
విద్యాసంస్థలకు సెలవులపై నిర్ణయం కలెక్టర్లదే
23, 24 తేదీల్లో ఆర్వోఆర్ ముసాయిదా చట్టంపై జిల్లాల్లో వర్క్‌షాప్‌లు
కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో రెవెన్యూ మంత్రి పొంగులేటి
సాక్షి, హైదరాబాద్/ ఖమ్మం సహకారనగర్: రాష్ట్రంలో విస్తతంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని, జనజీవనానికి ఎలాంటి ఆటంకాలు కలగకుండా తక్షణ చర్యలు చేపట్టాలని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. మరో ఐదురోజులు ఈ వర్షాలు కొనసాగుతాయన్న వాతావరణ శాఖ సూచనల నేపథ్యంలో ఎలాంటి పరిస్థితులనైనా ఎదు ర్కొనేందుకు జిల్లా యంత్రాంగాలు పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉండాలని సూచించారు.
సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు మంగళవారం ఆయన భారీ వర్షాలు, నూతన ఆర్వోఆర్ ముసాయిదా చట్టం, ఎల్‌ఆర్‌ఎస్, ధరణి దరఖాస్తుల పరి ష్కారంపై అన్ని జిల్లాల కలెక్టర్లతో ఖమ్మం కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా వివిధ జిల్లాల్లో వర్ష పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. జీహెచ్‌ఎంసీ, నిజామాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసినా ప్రజలకు ఇబ్బందులు లేకుండా అధికారులు చర్యలు తీసుకోవడం పట్ల మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మున్సిపల్, మెట్రో వాటర్ బోర్డు, ట్రాఫిక్ విభాగాలు సమన్వయంతో పనిచేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని, రానున్న ఐదు రోజుల వర్షాలను దృష్టిలో ఉంచుకొని స్థానిక పరిస్థితులను బట్టి విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించే అధికారం కలెక్టర్లదేనని స్పష్టం చేశారు. ప్రతి కలెక్టరేట్‌లో కంట్రోల్ రూంలను ఏర్పాటు చేసుకోవాలన్నారు.
సామాన్యుల నుంచి మేధావుల వరకు
రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తేవాలని భావిస్తోన్న రికార్డ్ ఆఫ్ రైట్స్ (ఆర్వోఆర్)–2024 చట్టంపై విస్తృతస్థాయిలో ప్రజాభి ప్రాయ సేకరణ చేపట్టాలని మంత్రి పొంగులేటి కలెక్టర్లకు సూచించారు. అందులో భాగంగా ఈనెల 23, 24 తేదీల్లో ఆర్వోఆర్ ముసాయిదా చట్టంపై జిల్లాస్థాయి వర్క్‌షాప్‌లు నిర్వహించాలన్నారు. సామాన్యుల నుంచి మేధావుల వరకు అందరికీ అర్థమయ్యేలా చట్టం రూపొందించే క్రమంలో చర్చ జరగాల్సిన అవసరం ఉందని చెప్పారు.
పది రోజుల్లో ధరణి దరఖాస్తులు పరిష్కరించండి
ధరణి పోర్టల్ కింద పెండింగ్‌లో ఉన్న అన్ని దరఖాస్తులను పది రోజుల్లో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్లను మంత్రి పొంగులేటి ఆదేశించారు. ఈ ప్రక్రియలో భాగంగా తిరస్కరించిన దరఖాస్తులకు సరైన కారణాలను తెలియజేయాల్సిందేనని స్పష్టం చేశారు. రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో ధరణి దరఖాస్తులు ఎక్కువగా పెండింగ్‌లో ఉన్నా యని, ఈ జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించాలని రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్‌ను ఆదేశించారు.
క్షేత్రస్థాయి తనిఖీల కోసం స్పెషల్ టీమ్‌లతోపాటు హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటు చేసుకోవాలని, ఈ ప్రక్రియను పర్యవేక్షించేందుకు ప్రతి జిల్లాకు స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్‌ను పర్యవేక్షణ అధికారిగా నియమించాలని సీఎస్ శాంతికుమారికి సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment