
రఘునాథపల్లి: రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకుడికి సత్వర వైద్య సేవలు అందించి మెరుగైన చికిత్స కోసం ఆస్పత్రికి పంపించారు ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య. జనగామ జిల్లా రఘునాథపల్లికి చెందిన సత్తు మహేందర్ ఆదివారం తన ద్విచక్ర వాహనంపై మేకలగట్టులో దుర్గామాత ఉత్సవాల సందర్భంగా బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి పయనమయ్యాడు.
ఖిలాషాపూర్ సమీపంలోకి రాగానే కుక్క రోడ్డుకు అడ్డురావడంతో మహేందర్ సడన్ బ్రేకు వేయగా బైకు అదుపుతప్పి కిందపడి గాయాలయ్యాయి. అదే సమయంలో దుర్గామాత ఉత్సవాలకు వెళ్లి కారులో వస్తున్న ఎమ్మెల్యే దీనిని గమనించి, కారు నిలిపారు. వెంట నే మహేందర్ వద్దకు వెళ్లి వైద్యుడైన రాజయ్య తన వెంట ఉన్న స్టెతస్కోప్‌తో పరీక్షించారు. అప్పటికే మహేందర్ స్పృహ కోల్పోవడంతో...108 వాహనం చేరుకోవడానికి ఆలస్యమవుతుందని గ్రహించి వెంటనే పోలీస్ వాహనంలో జనగామ ఆస్పత్రికి తరలించారు. జనగామ ఆస్పత్రి వైద్యులతో మాట్లాడి మహేందర్‌కు మెరుగైన వైద్య సేవలు అందించాల్సిందిగా సూచించారు.