పంజగుట్ట (హైదరాబాద్): అంబేడ్కర్ లేనిదే తెలంగాణ లేదని, ఆయన రాసిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 వల్లే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిందని, ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ చెప్పారు. డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ ప్రవచించిన విధంగా బోధించు, సమీకరించు, పోరాడు అనే తత్వాన్ని సంపూర్ణంగా వంటబట్టించుకున్న సీఎం కేసీఆర్.. లక్షల మందిని ఐక్యం చేసి పోరాడి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నారని గుర్తుచేశారు.
శుక్రవారం పంజగుట్ట కూడలిలో మంత్రులు కొప్పుల ఈశ్వర్, ఎర్రబెల్లి దయాకర్ రావుతో కలిసి కేటీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.. 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం కూడా ఖైరతాబాద్ నియోజకవర్గంలోనే ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు. పక్కనే ఉన్న సచివాలయంలో కూర్చునే ప్రతీ ఒక్కరికి దశాబ్దాలు, శతాబ్దాలపాటు దిశా నిర్దేశం చేసేలా ఆయన విగ్రహం ఉందని చెప్పారు.
తెలంగాణ రాకముందు 270 గురుకులాలు ఉండేవని, ఇప్పుడు 1,001 గురుకులాలు ఉన్నాయని చెప్పారు. వీటిలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టికి చెందిన ఆరు లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారన్నారు. ఒక్కో విద్యార్థికి ఏటా రూ.1.20 లక్షలు ఖర్చుచేస్తూ ప్రపంచంతోనే పోటీపడే విద్యార్థులుగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు.
కేసీఆర్‌తోనే సాధ్యం
దళితబంధు లాంటి గొప్ప పథకం తీసుకురా వాలన్నా, దేశంలో ఎక్కడా లేని విధంగా 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు చే యాలన్నా, సచివాలయానికి అంబేడ్కర్ పేరు పెట్టాలన్నా అది విప్లవాత్మకమైన ఆలోచనలు, దమ్మున్న నాయకుడు కేసీఆర్‌తోనే సాధ్యమని కేటీఆర్ చెప్పారు. కేసీఆర్ సచివాలయానికి అంబేడ్కర్ పేరుపెట్టిన విధంగా పార్లమెంట్‌కు కూడా అంబేడ్కర్ పేరుపెట్టాలని కేంద్రాన్ని డిమాండ్ చేద్దామని పిలుపునిచ్చారు.
పంజగుట్ట కూడలికి అంబేడ్కర్ కూడలి అని నామకరణం చేయాలన్న డిమాండ్‌పై త్వరలోనే నిర్ణ యం తీసుకుంటామన్నారు. మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ.. అంబేడ్కర్ కలలు కన్న పాలన మన తెలంగాణలో సాగుతోందన్నారు. ఇప్పటికే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టిలకు ఎన్నో పథకాలు తెచ్చారని చెప్పారు. ఈ సంవత్సరం దళితబంధుకు రూ.17,700 కోట్లు విడుదల చేశారని, మరో లక్షకు పైగా లబ్ది దారులకు ఈ పథకం అందుతుందన్నారు.
ఈ పథకంతో రాష్ట్రంలోని ప్రతీ దళిత కుటుంబంలో వెలుగులు నిండుతాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా దళితబంధు లబ్ధిదారులు సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు దానం నాగేందర్, సైదిరెడ్డి, మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఎమ్మెల్సీ ఎం.ఎస్.ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment