Telangana Minister KTR Open Letter To Center Over Petrol Prices Loot - Sakshi
Sakshi News home page

2013లో లీటర్‌ పెట్రోల్‌ రూ.76.. ఇప్పుడేమో 110.. ఆ మాటలు అక్షర సత్యాలు: కేటీఆర్‌

Mar 30 2023 5:05 PM | Updated on Mar 30 2023 8:32 PM

Telangana Minister KTR Open Letter To Center Over Petrol Prices Loot - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పెట్రో ఉత్పత్తుల ధరలను విపరీతంగా పెంచి సామాన్యుల నడ్డి విరుస్తున్న కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలకు వెంటనే క్షమాపణ చెప్పాలని తెలంగాణ మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా పెట్రోల్,  డీజిల్ ధరలను అమాంతం పెంచేసి బీజేపీ ప్రభుత్వం దేశ ప్రజలను నిలువునా దోచుకుంటోందని ఫైర్ అయ్యారు. ఈ దోపిడీకి అంతర్జాతీయ ముడిచమురు ధరలను బూచిగా చూపించి కేంద్రం ఇంతకాలం చెప్పిన మాటలన్నీ  కల్లబొల్లి కబుర్లేనని తేలిపోయిందన్నారు. ఈమేరకు ఆయన కేంద్ర ప్రభుత్వానికి బహిరంగ లేఖ రాశారు.

'2013లో ఒక బ్యారెల్ ముడి చమురు ధర 110 డాలర్లు ఉన్నప్పుడు, దేశంలో లీటర్ పెట్రోల్ రేటు కేవలం 76 రూపాయలు. కానీ నేడు బ్యారెల్ ముడిచమురు రేటు దాదాపు సగం పడిపోయినా.. అంటే 66 డాలర్లకు తగ్గినా, ప్రస్తుతం పెట్రోల్ ధర లీటర్ కు 110 రూపాయలు ఉండడమే ఇందుకు నిదర్శనం. అందుకే దేశంలో పెట్రోల్ ధరల పెంపునకు కారణం ముడిచమురు కాదని, మోడీ నిర్ణయించిన చమురు ధరలేనని మనం గతంలో చెప్పిన మాటలు అక్షర సత్యాలని మరోసారి రుజువైంది.

కేవలం ముడి చమురును ఒక బూచిగా చూపించి తన కార్పొరేట్ మిత్రుల ఖజానాను లాభాలతో నింపేందుకు మోడీ ప్రభుత్వం అంతర్జాతీయ ముడి చమురులు ధరలతో ఏమాత్రం సంబంధం లేకుండా దేశంలో పెట్రోల్ ధరను అమాంతం పెంచుకుంటూ పోతున్నది. పెట్రోల్ డీజిల్ ధరలను విపరీతంగా పెంచడం వల్ల దేశంలోని పేద, సామాన్య మధ్యతరగతి ప్రజానీకం ధరల భారంతో తీవ్రంగా ఇబ్బందులు పడుతోంది.  2014 నుంచి ఇప్పటిదాకా దాదాపు 45% పైగా పెట్రో ధరల పెంపు వల్ల సరుకు రవాణా భారమై, సామాన్యుడు కొనుగోలు చేసే ప్రతి సరుకు ధర భారీగా పెరిగింది.

నిత్యావసర వస్తువులు, కూరగాయల నుంచి మొదలుకొని పప్పు ఉప్పు వరకు అన్ని రకాల ప్రాథమిక అవసరాల ధరలు ఆకాశాన్ని అంటాయి. భారీగా పెరిగిన డీజిల్ ధరల వలన ప్రజా రవాణా వ్యవస్థ సంక్షోభం అంచున చేరుతోంది. దీంతో అన్ని రాష్ట్రాల్లో ప్రజా రవాణా చార్జీలను పెంచాల్సిన అనివార్య పరిస్థితిని కేంద్ర ప్రభుత్వం సృష్టించింది. అలాగే కేంద్ర ప్రభుత్వ వైఫల్యం వల్ల గత నలభై ఐదు సంవత్సరాలలో ఎప్పుడు లేనంత ద్రవ్యోల్భనం దేశాన్ని పట్టిపీడిస్తోంది. 
 
ఇన్నాళ్లు అంతర్జాతీయ ముడి చమురు ధరల ప్రస్తావన లేదా ఉక్రెయిన్- రష్యా యుద్ధం పేరు చెప్పి దేశ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాన్ని మోడీ ప్రభుత్వం చేసింది. కానీ ఒకవైపు రష్యా నుంచి అత్యంత తక్కువ ధరకు చమురు దేశానికి భారీగా దిగుమతి చేసుకుంటున్నామని చెప్పుకుంటున్న కేంద్ర ప్రభుత్వం, మరోవైపు తక్కువ ధరకు ముడిచమురు అందుబాటులో ఉన్నా, ప్రజల జేబుల నుంచి పెట్రోల్ ధరల పేరుతో చేస్తున్న దోపిడీకి మాత్రం సమాధానం చెప్పడం లేదు.  కేంద్ర ప్రభుత్వం చెబుతున్న 35 వేల కోట్ల రూపాయల ముడిచమురు పొదుపు ప్రయోజనమంతా కేవలం  ఒకటి రెండు ఆయిల్ కంపెనీలకే దక్కిందన్నది వాస్తవం.

ఈ ధరల పెరుగుదల అంశం పార్లమెంటులో చర్చకు రాకుండా కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తుంది. అయితే దేశ ప్రజలు మోడీ ప్రభుత్వం చేస్తున్న ఈ పెట్రో దోపిడీని గమనిస్తున్నారు. పెరిగిన పెట్రోల ధరల తాలూకు దుష్పరిణామాలను అనుభవిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వమే ఒక దోపిడీదారుగా మారి ప్రజల జేబులో నుంచి దోచుకుంటున్న పెట్రో భారం తగ్గాలంటే, భారతీయ జనతా పార్టీని వదిలించుకోవడమే ఏకైక మార్గం. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఈ దోపిడీని ఆపాలి, లేకుంటే ప్రజల చేతిలో  కేంద్ర ప్రభుత్వానికి గుణపాఠం తప్పదు.' అని కేటీఆర్ లేఖలో పేర్కొన్నారు.
చదవండి: రాహుల్ గాంధీని కోర్టుకు ఈడుస్తా.. కాంగ్రెస్‌ నేతపై లలిత్ మోదీ ఫైర్..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement