సాక్షి, హైదరాబాద్: కోవిడ్ బారిన పడిన ఆర్టీసీ ఉద్యోగులకు పల్స్ ఆక్సీమీటర్లతో కూడిన కరోనా కిట్ పంపిణీ చేయాలని సంస్థ నిర్ణయించింది. ఈ మేరకు గురువారం రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ఆర్టీసీ ఎండీ సునీల్‌శర్మను ఆదేశించారు. రెండు రోజుల్లో ఆ కిట్లు సరఫరా కానున్నాయి. ఇప్పటికే ఆర్టీసీలో దాదాపు 450 మంది కోవిడ్ బారినపడ్డారు. వీరిలో దాదాపు 20 మందికిపైగా చనిపోగా మిగతావారు కోలుకున్నారు. ప్రస్తుతం వైరస్ వ్యాప్తి చాలా అధికంగా ఉండటంతో ఆర్టీసీలో కరోనా బారిన పడుతున్నవారి సం ఖ్య పెరుగుతోంది. ఒత్తిడి, వయసు ప్రభావం కారణంగా డ్రైవర్, కండక్టర్లలో చాలామంది ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. దీంతో వారికి పల్స్ ఆక్సీమీటర్లు ఉచితంగా అందించాలని మంత్రి పువ్వాడ నిర్ణయించారు. శరీరంలో ఆక్సిజన్ శాతం తగ్గుతుంటే, ముందే గుర్తించి వెంటనే ఆసుపత్రిలో చేరితే ప్రమాదం నుంచి బయటపడే అవకాశం ఉంటుందన్న వైద్యుల సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు.
పూర్తి కిట్.. టిమ్స్‌లో వైద్యం
కోవిడ్ సోకితే ఇంట్లోనే ఉండి వైద్యం తీసుకునేవారికి వైద్యులు సూచించే మందులు, శానిటైజర్, మాస్కులు తదితరాలతో కూడిన కిట్‌ను పంపిణీ చేయనున్నారు. వైరస్ సోకినట్టు నిర్ధారణ కాగానే వారికి ఈ కిట్ అందిస్తారు. ఆరోగ్య సమస్యలు లేకుంటే ఇంట్లోనే చికిత్స పొందుతారు. ఏవైనా సమస్యలు పెరిగి వైద్యుల పర్యవేక్షణ అవసరమైతే ఆసుపత్రికి తరలిస్తారు. ఇందుకోసం గచ్చిబౌలి లోని టిమ్స్‌ను గుర్తించారు. మంత్రి సూచన మేరకు ఆర్టీసీ ఎండీ సునీల్‌శర్మ వైద్య అధికారులతో చర్చించారు. ప్రస్తుతం టిమ్స్‌లో పడకలు కావాల్సినన్ని ఖాళీగా ఉన్నాయని అధికారులు ఆయన దృష్టికి తెచ్చారు. దీంతో వైద్యం అవసరమైనవారు అప్పటికప్పుడు అటు, ఇటు వెతుక్కునే సమస్య లేకుండా నేరుగా టిమ్స్‌కు వెళ్లేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
ప్రైవేటు ఆసుపత్రుల్లో అవకాశం కల్పించండి: కార్మిక సంఘాలు
‘మంత్రిగారు టిమ్స్‌లో చేరేలా చర్యలు తీసుకున్నారు. కానీ, టిమ్స్‌కు ఎవరైనా వెళ్లొచ్చు. ఆర్టీసీ ఉద్యోగులకు కూడా కార్పొరేట్ వైద్యం అందుబాటులో ఉండాలి. ఇందుకోసం ప్రైవేటు ఆసుపత్రుల్లో కూడా చికిత్సకు అవకాశం కల్పించాలి’అని కార్మిక సంఘాల నేతలు కోరుతున్నారు.
వెయ్యి ఆక్సీమీటర్లు కొంటాం: పువ్వాడ
‘ఆర్టీసీ ఉద్యోగుల ఆరోగ్యానికి ప్రాధాన్యమిస్తున్నాం. కోవిడ్ బారిన పడితే ఎక్కువగా శ్వాస సమస్యలు వస్తున్నాయి. నిరంతరం పల్స్ ఆక్సీమీటర్ ద్వారా పరీక్షించుకుంటే సమస్యను ముందే గుర్తించొచ్చు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం. వేయి వరకు ఆక్సీమీటర్లు కొని అందిస్తాం. అవసరమైతే మరిన్ని కొంటాం’
Comments
Please login to add a commentAdd a comment