మనిషికి, కోతికి పోలికలు ఎన్ని ఉన్నా.. ప్రధానమైన తేడా.. తోక! పూర్వీకులు ఒకరే అయినా.. మనిషి తోకలేకుండా ఎదిగితే.. కోతులు అలాగే ఉండిపోయాయి ఇది అందరికీ తెలిసిన విషయమే.. కానీ ఈ మార్పు జరిగిందెలా?
యాభై కోట్ల ఏళ్ల క్రితం మన పూర్వీకులకు పొడవాటి తోక ఉండేది. చేపల మాదిరిగా ఈ తోకలను సముద్రాల్లో సులువుగా ఈదేందుకు వాడేవారు. కొన్నికోట్ల ఏళ్ల తర్వాత ఈ తోకలే.. చెట్టు కొమ్మలపై సమతులంగా నడిచేందుకు సాయపడ్డాయి. మరికొంత కాలం గడిచిన తరువాత అంటే.. సుమారు రెండున్నర కోట్ల ఏళ్ల క్రితం ఆ తోకలు మాయమైపోయాయి! ఈ విషయాన్ని అందరికంటే ముందుగా గుర్తించింది పరిణామ సిద్ధాంతకర్త చార్లెస్ డార్విన్. కానీ ఓ జన్యుమార్పు కారణంగా మన తోకలు మాయమైపోయాయని గుర్తించింది మాత్రం న్యూయార్క్‌కు చెందిన శాస్త్రవేత్తల బృందం. రెండు వారాల క్రితం ఈ పరిశోధన వివరాలు ఆన్‌లైన్‌లో ప్రచురితమయ్యాయి. ఆ వివరాలివీ..
మనిషి తన తోకను వదిలించుకోవడం పరిణామ క్రమంలో చాలా ముఖ్యమైన ఘట్టం. కోతులకు తోకలు ఉన్నా చింపాంజీలు, ఒరాంగ్ ఊటాన్ వంటి వానర జాతుల్లో మాత్రం తోకలు లేవు. కాకపోతే వాటిలో, మనలోనూ తోక తాలూకు అవశేషం కటి వలయం మధ్యన కొన్ని ఎముకల నిర్మాణం రూపంలో ఉంటుంది. ఇంగ్లిష్‌లో ఈ అవశేషాన్ని కోసిక్స్ అని పిలుస్తారు. ఇది తోక అవశేషం అనడంలో ఎలాంటి సందేహం లేదని డార్విన్ స్వయంగా స్పష్టం చేశారు కూడా.
అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా ఆ తోక తొలగిపోయిందెలా? అన్న అంశంపై పరిశోధనలు జరిగాయి, జరుగుతున్నాయి కూడా. పలుచోట్ల తవ్వకాల్లో బయటపడ్డ పురాతన శిలాజాల ఆధారంగా చూస్తే.. కనీసం 6.6 కోట్ల ఏళ్ల క్రితం అన్ని వానర జాతుల్లో పూర్తిస్థాయిలో తోక వంటి నిర్మాణం ఉంది. కానీ రెండు కోట్ల ఏళ్ల క్రితం నాటి శిలాజాల్లో మాత్రం తోకల స్థానంలో కోసిక్స్ కనిపించాయి. ఈ పరిణామం ఎలా జరిగిందో తెలుసుకునేందుకు నూయార్క్ యూనివర్సిటీ శాస్త్రవేత్త బో షియా గత ఏడాది కొన్ని పరిశోధనలు చేపట్టారు.
కొన్నిరకాల జంతువుల్లో తోకలు ఎలా ఏర్పడుతున్నాయో గుర్తించేందుకు ప్రయత్నించారు. పిండంగా ఉన్నప్పుడే కొన్ని మాస్టర్ జన్యువులు చైతన్యవంతం కావడం వల్ల వెన్నులోని భాగాలు మెడ, లంబార్ ప్రాంతంగా విడిపోతాయని.. పిండం ఒక చివరలో కనిపించే బొడిపెలాంటి నిర్మాణంలో ఎముకలు, కండరాలు, నాడులు అభివృద్ధి చెంది తోకలుగా మారతాయని బో గుర్తించారు. తోక ఏర్పడటంలో దాదాపు 30 జన్యువులు పనిచేస్తున్నట్టు గుర్తించారు.
ఈ ముప్పై జన్యువుల్లో ఏదో ఒక జన్యువులో వచ్చిన మార్పుల ప్రభావం వల్లనే మనిషి తోకను కోల్పోయి ఉంటాడని అంచనా కట్టిన బో.. దాన్ని గుర్తించే ప్రయత్నం చేశారు. తోకల్లేని వానరాలు ఆరింటి డీఎన్‌ఏను, తోకలున్న తొమ్మిది రకాల కోతుల డీఎన్‌ఏతో పోల్చి చూసినప్పుడు ‘టీబీఎక్స్‌టీ’ అనే జన్యువులోని మార్పులు కారణమైనట్టు గుర్తించారు. ఈ మార్పులు మనుషులు, చింపాంజీల్లాంటి వానరాల్లో కనిపించగా.. తోకలున్న కోతుల్లో మాత్రం లేకపోవడం గమనార్హం.
– సాక్షి, హైదరాబాద్
ఎలుకలపై ప్రయోగాలతో..
‘టీబీఎక్స్‌టీ’ జన్యువులో వచ్చిన మార్పుల కారణంగానే మనకు తోకలు లేకుండా పోయాయా? అన్న విషయాన్ని స్పష్టంగా తెలుసుకునేందుకు బో షియా.. జన్యుమార్పులు చేసిన పలు ఎలుకలపై ప్రయోగాలు చేశారు. మనుషుల టీబీఎక్స్‌టీ జన్యువులో ఉన్న మార్పులే కలిగి ఉన్న ఎలుకల పిండాలు అభివృద్ధి చెందినప్పుడు.. చాలా వాటిలో తోకలు వృద్ధి చెందలేదు. కొన్నింటిలో తోకలు పెరిగినా వాటి సైజు చాలా చిన్నగా ఉండిపోయింది.
ఈ ప్రయోగాల ఆధారంగా బో చెప్పేది ఏమిటంటే.. సుమారు రెండు కోట్ల ఏళ్ల క్రితం ఈ జన్యుమార్పు వానరాల్లో యాదృచ్ఛికంగా జరిగి ఉంటుందని, తర్వాత వారసత్వంగా కొనసాగడం వల్ల తోకలు లేకుండా పోయాయి అని!! కొసమెరుపు ఏమిటంటే.. తోకలు ఎలా పోయాయో తెలిసింది కానీ.. దీనివల్ల వచ్చిన లాభమేమిటన్న ప్రశ్నకు ఇంకా సమాధానం దొరకలేదు.
Comments
Please login to add a commentAdd a comment