సాక్షి, హైదరాబాద్: కరోనా ఒమిక్రాన్ వేరియంట్ వాయువేగంతో దూసుకువెళ్తోందని.. మార్చి నాటికి ప్రపంచంలో ఏకంగా సగం మంది దాని బారిన పడతారని ప్రముఖ అంతర్జాతీయ జర్నల్ లాన్సెట్ అంచనా వేసింది. ఈ నెల 17వ తేదీ నాటికే ప్రపంచవ్యాప్తంగా 12.5 కోట్ల మంది ఒమిక్రాన్ బారినపడి ఉంటారని అంచనా వేసింది. గతేడాది ఏప్రిల్‌లో డెల్టా వేరియంట్ తీవ్రస్థాయిలో ఉన్నప్పటితో పోలిస్తే ఇది పదిరెట్లు ఎక్కువని పేర్కొంది.
డెల్టాతో పోలిస్తే.. ఒమిక్రాన్ కారణంగా ఆస్పత్రుల్లో చేరేవారి సంఖ్య 50 శాతం తగ్గిందని, వెంటిలేటర్ అవసరం పడేవారి సంఖ్య 90 శాతం తగ్గిందని వివరించింది. అయితే.. కేసులు భారీగా పెరుగుతుండటంతో ఆ మేరకు ఆస్పత్రుల్లో చేరికలు కూడా ఎక్కువగా ఉంటాయని స్పష్టం చేసింది. గతంలో కరోనా బారినపడిన వారిలో ప్రతి ఐదుగురిలో ఒకరిని గుర్తించారని.. ప్రస్తుతం ఒమిక్రాన్‌లో లక్షణాలు పెద్దగా కనిపించకపోవడం వల్ల అది సోకిన ప్రతి 20 మందిలో సగటున ఒకరినే గుర్తించగలుగుతున్నామని పేర్కొంది.
లాన్సెట్ నివేదికలోని ముఖ్యాంశాలివీ..
►గత వేరియంట్లలో లక్షణాలు లేనివారు 40 శాతం ఉంటే.. ఒమిక్రాన్ విషయంలో ఇది 80 నుంచి 90 శాతంగా ఉంటోంది. గతంలో ఆస్పత్రులకు వచ్చినవారికి ఇతర సాధారణ చికిత్సలకు ముందు పరీక్షలు చేస్తే.. 2 శాతం మందికి కరోనా ఉన్నట్టు తేలేది. ఇప్పుడది ఏకంగా పది శాతానికి చేరుకుంది.
►ఇటీవల కేసులు బాగా పెరుగుతున్నాయి. అందరూ మాస్క్‌లు, వ్యాక్సిన్, బూస్టర్ డోసుల గురించే మాట్లాడుతున్నారు. ఇటువంటి చర్యలను గతంలోనే మొదలుపెట్టి ఉంటే బాగుండేది.
►ఇప్పటికిప్పుడు 80 శాతం మాస్క్‌లు పెట్టుకున్నా.. వచ్చే నాలుగు నెలల కాలంలో కేవలం 10 శాతం మాత్రమే కేసులు తగ్గించవచ్చు. బూస్టర్ ఇవ్వడం, వ్యాక్సినే తీసుకోనివారికి ఇవ్వడం వల్ల ఇప్పటికిప్పుడు ఒమిక్రాన్‌ను నుంచి బయటపడలేం. అదెప్పుడో చేసి ఉండాలి.
►వచ్చే నాలుగు నుంచి ఆరు వారాల కాలంలో మనం తీసుకునే ఏ రకమైన చర్యతోనూ ఒమిక్రాన్ నుంచి బయటపడలేం. దాని ప్రభావానికి గురికావాల్సిందే. ఒమిక్రాన్ పీక్ స్థాయికి వెళ్లాక ఐదు వారాల్లోగా తగ్గిపోతుంది.
►ఈ నెల 17వ తేదీ నాటికి 25 దేశాల్లో ఒమిక్రాన్ తీవ్రస్థాయిలో ఉంది. జనవరి మూడో తేదీ నాటికే ఇండియాలో సామాజికవ్యాప్తి స్థాయిలో ఉంది. మిగతా దేశాల్లో ఫిబ్రవరి రెండో వారం నాటికి కేసులు తీవ్రస్థాయికి చేరుకుంటాయి.
►స్కూళ్ల నుంచి విద్యార్థులను దూరం చేయడం, ఉద్యోగులను కార్యాలయాలకు దూరంగా ఉంచడం వంటి చర్యలతో ఇప్పటికిప్పుడు ప్రయోజనం ఏమీలేదు. ఒమిక్రాన్ మనం తీసుకునే చర్యలకంటే స్పీడ్‌గా ఉంది.
►ఒమిక్రాన్‌ను అరికట్టేందుకు సరికొత్త వ్యూహాలను రూపొందించాలి. చైనా, న్యూజిలాండ్ దేశాల్లో సహజంగా మొదటి కేసుతోనే అప్రమత్తం అవుతారు. అసలే కేసులు రాకుండా చూడడం ఆ దేశాల వ్యూహం.
►ప్రస్తుతం వ్యాక్సినేషన్ పెరుగుతోంది. బూస్టర్ డోసులు కూడా వేస్తున్నారు. దీనితో కరోనాను ఎదుర్కొనే శక్తి, రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఒమిక్రాన్ వేవ్ నిలిచిపోయాక కరోనా వ్యాప్తి గణనీయంగా తగ్గిపోతుంది.
►తర్వాత కూడా కొత్త వేరియంట్లు రావొచ్చు. అవి ప్రమాదకరంగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇది నిరంతర ప్రక్రియగా చూడాల్సి ఉంది. దానికి మనం అలవాటు పడాల్సిందే.
►కరోనా భవిష్యత్తులో సీజనల్ వ్యాధిగా, సాధారణ ప్రమాదకర ఫ్లూగా మార్పు చెందే అవకాశముంది. 2017–18 ఫ్లూ సీజన్‌లో అమెరికాలో 52 వేల మంది చనిపోయారు. ఇలాంటి ప్రమాదకర సీజనల్ వ్యాధిగా కరోనా మారిపోతుంది.
Comments
Please login to add a commentAdd a comment