సాక్షి, కరీంనగర్: కాంగ్రెస్ ఆరు గ్యారంటీలకు సంబంధించి ఈ నెల 28వ తేదీ నుంచి జనవరి 6వ తేదీ వరకు గ్రామ పంచాయతీల్లో దరఖాస్తులు స్వీకరిస్తామని నీటి పారుదల, పౌర సరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. కొత్త రేషన్ కార్డుల జారీపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని, రేషన్ కార్డులు లేని వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఇప్పుడు వచ్చే దరఖాస్తుల ఆధారంగా కొత్త రేషన్ కార్డులు త్వరలో అందిస్తామన్నారు.
మంగళవారం కరీంనగర్ కలెక్టరేట్‌లో ప్రజాపాలన, గ్రామసభల నిర్వహణపై జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధికారులతో ఉత్తమ్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, నాలుగు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ.. అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పారు.
ఉమ్మడి జిల్లా అధికారులందరూ పారదర్శకంగా విధులు నిర్వర్తించాలని, ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులన్నీ స్వీకరించాలని పేర్కొన్నారు. ఎట్టి పరిస్థితుల్లో తిరస్కరించరాదని తెలతిపారు. ప్రజా పాలన, ఆరు గ్యారంటీల విషయంలో అధికారులు ఏమైనా సందేహం ఉంటే ఎప్పుడైనా తనను సంప్రదించవచ్చని పేర్కొన్నారు. లబ్ధిదారుల అర్హత అంశాలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు.. ప్రజల ఆకాంక్షలతో ఏర్పడిన తమ ప్రభుత్వం పూర్తి పారదర్శక పాలన అందిస్తుందని తెలిపారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్ మెడిగడ్డ అన్నారం వైఫల్యాలపై 29వ తేదీన పరిశీలన కోసం వెళ్తున్నామని, పరిశీలన అనంతరం విచారణ చేయిస్తామన్నారు. జిల్లాలో రైస్ మాఫియా నడుస్తుందని, వారిని వెంటనే అపాలని హెచ్చరిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పథకాలు ప్రజలందరికీ వెళ్ళాలి అన్నదే మా ప్రభుత్వ ద్వేయమని తెలిపారు.
చదవండి: ఆరు గ్యారంటీలకు ‘రేషన్ కార్డు’ మస్ట్: సీఎం రేవంత్
Comments
Please login to add a commentAdd a comment