపాయల ఎక్సైజ్ డ్యూటీ ముక్కుపిండి వసూలు చేస్తున్న మోదీ సర్కార్, అందులో నుంచి ఆఠాణా మాత్రమే రాష్ట్రాలకు ఇస్తూ ఏదో ఘనకార్యం చేస్తున్నట్టు గప్పాలు కొట్టుకుంటుంది.

రాష్ట్రాలను బలహీనపరిచే కుట్రలను అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచి అమలు చేస్తున్న నరేంద్ర మోదీ, పెరుగుతున్న పెట్రో ధరలతో కేంద్ర ప్రభుత్వ ఖజానా మాత్రమే నిండేలా చూసుకుంటున్నారు. అందుకే బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సుంకాల రూపంలో కాకుండా సెస్సుల రూపంలో పెట్రో రేట్లు పెరుగుతున్నాయి. రోడ్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్‌ కోసం 18 రూపాయలు, వ్యవసాయ, మౌలిక వసతులు అభివృద్ధి పేరిట రెండున్నర రూపాయలు, ప్రత్యేక అదనపు ఎక్సైజ్ డ్యూటీ పేరిట పదకొండు రూపాయలను ఇలా ప్రతి దానికి ఒక్కో పేరు చెప్పి దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అత్యంత భారీగా 30 రూపాయలకు పైగా సెస్సులను పెట్రో ధరల పేరుతో మోదీ సర్కార్ వసూలు చేస్తోంది.ఇందులో నుంచి రాష్ట్రాలకు దక్కేది గుండు సున్నానే..

ఒక వైపు కేంద్ర ప్రభుత్వం 2014 నుంచి దాదాపు పెట్రో ధరలను రెట్టింపు చేసినా, తెలంగాణ ప్రభుత్వం మాత్రం 2015 నుండి ఇప్పటిదాకా వ్యాట్ టాక్స్  ఒక్క నయాపైసా కూడా పెంచలేదన్న సంగతిని ప్రజలంతా గమనించాలని కోరుతున్నాను. పెట్రో ధరల పేరిట పట్టపగలు ప్రజల జేబులను దోచుకుంటున్న పార్టీ బీజేపీ అన్న విషయాన్ని ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. అందుకే అచ్చేదిన్ కాదు అందర్నీ ముంచే దిన్ అనుకుంటున్నారు.

దేశంలో రాజ్యాంగబద్ధంగా ప్రతి ఐదేళ్లకోసారి ఎన్నికలు రావాలి. కానీ బీజేపీ అవకాశవాద, అసమర్థ విధానాలను చూసిన తర్వాత తరచూ ఎన్నికలు వస్తే బాగుంటుందని, అట్లయిన పెట్రోలు ధరల పెంపు ఆగుతుందన్న ఆలోచనల్లోకి ప్రజలు వచ్చారు. పెట్రో ధరల పెంపును ఒక రాజకీయ అంశంగా వాడుకుంటున్న బీజేపీ ఎన్నికల తర్వాత అత్యంత కర్కశంగా వరుసగా పెట్రో ధరలను పెంచుకుంటూ పోవడాన్ని అలవాటుగా మార్చుకుంది. 2017 గుజరాత్ ఎన్నికలు, 2019 సాధారణ ఎన్నికలు, 2020లో 5 రాష్ట్రాల ఎన్నికల సందర్భంగా కొన్ని వారాలు, నెలలపాటు పెట్రో ధరలను కేంద్ర ప్రభుత్వం పెంచలేదు. కాని ఫలితాలు వచ్చిన మరుక్షణం నుంచి దాదాపు ప్రతీ రోజూ పెట్రో ధరల్ని మోదీ సర్కార్ పెంచుకుంటూ పోతున్నది. గత పదిహేను రోజుల్లో 13 సార్లు పెట్రోల్ ధరలను పెంచి ప్రజలన్నా, ప్రజల కష్టాలన్నా తనకు ఎంత చులకనభావం ఉందో మోదీ సర్కార్ చాటుకుంది. నాలుగు రాష్ట్రాల్లో గెలిపించిన పాపానికి.  ప్రజలకు మోదీ ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ ఇదే. ఒక్క మాటలో చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వం తనకు చేతకాని పాలనను పక్కనపెట్టి కేవలం పెట్రో ధరలను పెంచడాన్నే అలవాటుగా మార్చుకుందంటే  అతిశయోక్తి కాదు.                 

పెట్రో ధరలు ఎందుకు పెరుగుతున్నాయని అడిగిన ప్రతీసారి అదరకుండా, బెదరకుండా అబద్దాన్ని చెప్పే దొంగ నేర్పు ప్రస్తుత కేంద్ర మోదీ సర్కార్ కు పుష్కలంగా ఉంది. అందుకే తాజా ధరల పెరుగుదలకు రష్యా, ఉక్రెయిన్ సంక్షోభాన్ని సాకుగా కేంద్ర మంత్రులు చూపిస్తున్నారు. లోక్ సభలో పెట్రోలియం, నేచురల్ గ్యాస్ మంత్రి రామేశ్వర్ తేలి చేసిన ప్రకటన ప్రకారం రష్యా నుంచి కేవలం ఒక్క శాతం కన్నా తక్కువ క్రూడాయిల్ ను మనం దిగుమతి చేసుకుంటున్నాము. ఇరాక్, సౌదీ అరేబియా, యూఏఈ, నైజీరియా, అమెరికా నుంచే మనం అత్యధికంగా పెట్రో ఉత్పత్తుల్ని దిగుమతి చేసుకుంటున్నాము. రష్యా, ఉక్రెయిన్ యుద్ధంతో  ఈ దేశాల నుంచి మనకు పెట్రో ఉత్పత్తులు రావడంలో ఎలాంటి ఇబ్బందులు లేవు. కాని రష్యా నుంచి దిగుమతి చేసుకుంటున్న ఒక్క శాతాన్ని చూపించి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం బీజేపీ నాయకులు చేస్తున్నారు. ఇలా పదే పదే అబద్దాలను వల్లె వేసీ..వేసీ.. బీజేపీ నాయకుల నోట్లోని నాలుకలు కూడా సిగ్గుపడుతున్నాయి. 

