పోలీసు స్టేషన్ నూతన భవనాన్ని ప్రారంభిస్తున్న హోం మంత్రి మహమూద్ అలీ, చిత్రంలో మంత్రులు తలసాని, మల్లారెడ్డి, డీజీపీ మహేందర్ రెడ్డి, సీపీ అంజనీకుమార్
సాక్షి, కంటోన్మెంట్: తెలంగాణ పోలీసు శాఖలో వచ్చే ఏడాది 20 వేల పోస్టులు భర్తీ చేయనున్నట్లు హోంశాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. నార్త్‌జోన్ పరిధిలోని కార్ఖానా పోలీసుస్టేషన్ నూతన భవనాన్ని ఆయన బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మహమూద్ అలీ మాట్లాడుతూ.. రాష్ట్రంలో గడిచిన ఆరేళ్లలో 27 వేల మంది పోలీసు పోస్టులు భర్తీ చేశామన్నారు. మహిళల భద్రతకు కీలక ప్రాధాన్యం ఇస్తూ షీటీమ్స్, భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశామని, వీటి సంఖ్యను పెంచుతున్నామని హోం మంత్రి వెల్లడించారు. మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ బోయిన్‌పల్లిలో ఆగిపోయిన నూతన పోలీసుస్టేషన్ భవన నిర్మాణాన్ని పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు సూచించారు. రాష్ట్రంలో నేరాల నిరోధానికే ప్రాధాన్యమిస్తున్నామని డీజీపీ ఎం.మహేందర్ రెడ్డి అన్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్, నగర కమిషనర్ అంజనీకుమార్, కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న, పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ ఓలేటి దామోదర్, కంటోన్మెంట్ బోర్డు ఉపాధ్యక్షుడు రామకృష్ణ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment