రాయ్‌పూర్: మావోయిస్టు పార్టీ అగ్రనేత, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి యాపా నారాయణ అలియాస్ హరిభూషణ్ (50) కరోనా బారిన పడి మరణించినట్టు తెలుస్తోంది. దంతేవాడ జిల్లా సుకుమా తాలుకాలోని మీనాగూడ గ్రామంలో జూన్ 21న ఆయన చనిపోయినట్టు వార్తలు గుప్పుమంటున్నాయి. హరిభూషణ్ ఆరోగ్య స్థితిగతులపై ఇటు మావోయిస్టులు అటు పోలీసులు నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
వారం క్రితం
2021 జూన్ 15న మావోయిస్టు అగ్రనేతలు కరోనా బారిన పడ్డారంటూ పోలీసులు ప్రకటన చేయగా... దాన్ని ఖండించారు మావోయిస్టు నేత అభయ్. మావోయిస్టు అగ్రనేతలకు కరోనా సోకింది అనేది కేవలం పోలీసుల దుష్ప్రచారం అంటూ కొట్టి పారేశారు. ఈ ఘటన జరిగి వారం తిరక్క ముందే కరోనాతో హరిభూషణ్ మరణం అంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన వస్తేనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
మడగూడ నుంచి
హరిభూషణ్ ఆలియాస్ యాప నారాయణ సొంతూరు మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం మడగూడ. 1995లో పీపుల్స్ వార్ గెరిల్లాలో చేరి అంచెలంచెలుగా ఎదిగారు. ప్రస్తుతం మావోయిస్టు పార్టీ తెలంగాణ కార్యదర్శిగా కీలక పాత్ర పోషిస్తున్నాడు. గతంలో జరిగిన పువ్వర్తి, తడపలగుట్ట ఎదురు కాల్పులతో పాటు మరి కొన్ని సందర్భాల్లోనూ హరిభూషణ్ చనిపోయినట్టు ప్రచారం జరిగినా ... ప్రాణలతో బయటపడ్డాడు. ఇటీవల తెలంగాణ – చత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో జరిగిన అనేక ఆపరేషన్స్ లో హరిభూషణ్ కీలక పాత్ర పోషించారు.
మడగూడెంలోని హరిభూషన్ నివాసం
Comments
Please login to add a commentAdd a comment