మానవత్వం అస్సలు లేని ప్రభుత్వం దేశ ప్రజల నెత్తి మీద తిష్ట వేసుకుని కూర్చుంది. కరోనా సంక్షోభాన్ని అత్యంత్య దారుణంగా మార్చిన మోదీ సర్కార్, ఆ టైంలో పంపిణీ చేసిన ఆహార ధాన్యాలు, వ్యాక్సిన్ల ఖర్చును పెట్రోల్ ధరలతో వసూలు చేసుకుంటామని సిగ్గులేకుండా ప్రకటించింది. ప్రభుత్వ పరిపాలన అంటే ప్రజలపై భారీగా పన్నులు వసూలు చేయడమే అన్న స్ఫూర్తితోనే  నరేంద్ర మోదీ సర్కార్ పనిచేస్తున్నట్టు కనిపిస్తోంది. ప్రజలను దోపిడీ చేయడమే లక్ష్యంగా కేంద్రంలోని బీజేపీ సర్కారు ప్రధానమంత్రి పెట్రో పన్ను యోజన పథకాన్ని ప్రవేశపెట్టిందనిపిస్తుంది. సమర్థ విధానాలు, నిర్ణయాలతో సంపదను సృష్టించి ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తూ.. సృష్టించిన సంపదను ప్రజలకు పంపిణీ చేయాలి కానీ కేవలం పన్నుల పేరిట ప్రజలను పీల్చిపిప్పి చేయడమే పరిపాలనగా భావిస్తున్న, బీజేపీ ప్రభుత్వాన్ని కచ్చితంగా ప్రజలు సాగనంపే రోజు దగ్గర పడింది. పెట్రో ధరల బాదుడు ఆపకపోతే.. ప్రజలు మిమ్మల్ని తిరస్కరించడం ఖాయం

పెట్రో రేట్ల పెరుగుదలతో ప్రతీ ఒక్కరి దైనందిత జీవితం తీవ్రంగా ప్రభావితం అవుతుంది. ఇంట్లో వాడే గ్యాస్, పప్పు, ఉప్పు, ఔషధాల ధరలు కూడా భారీగా పెరుగుతున్నాయి. సామాన్యుడి బతుకు దిన దిన గండంగా మారింది.  బీజేపీ హయాంలో గ్యాస్ బండ.. మోయలేని గుదిబండగా మారింది. దీంతో మోడీ చెప్పిన  పకోడీలు అమ్ముకుని బతికే పరిస్థితి కూడా లేదు.  పెట్రో ధరల పెంపుతో దేశ ఆర్థిక వ్యవస్థ తిరోగమన దశలోకి వచ్చింది. ప్రజలు బైకులు, కారులు వదిలేసే పరిస్ధితి నెలకొంటున్నది. వంట గ్యాస్ వెయ్యి దాటడంతో మళ్లీ కట్టెల పొయ్యే దిక్కైంది. వ్యవసాయ పెట్టుబడివ్యయం పెరిగిపోతున్నది. ఇన్నేళ్ల పాలనలో బీజేపీ సాధించిన ఘనకార్యాలు ఏమన్నా ఉన్నాయా అంటే అవి పెట్రో వాతలు.. ధరల మోతలే..

అధికారంలోకి రావడానికి ముందు పెట్రో ధరల పెంపును రాజకీయాస్త్రంగా మార్చుకున్న నరేంద్ర మోదీ ఆనాటి తన మాటలు, చేతలను ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. కరోనా సంక్షోభంతో ఉద్యోగాలు పోయి ఆదాయాలు తగ్గి, నిరుద్యోగిత పెరిగిన ప్రస్తుత పరిస్థితుల్లో పెట్రో రేట్ల పెంపుతో  ప్రజా జీవితం అస్తవ్యస్తం అవుతున్న విషయాన్ని ఇప్పటికైనా ప్రధాని నరేంద్ర మోదీ గుర్తించాలి. తన అసమర్థ ప్రభుత్వ పనితీరు, వైఫల్యాల పై వివరణ ఇవ్వాలి. పెట్రో ధరల పెంపును అడ్డుకోవడంలో విఫలమయ్యామని దేశ ప్రజలను క్షమాపణ కోరాలి. పెట్రో ధరల పెంపు ధర్మసంకటం అన్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్  మాటల్ని ప్రజలు సీరియస్‌గా పట్టించుకున్న రోజు, ధర్మ సంకటాన్ని వీడి కేంద్ర ప్రభుత్వంపై తిరగబడే పరిస్థితి త్వరలోనే వస్తది. పెట్రో ధరల బాదుడు ఆపకపోతే.. ప్రజాక్షేత్రంలో తిరస్కారం తప్పదు అన్న సంగతిని గుర్తుంచుకుని వెంటనే పెట్రో, గ్యాస్ ధరల పెంపుని ఆపాలి. ప్రజలకు ప్రయోజనం కలిగేలా పెట్రో రేట్లను తగ్గించేందుకు వేంటనే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని దేశ ప్రజల తరపున నేను విజ్ఞప్తి చేస్తున్నాను.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement