ఏ నివేదికలో నిరూపణ కాకుండానే తిరుమల లడ్డూపై దుష్ప్రచారం తగదు
చంద్రబాబు పచ్చి అవకాశవాది.. తన స్వార్థ ప్రయోజనాలే ముఖ్యం
‘సాక్షి’ ఇంటర్వ్యూలో ప్రముఖ ఆర్థిక వేత్త, సామాజిక కార్యకర్త మోహన్ గురుస్వామి
సీఎం చంద్రబాబు తిరుమలను వివాదాస్పదంగా మార్చడం సరికాదు
అయినా ఆ నెయ్యి వాడనేలేదు.. అపచారం ఎక్కడ?
నెయ్యిలో కల్తీ జరిగిందనేది కేవలం రాజకీయ ఆరోపణలే
వాటికి ప్రభుత్వ స్థాయిలో పెద్ద ఎత్తున ప్రచారం..అత్యున్నత పదవుల్లో ఉన్న వారికి లౌకికవాదమంటే అర్థం తెలుసా?
నాడు సైబరాబాద్‌లో చేసిన భూ దోపిడీనే నేడు అమరావతిలో చేస్తున్నారు
ఆ నెయ్యిలో ఏదో జంతువు కొవ్వు కలిసిందని జరుగుతున్న ప్రచారం కేవలం ఊహాజనితం. దీనికి ఎలాంటి శాస్త్రీయ కొలబద్ద లేదు. ఇలాగైతేనే ప్రజలు నమ్ముతారని మూఢ నమ్మకం మాటున చెబుతున్నదే. ఏదైనా విషయాన్ని ఉద్దేశ పూర్వకంగా అశాస్త్రీయంగా అంచనా వేయడంలో భాగంగానే ఇది జరిగింది. అంటే ఏదో ఆశించి ఇలా చేశారని స్పష్టమవుతోంది. ఇది ‘బ్యాడ్ కేస్ ఆఫ్ ఎక్స్‌ప్లాయిటేషన్’గా నిలుస్తుంది. – ప్రముఖ ఆర్థిక వేత్త, సామాజిక కార్యకర్త మోహన్ గురుస్వామి
సాక్షి, హైదరాబాద్ : ఏ నివేదికలో నిరూపణ కాకుండానే తిరుమల లడ్డూపై దుష్ప్రచారం తగదని ప్రముఖ ఆర్థిక వేత్త, సామాజిక కార్యకర్త మోహన్ గురుస్వామి ఆవేదన వ్యక్తం చేశారు. ‘సెక్యులర్ రాజ్యంలో మతానికి చోటుండదు. మతపరమైన విశ్వాసాలు అనేవి వ్యక్తిగతం. అసలు ప్రభుత్వంలో మతం అనే దానికి చోటే లేదు. ఇలాంటి విషయాలను అడ్డుపెట్టుకుని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తిరుమలను వివాదాస్పదంగా మార్చడం సరికాదు’ అని అన్నారు.
మతపరమైన విశ్వాసాలపై వివాదం సృష్టించి, తద్వారా రాజకీయ ప్రయోజనం పొందేందుకే తిరుమల లడ్డూ వివాదాన్ని తెరపైకి తీసుకొచ్చినట్టు కనిపిస్తోందని చెప్పారు. పాలకులకు ఇబ్బంది కలిగించే విషయాలను పక్కదారి పట్టించేందుకే ఇలాంటి వివాదాలు తెరపైకి తెస్తుంటారని, ఏపీలో ఇప్పుడదే జరుగుతోందన్నారు. తిరుమల లడ్డూ వివాదం, జాతీయ, రాష్ట్ర స్థాయిలో రాజకీయ పరిణామాలు, ఆర్థిక రంగంలో ఎదురవుతున్న సవాళ్లు తదితర అంశాలపై సాక్షి ప్రతినిధికి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన పలు విషయాలు వెల్లడించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..
అవన్నీ రాజకీయ ఆరోపణలే
⇒ లడ్డూల తయారీకి ఉపయోగించే నెయ్యిలో కల్తీ జరిగిందనే రాజకీయ ఆరోపణలు, వాటికి ప్రభుత్వ స్థాయిలో పెద్ద ఎత్తున ప్రచారం చేయడం మినహా అది నిజమని ఏ నివేదికలోనూ వెల్లడి కాలేదు. ఈ అంశం అమూల్‌తో సహా ఏ నివేదికలోనూ నిరూపితం కాకుండానే అయినట్టుగా ప్రచారం చేస్తున్నారు.
⇒ పాలు జంతువుల ఉత్పత్తితో ముడిపడినవే. శాస్త్రీయంగా చూస్తే.. ఆవు, బర్రె, మేక ఆ మాటకొస్తే ఏదైనా మొక్క నుంచి వచ్చే కొవ్వును మారి్పడి చేస్తే నెయ్యి తయారవుతుంది. ఆవు అధికంగా మేత మేసినా, లేక తక్కువగా తిన్నా ఫలితాల్లో మార్పులు కనిపిస్తాయి. ఇదే విషయాన్ని అమూల్ టెస్ట్ రిజల్ట్ నిర్ధారించింది. కల్తీ అయిందని చెబుతున్న నెయ్యే లడ్డూ తయారీలో వాడనప్పుడు అపచారం జరిగిందనడానికి ఎక్కడ తావుంది?
⇒ ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పచ్చి అవకాశవాది. తన స్వార్థ ప్రయోజనాలు, రాజకీయ ప్రయోజనాలే ఆయనకు అత్యంత ముఖ్యం. ఇందుకోసం ఏం చేయడానికైనా ఆయన వెనుకాడరని చరిత్ర చెబుతోంది. గతంలో మోదీని నంబర్ వన్ శత్రువుగా ప్రకటించిన చంద్రబాబు.. ఇప్పుడు ఆయనకు నంబర్ వన్ మిత్రుడు ఎలా అయ్యారు?
⇒ అత్యున్నత పదవుల్లో ఉన్న వారికి లౌకికవాదమంటే అసలైన అర్థం తెలుసా? వారికి ఆ పదవిలో కొనసాగే అర్హత ఉందా? (ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌ను ఉద్దేశించి) అన్న అనుమానం కలుగుతోంది.
చంద్రబాబు స్వార్థ రాజకీయాలే చేస్తారు
⇒ గతంలో చంద్రబాబు మనుషులు సైబరాబాద్ చుట్టూ భూములు కొని లాభ పడ్డారు. అప్పుడు అక్కడ భూముల పేరిట చేసిందే ఇప్పుడు అమరావతిలో పెద్ద ఎత్తున చేయబోతున్నారు. అందుకే అమరావతే ఏకైక రాజధానిగా ఉండాలని పట్టుబడుతున్నారు. తన అనుయాయులు కొన్న భూములన్నీ కూడా అక్కడే ఉండటం గమనించాల్సిన విషయం. చంద్రబాబు ఎప్పుడూ స్వార్థ రాజకీయాలే చేస్తారు.
⇒ అయితే అక్కడ మౌలిక, ఇతర అవసరాల కోసం పెట్టుబడులు పెట్టడానికి వేల కోట్ల రూపాయలు కావాలి. మోదీ ప్రభుత్వం కూడా ఆ మేరకు ఇచ్చే పరిస్థితి లేదు. ఏపీకి కేంద్రం ‘ప్రత్యేక హోదా కల్పన’ ఇవ్వడం అనేది అసాధ్యం. ఏపీలో బీహార్ మాదిరిగా వెనుకబాటుదనం లేదు. ఈశాన్య రాష్ట్రాల లాగా భౌగోళికంగా దూరప్రాంతాల్లోనూ లేదు. ప్రతిసారి కేంద్రం నుంచి గ్రాంట్లు కావాలని, డబ్బులు ఇవ్వాలని చంద్రబాబు డిమాండ్ చేసినా అది రావడం కూడా కష్టమే. సాధ్యం కాదు.
⇒ అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే చంద్రబాబు.. అమరావతిలో మెట్రో, ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్, పరిపాలనా కేంద్రం సచివాలయం, గవర్నమెంట్ ఉద్యోగుల క్వార్టర్లు, ఇతర ఆధునిక సదుపాయాలు, ముఖ్యమైన సంస్థలన్నీ అమరావతిలోనే ఉండాలంటున్నారు. ఇలా అన్నీ అక్కడే ఎందుకో.. దాని వెనుక ఏం ప్రయోజనాలు ఆశిస్తున్నారో లోతుగా గమనించాలి. ముందుగా ఓ కమర్షియల్ సెంటర్‌గా ఎదిగాక అవన్నీ సమకూరాలని కోరుకుంటే మంచిది.
⇒ కేంద్రంలో రాజకీయ స్థిరత్వం అనేది చంద్రబాబు, నితీ‹Ùకుమార్ వంటి నమ్మకం లేని (అన్ ట్రస్ట్ వర్తీ) వ్యక్తులపై ఆధారపడి ఉంది. వీరిద్దరూ మద్దతు ఉపసంహరించినా కేవలం ఆరుగురు ఎంపీల మెజారిటీతో ప్రభుత్వం మనగలుగుతుంది. అయితే గత రెండు పర్యాయాలతో పోలి్చతే మోదీ ప్రభుత్వం బలహీనంగానే ఉంది. దేశంలో నిరుద్యోగ శాతం, ఉద్యోగాలు, ఉపాధి కోరుకుంటున్న యువత సంఖ్య పెరుగుతోంది. ప్రభుత్వ విధానాలను, విపక్షాలను మోదీ ‘మిస్ మేనేజ్’ చేశారు. తప్పుడు గణాంకాలతో మసిపూసి మారేడు కాయ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ‘కేపిటల్ ఇన్వెస్ట్‌మెంట్’ అనుకున్న విధంగా జరగలేదు. కార్పొరేట్ కంపెనీలు విదేశాల్లో పెట్టుబడులు పెడుతున్నాయి.
వైఎస్ జగన్ వికేంద్రీకరణ ఆలోచన బాగుంది
⇒ రాష్ట్ర రాజధానిని వికేంద్రీకరించాలనే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆలోచన ఎంతో బాగుంది. గతంలో కర్నూలులో రాజధాని ఉండేది. హైకోర్టు, రాష్ట్ర సచివాలయం రెండూ రాజధానిలోనే ఎందుకుండాలి? రాష్ట్ర రాజధానిలోనే మెట్రోరైల్, ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ వంటివి ఎందుకుండాలి? భోపాల్, రాయ్‌పూర్, రాంచీ, లఖ్‌నవూ, పాట్నా వంటి రాజధానుల్లో మెట్రో, అంతర్జాతీయ విమానాశ్రయాలు లేవు.
⇒ జగన్ సీఎంగా ఉన్నప్పుడు చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు.. ముఖ్యంగా విద్య, వైద్య రంగాలపై దృష్టి సారించడం బాగుంది. మంచి ఫలితాలు వచ్చాయి. వివిధ వర్గాల ప్రజలకు, ముఖ్యంగా పేదలకు నేరుగా నగదు బదిలీ (డీబీటీ) అనేది మంచి ఆలోచన. కోవిడ్ వంటి విపత్కర పరిస్థితుల్లో ఇలా చేయడం, ఇళ్ల దగ్గరే ప్రజలకు అందించడం ఎంతో మేలు చేసింది. డీబీటీ విధానాన్ని నేను పూర్తిగా సమర్థిస్తున్నాను. ఇది ఉత్పాదకతను పెంచేదే. ఆర్థిక రంగానికి మేలు చేస్తుంది.
⇒ ఎవరైనా సంక్షేమ పథకాలు సరైనవి కాదు అనడం, వీటిపై డబ్బు ఖర్చు చేయడం వృథా అనడం తప్పు. విద్య, వైద్య సేవలకు కూడా చార్జ్ చేస్తారా? ఇవన్నీ ఆర్థికాభివృద్ధికి దోహదపడతాయి. ప్రభుత్వాలు ఏవైనా విద్యా రంగం, పబ్లిక్ హెల్త్‌కేర్‌పై ఎక్కువ నిధులు ఖర్చు చేయాలి. ప్రజలకు మేలు చేకూర్చడం అనేది ఓ మంచి ఆర్థిక కార్యక్రమంగా భావించాలి.
Comments
Please login to add a commentAdd a comment