బూడిదకు భలే డిమాండ్‌ | Ramagundam NTPC Ash Demand Increased Significantly | Sakshi
Sakshi News home page

బూడిదకు భలే డిమాండ్‌

Published Mon, Jan 4 2021 2:11 AM | Last Updated on Mon, Jan 4 2021 9:07 AM

Ramagundam NTPC Ash Demand Increased Significantly - Sakshi

రామగుండం ఎన్టీపీసీ యూనిట్‌ 

సాక్షి, జ్యోతినగర్‌ (రామగుండం): వ్యర్థం అనుకున్న బూడిదకు నేడు విపరీతంగా డిమాండ్‌ పెరిగింది. ఎన్టీపీసీ చేపట్టిన పరిశోధనలు సత్ఫలితాలిస్తోంది. బూడిద వినియోగంపై సంస్థ చర్యలు పలు పరిశ్రమలకు ఆదర్శంగా నిలుస్తున్నాయి. నూతనంగా జియో పాలిమర్‌ గుళికల (కంకర), టైల్స్‌ తయారీకి శ్రీకారం చుట్టడంతో మరింత వినియోగంలోకి వచ్చింది. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ బూడిద వినియోగం 118.23 శాతం మార్కుకు చేరిందంటే డిమాండ్‌ ఏ మేరకు ఉందో ఇట్టే అర్థమవుతోంది. బ్రిక్స్, జియో పాలిమర్‌ గుళికల తయారీకి విరివిగా వినియోగిస్తున్నారు. తాజాగా టైల్స్‌ తయారీపైనా దృష్టి సారించారు.  

32 వేల మెట్రిక్‌ టన్నుల బొగ్గు వినియోగం 
ఎన్టీపీసీలో 2,600 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తికి నిత్యం 32 వేల మెట్రిక్‌ టన్నుల బొగ్గు వినియోగిస్తారు. దీంతో సుమారు 13 వేల మెట్రిక్‌ టన్నుల బూడిద వెలువడుతుంది. దీన్ని చిన్నతరహాæ పరిశ్రమలతోపాటు సిమెంట్, కాంక్రీటు, ఇటుకల తయారీ, రోడ్‌ ఎంబ్యాంక్‌మెంట్, వాణిజ్యపరంగా సిమెంటు, రహదారుల నిర్మాణం, లోతట్టు ప్రాంతాల్లో నింపడం కోసం టెండర్ల ద్వారా విక్రయిస్తున్నారు. 2020–21 ఆర్థిక సంవత్సరంలో 25,06,533 మెట్రిక్‌ టన్నుల బూడిద విడుదల కాగా 19,78,750 మెట్రిక్‌ టన్నుల బూడిదను వినియోగంచుకుని 78.94 శాతంగా నమోదు చేశారు. రానున్న రోజుల్లో 100 శాతం వినియోగానికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నారు.  

వినియోగం ఇలా..

భవిష్యత్‌ ప్రణాళిక 
►తెలంగాణ ప్రాజెక్టు యాష్‌పాండ్‌ కట్ట నిర్మాణం, రోడ్డు నిర్మాణాలు, సింగరేణి సంస్థ భూగర్భ గనులను నింపేందుకు పూర్తిస్థాయిలో బూడిద వినియోగానికి ప్రణాళికలు తయారు చేస్తున్నారు.  
►తెలంగాణ ప్రాజెక్టు సమీపంలో పైలట్‌ ప్రాజెక్టుగా జియోపాలిమర్‌ రోడ్డు నిర్మించింది. సిమెంట్‌ వాడకుండా 70 శాతం బూడిదతోపాటు సిలికాన్, సోడియం హైడ్రాక్సైడ్‌తో రోడ్ల నిర్మాణం చేపట్టారు.  
►కంకరకు బదులుగా బూడిద గుళికలను తయారు చేస్తున్నారు. 80 శాతం బూడిద, 20 శాతం రసాయన పదార్థాలతో యంత్రాల ద్వారా గుళికలను 10 ఎంఎం, 20 ఎంఎం, 40 ఎంఎం పరిమాణంలో తయారు చేస్తున్నారు.  
►గుళికలను పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకురావడానికి వరంగల్‌ నిట్‌ ఆధ్వర్యంలో ప్రయోగాలు ప్రారంభించారు.

118.23 శాతం వినియోగం 
ఎన్టీపీసీ బూడిదను ప్రస్తుతం 118.23% వినియోగంలోకి తీసుకొచ్చాం. ఈ ఆర్థిక సంవత్సరంలో 78.94% వినియోగించు కుంటూ రానున్న రోజుల్లో 100 శాతం వినియోగంలోకి తీసుకురానున్నాం. భవిష్యత్‌లో కూడా ఇదే విధానాలను అనుసరించి పూర్తిస్థాయి పలు అవసరాలకు ఉపయోగించేందుకు పరిశోధనలు చేయనున్నాం. బూడిదను వినియోగించే సంస్థలు, చిన్నతరహా పరిశ్రమల నిర్వాహకులతో సమావేశాలు ఏర్పాటు చేసి వారికి అవగాహ న కల్పిస్తున్నాం. – సునీల్‌కుమార్, సీజీఎం,ఎన్టీపీసీ రామగుండం 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement