ఎక్స్‌ప్రెస్–డీలక్స్ సర్వీసులకు మధ్యలో టికెట్ చార్జీలు
వేతన సవరణతో పెరిగే భారాన్ని పూడ్చుకునేందుకు యోచన
ఆక్యుపెన్సీ తక్కువగా ఉన్న బస్సులను గుర్తించి.. కొత్త కేటగిరీకి తగ్గట్టు మార్చాలనే ప్రతిపాదన
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఆర్టీసీ కొత్తగా మరో కేటగిరీ బస్సు సర్వీసులను ప్రారంభించేందుకు కసరత్తు చేస్తోంది. ఎక్స్‌ప్రెస్– డీలక్స్ కేటగిరీల మధ్య.. సెమీ డీలక్స్ పేరుతో వీటిని ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. తద్వారా టికెట్ల ఆదాయం కాస్త పెరుగుతుందని, సిబ్బందికి వేతన సవరణతో పెరిగే భారం పూడుతుందని భావిస్తోంది. ఆర్టీసీ ఆదాయాన్ని పెంచుకునేందుకు ఇటీవల ఆరు బృందాలతో రెండు దఫాలుగా మేధోమథనం నిర్వహించి, సూచనలను స్వీకరించింది. అందులోంచి ముఖ్యమైన, అమలు చేయదగిన వాటిని గుర్తించింది. సెమీ డీలక్స్ సర్వీసు కూడా అందులో ఉన్నట్టు సమాచారం.
వేతన సవరణ భారంతో..
ఆర్టీసీ సిబ్బందికి రెండు వేతన సవరణ (పీఆర్సీ)లు బకాయి ఉంది. అందులో ఒకదాన్ని అమలు చేయాలని ఇటీవల ప్రభుత్వం నిర్ణయించింది. 21 శాతం ఫిట్‌మెంట్‌ను కూడా ప్రకటించింది. వచ్చే నెల నుంచే ఇది అమల్లోకి రానుంది. సంస్థపై రోజుకు రూ.కోటి వరకు వేతన భారం అదనంగా పెరగనుంది. దీనితో ఆ మేర ఆదాయాన్ని పెంచుకోవడంపై ఆర్టీసీ దృష్టి సారించింది.
ఎక్స్‌ప్రెస్‌ల కంటే కాస్త ఎక్కువగా..
ప్రస్తుతం ఆర్టీసీలో బాగా డిమాండ్ ఉన్న కేటగిరీ.. ఎక్స్‌ప్రెస్ సర్వీసు. మిగతా కేటగిరీ బస్సుల కంటే వీటి సంఖ్య ఎక్కువ. దీనిపై ఉన్న డీలక్స్ సర్వీస్ బస్సుల సంఖ్య చాలా తక్కువ. ఇప్పుడు ఈ రెండు కేటగిరీల మధ్య సెమీ డీలక్స్ పేరుతో కొత్త కేటగిరీ ప్రారంభించాలన్నది ఆలోచన. ఎక్స్‌ప్రెస్ బస్సుల కంటే కొంత ఎక్కువ చార్జీతో టికెట్ ధరలు ఖరారు చేయాలని భావిస్తున్నారు.
తక్కువ ఆక్యుపెన్సీ రేషియోతో తిరుగుతున్న బస్సులను గుర్తించి.. వాటిని ఈ కొత్త కేటగిరీకి తగ్గట్టుగా మార్చి నడుపుతారు. దీనితో రోజువారీ టికెట్ ఆదాయం కొంత పెరిగే అవకాశం ఉంటుంది. ఎక్స్‌ప్రెస్ బస్సులతో పోలిస్తే.. మరికొంత దూర ప్రాంతాలకు వీటిని తిప్పుతారని.. సీట్లు కూడా కాస్త మెరుగ్గా పుష్‌బ్యాక్ తరహాలో ఉంటాయని ఆర్టీసీ వర్గాలు చెప్తున్నాయి.
మహాలక్ష్మితో తగ్గిన టికెట్ వసూళ్లు
రాష్ట్రంలో పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ప్రారంభించిన తర్వాత ఆర్టీసీకి నేరుగా వసూలయ్యే టికెట్ ఆదాయం భారీగా తగ్గింది. సంస్థకు టికెట్ల ద్వారా రోజుకు రూ.16 కోట్ల వరకు సమకూరే ఆదాయం.. రూ.పదిన్నర కోట్లకు పడిపోయింది. మిగతా మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం రీయింబర్స్ చేయాల్సి ఉంది. కానీ ఇంకా ప్రభుత్వం నుంచి ఈ నిధుల విడుదల మొదలుకాలేదు. దీనితో టికెట్ ఆదాయం పెంపుపై ఆర్టీసీ దృష్టి పెట్టింది.
Comments
Please login to add a commentAdd a comment