
తప్పిపోయిన బాలుడిని తల్లికి అప్పగిస్తున్న పటాన్‌చెరు పోలీసులు, అధికారులు
సాక్షి, పటాన్‌చెరు టౌన్: ఏడాది కిందట తప్పిపోయిన ఓ బాలుడు తల్లిదండ్రుల చెంతకు చేరాడు. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరువు పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ సాయిలు కథనం ప్రకారం.. పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన కిషన్‌దాస్, పూజ దంపతులు బతుకుదెరువు కోసం హైదరాబాద్ మాదాపూర్‌కు వచ్చి కూలీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో 2019లో వినాయక చవితి రోజున బాలుడు రాజ్‌కుమార్ దాస్ తప్పిపోయాడు. ఏడుస్తూ కూర్చొన్న ఆ బాలుడిని గమనించిన పాతబట్టలు అమ్ముతున్న హరణ్.. తనతో పాటు ఇంటికి తీసుకెళ్లాడు. పటాన్‌చెరు పట్టణంలోని సాయిరాంనగర్ కాలనీలో ఉండే హరణ్ మామ యాకోబ్‌కు పిల్లలు లేని కారణంగా వారికి అప్పజెప్పాడు. ఆ బాలుడికి కిరణ్ అని పేరు పెట్టి పోషిస్తున్నారు.
అయితే.. స్థానికుల ఫిర్యాదు మేరకు.. జిల్లా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అధికారులు జూన్ 16న పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో హరణ్, యాకోబ్, సరోజపై పోలీసులు కేసు నమోదు చేసి బాలుడిని సంగారెడ్డి శిశువిహార్‌కు పంపించారు. దర్యాఫ్తులో భాగంగా బాలుడి తల్లిదండ్రులది పశ్చిమ బెంగాల్ అని గుర్తించిన పోలీసులు.. తండ్రి కిషన్‌దాస్, తల్లి పూజకు డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించి సదరు బాలుడు వారి కొడుకే అని నిర్ధారించారు. సోమవారం సంగారెడ్డిలోని బాలరక్ష భవన్ వద్ద తల్లికి అప్పగించారు. దీంతో బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు, బాలల సంక్షేమ సమితి అధ్యక్షురాలు శివకుమారికి, జిల్లా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment