
సాక్షి, సిద్దిపేట: కరోనా ఉధృతి కారణంగా ప్రభుత్వం మళ్లీ లాక్‌డౌన్ విధించడంతో పట్నంవాసులు పల్లెబాట పడుతున్నారు. కరోనా సెకండ్ వేవ్ వేగంగా విజృంభిస్తుండటంతో .. రాష్ట్ర ప్రభుత్వం తొలుత నైట్ కర్ఫ్యూ, తాజాగా లాక్‌డౌన్‌ను విధించింది. దీంతో హైదారాబాద్, ఇతర పట్టణాల్లో జీవనం ఇబ్బందిగా మారింది. ఇప్పటికే అనేక మంది ఐటీ ఉద్యోగులు పల్లెల నుంచే పనిచేస్తుండగా, ప్రస్తుతం పట్నంలో పనిచేసే దినసరి కార్మికులు, ప్రైవేట్ ఉద్యోగులు పల్లెబాట పట్టారు.
పల్లెల్లో పనులు
పల్లెల్లో ఉపాధి హామీ పనులకు తోడు వ్యవసాయం, కూరగాయల సాగు పనులు సాగుతున్నాయి. సొంత ఊరులో ఏదో ఒక పని చేసుకుంటూ జీవనం గడపవచ్చనే నమ్మకంతో వస్తున్నారు. ఉపాధి హామీ పనులు జోరుగా జరుగుతుండటంతో జీవనోపాధికి దాన్నే ఎంచుకుంటున్నారు. కొద్దోగొప్పో భూమి ఉన్నవారు పలుగు, పార చేతపట్టి వ్యవసాయంలో చెమట చిందిస్తున్నారు. మరికొందరు స్థానికంగా లభించే పనులు వెతుక్కుంటున్నారు.
ఈ ఫొటోలో కనిపిస్తున్నది సిద్దిపేట రూరల్ మండలం లక్ష్మిదేవిపల్లి గ్రామానికి చెందిన పాతూరి శ్రీకాంత్. ప్రభుత్వం లాక్‌డౌన్ విధించడంతో ఉపాధికి గండి పడింది. దీనితో స్వగ్రామానికి చేరుకున్నాడు. కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువ కావడంతో గ్రామంలోనే ఉండి వ్యవసాయం చేయాలని నిర్ణయించుకున్నాడు. తనకున్న ఐదెకరాల వ్యవసాయ భూమిని సాగు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు.
ఐటీ ఉద్యోగుల వర్క్ ఫ్రం హోం
ఇంటి పట్టునే ఉంటూ కంప్యూటర్‌ని ఓ పట్టు పడుతున్నారు. వర్క్‌బిజీలో పడిపోయి చాలా కాలం పాటు ఊరికి, చిన్నప్పటి స్నేహితులకు దూరమైన ఐటీ ఉద్యోగులు మరోసారి గతాన్ని నెమరేసుకుంటున్నారు. పాత స్నేహితులతో కొత్త కబుర్లు పంచుకుంటున్నారు. చిన్న పట్టణాలు, గ్రామాల్లో ఇంటర్నెట్ సమస్య వారికి ఇబ్బందిగా మారింది.
గజ్వేల్‌లో అద్దె ఇంట్లో ఉంటూ విధులు
గజ్వేల్ మండలం బెజుగామకి చెందిన నరేశ్ ఎమ్మెస్సీ మ్యాథ్స్ కంప్లీట్ చేశారు. హైదరాబాద్ అమీర్‌పేట కోచింగ్ సెంటర్లలో రాటుదేలి ఇన్ఫోసిస్‌లో ఉద్యోగం పొందాడు. ఆ వెంటనే లాక్‌డౌన్ రావడంతో హైదరాబాద్‌లోనే ఓ అద్దె ఇంట్లో ఉంటూ డ్యూటీ చేశాడు. కరోనా సెకండ్ వేవ్ రావడంతో స్వగ్రామమైన బెజుగామ చేరుకున్నాడు. ఇంటర్నెట్ సమస్యతో తిరిగి గజ్వేల్‌కి మకాం మార్చి విధులు నిర్వర్తిస్తున్నాడు.
వాటర్ ప్లాంట్ నడుపుతూ....
దుబ్బాక పట్టణానికి చెందిన ఎల్లంగారి వినిత్‌రెడ్డి ఎమ్మెస్సీ (మ్యాథ్స్) పూర్తి చేశాడు. రెండేళ్లుగా హైదరాబాద్‌లోని ప్రముఖ కార్పొరేట్ కళాశాల శ్రీ చైతన్యలో నార్సింగ్ బ్రాంచిలో హాస్టల్ సూపర్ వైజర్‌గా చేస్తున్నాడు. కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తుండటంతో 45 రోజుల క్రితం ఇంటికొచ్చాడు. దీంతో ఇక్కడ తన బంధువు వాటర్ ప్లాంట్‌ను లీజ్‌కు తీసుకొని తన తమ్ముడితో కలసి పనిచేస్తున్నాడు. ఇంటి దగ్గర నుంచే ఆన్‌లైన్‌లో క్లాసులు చెబుతున్నారు.
వారంతా వర్క్ ఫ్రం హోం
వరంగల్ నగరానికి చెందిన రాజ్‌కుమార్, శివప్రసాద్, శరత్ ముగ్గురు అన్నదమ్ములు ఐటీ రంగంలో స్థిరపడ్డారు. ఏడాది కాలంగా వర్క్ ఫ్రం హోం నిర్వర్తిస్తున్నారు. వరంగల్ నగరంలో ఇంటర్నెట్‌కి ఇబ్బందులు లేకపోవడంతో ప్రత్యేకంగా నెట్ కనెక్షన్‌ను తీసుకున్నారు. ఇంటి నుంచి విధులు నిర్వర్తించడం చాలా సంతోషంగా ఉందన్నారు. మా అన్నదమ్ములందరం ఒకే దగ్గర ఉండి విధులు నిర్వర్తించడం ఆనందాన్ని ఇస్తుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment