‘మంచిప్ప’ గ్రామంలో బిజినెస్ మస్తుగా జరుగుతోంది. రోజువారీ టర్నోవర్ రూ. పది లక్షలు కాగా, అంగడి జరిగేరోజు రూ. 20 లక్షలపైనే.. చాలా చిన్న గ్రామమే అయినా ఇంత పెద్ద మొత్తంలో వ్యాపారం ఎలా జరుగుతుందో తెలుసుకుందాం.
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: చుట్టురా అటవీప్రాంతం... అక్కడక్కడా కొన్ని గిరిజన తండాలు. మధ్యలో ఉన్న గ్రామమే మంచిప్ప. ఇది నిజామాబాద్ జిల్లా మోపాల్ మండల పరిధిలో ఉంది. అటవీ విస్తీర్ణం ఎక్కువగా ఉండడంతో చుట్టుపక్కల తండాలు, గ్రామాలకు మంచిప్పనే వ్యాపార కూడలి. రోజువారీగా ఈ గ్రామానికి ఆరు నుంచి ఏడు వేలమంది రాకపోకలు సాగిస్తారు.
చుట్టు పక్కల ఉన్న 9 తండాలతో పాటు అమ్రాబాద్, ఎల్లమ్మకుంట, బైరాపూర్, కాల్పోల్ గ్రామాల ప్రజలకు ఇక్కడి మార్కెట్‌కు నిత్యం వస్తారు. ప్రతిరోజూ రూ.10 లక్షల వరకు వ్యాపార లావాదేవీలు జరుగుతున్నాయి. అంగడి జరిగే బుధవారం మాత్రం వ్యాపారం రెండింతలు ఉంటుంది. మంచిప్ప గ్రామ జనాభా 5 వేలు కాగా, చుట్టుపక్కల తండాల్లో మరో 12 వేల జనాభా ఉంది.
బిర్యానీకి భలే డిమాండ్ ఇక్కడ ప్రతిరోజూ హోటళ్లు
కళకళలాడుతుంటాయి. దాదాపు 12 హోటళ్లు ఉన్నాయి. బిర్యానీకి భలే డిమాండ్ ఉంటోంది. ప్రతిరోజూ సగటున 2 క్వింటాళ్ల చికెన్, అంగడిరోజు 5 క్వింటాళ్లు అమ్ముడవుతుంది. బుధవారం రోజు మటన్ అమ్మకాలు రెండు క్వింటాళ్ల వరకు ఉంటుండగా, ఆదివారం ఒక క్వింటా అమ్మకాలు ఉంటాయి.
మంచిప్పకు ‘ముంపు’ భయం
మంచిప్ప చెరువు, కొండెం చెరువులను కలిపి రిజర్వాయర్ నిర్మించే ప్రతిపాదనలు ఉన్నాయి. మొదట్లో ప్రాణహిత–చేవెళ్ల కింద 0.8 టీఎంసీల నీటి సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మించాలని అనుకున్నారు. ప్రస్తుతం దానిస్థానంలో కాళేశ్వరం 21వ ప్యాకేజీ ద్వారా ఈ రిజర్వాయర్ సామర్థ్యాన్ని 3.5 టీఎంసీలకు పెంచారు.
దీంతో 1,200 ఎకరాల సాగుభూమి, 800 ఎకరాల అటవీభూమి, అమ్రాబాద్ పంచాయతీ పరిధిలో గుండ్యానాయక్తండా, చంద్రునాయక్ తండా, కొక్యానాయక్ తండా, వెంకట్రాంనాయక్ తండా, బైరాపూర్‌పరిధిలో బైరాపూర్ తండా, మోతిరామ్‌నాయక్ తండా, కొక్యానాయక్ తండా, పోచమ్మ తండా, మంచిప్ప పరిధిలోని తండాలు కూడా ముంపునకు గురవుతున్నాయి.
దీంతో మంచిప్పతోపాటు సమీప గ్రామస్తుల్లో ఆందోళన నెలకొంది. బిజినెస్ కూడా బాగా పడిపోతుందని జలాశయానికి వ్యతిరేకంగా గ్రామస్తులు పోరాటం చేస్తున్నారు. గ్రామ అభివృద్ధి కమిటీ నిధుల్లో సగభాగం ఉద్యమానికే ఖర్చు చేస్తున్నారు.
ఉపాధి గల్లంతే
చుట్టుపక్కల గ్రామాల రైతులకు వ్యవసాయమే ప్రధాన ఆధారం. మంచిప్పలో మాత్రం వ్యాపారంతో ఎక్కువ మందికి ఉపాధి లభిస్తోంది. ముంపు కారణంగా ఇక్కడి వ్యాపారం పూర్తిగా పడిపోతుంది. దీంతో పని వెతుక్కుంటూ చెట్టుకొకరు, పుట్టకొకరు వెళ్లాల్సిన పరిస్థితి.
– దర్బస్తు కామేశ్వర్‌రావు, వస్త్ర వ్యాపారి
ఈ ఊరికి పిల్లనివ్వడం లేదు
మంచిప్ప చుట్టుపక్కల భూములు, గ్రామాలు ముంపునకు గురయ్యే నేపథ్యంలో మా ఊరి యువకులకు పిల్లను కూడా ఇవ్వడం లేదు. దీంతో భవిష్యత్ విషయమై ప్రజల్లో ఆందోళన నెలకొంది. జలాశయ సామర్థ్యం తగ్గించి ముంపు లేకుండా చేయాలి.
– బాణాపురం జగదీష్, మంచిప్ప ఉప సర్పంచ్
మంచిప్పకు రోజుకు మూడుసార్లు వస్తా
మాది బైరాపూర్. వ్యవసాయం చేస్తూనే ట్రాక్టర్ కిరాయికి ఇస్తాను. ప్రస్తుతం వివిధ పనుల నిమిత్తం ప్రతిరోజు మూడుసార్లు మంచిప్పకు రాకపోకలు సాగిస్తున్నాను. నా మాదిరిగా చుట్టుపక్కల ఊర్లకు చెందిన చాలామంది ప్రతిరోజూ మంచిప్పకు వచ్చి వెళుతుంటారు.
– బాదావత్ వెంకట్రామ్, రైతు, బైరాపూర్
Comments
Please login to add a commentAdd a comment