Sakshi Special Story On Virata Parvam Real Life Maoist Sarala In Telugu - Sakshi
Sakshi News home page

Virata Parvam: 30 ఏళ్ల కిందట పేలిన తూటా.. శంకరన్న చేతిలో సరళ బలి

Published Sun, Jun 26 2022 3:41 PM | Last Updated on Sun, Jun 26 2022 4:26 PM

Sakshi Special Story On Maoist Sarala

ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా ఒకప్పుడు మావోయిస్టుల ఖిల్లా. అడుగడుగునా అన్నలు కలియతిరిగిన ప్రాంతం. అడవులన్నీ ఉద్యమపాటలతో ఉర్రూతలూగగా ఆకర్షితులైన యువత మన్యంబాట పట్టేది. ఆ సమయంలో జిల్లాలో తూర్పు.. పశ్చిమ డివిజన్లు ఉండేవి. ఈ రెండు ప్రాంతాలు కేంద్రంగా మావోలు కార్యకలాపాలు కొనసాగించేవారు. కరీంనగర్‌– నిజామాబాద్‌ జిల్లాల సరిహద్దులను మావోయిస్టు పార్టీ పశ్చిమ డివిజన్‌గా పరిగణించేది. ఆ పశ్చిమ అడవుల్లో 30 ఏళ్ల కిందట జరిగిన ఘటన ఆధారంగా ఇటీవల ‘విరాట పర్వం’ సినిమా వచ్చింది. సరళ అనే అమ్మాయి నిజజీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఆ సినిమాను తెరకెక్కించినా.. రాజన్నసిరిసిల్ల జిల్లాతో సరళ ఘటనకు ముడిపడి ఉంది. నిజామాబాద్‌ జిల్లా డిచ్‌పల్లి మండలం సిర్నాపల్లి అడవుల్లో సరళను 1992 జూలైలో హత్య చేశారు. సరళను చంపిన శంకరన్న అలియాస్‌ దొంతు మార్కండేయ రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డిపేటవాసి. శంకరన్న అప్పటి పీపుల్స్‌వార్‌లో ఉత్తర తెలంగాణ కార్యదర్శిగా ఉన్నారు. ఆ రోజు ఏం జరిగిందనేదానిపై కథనం..   

సిరిసిల్ల: కరీంనగర్‌–నిజామాబాద్‌ జిల్లాల సరిహద్దులను మావోయిస్టు పార్టీ పశ్చిమ డివిజన్‌గా పరిగణిస్తోంది. ఆ పశ్చిమ అడవుల్లో 30 ఏళ్ల కిందట జరిగిన ఘటన ఆధారంగా ఇటీవల ‘విరాట పర్వం’ సినిమా వచ్చింది. సరళ అనే అమ్మాయి నిజజీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా సినిమాను తెరకెక్కించినా.. రాజన్న సిరిసిల్ల జిల్లాతో సరళ ఘటనకు ముడిపడి ఉంది. నిజామాబాద్‌ జిల్లా డిచ్‌పల్లి మండలం సిర్నాపల్లి అడవుల్లో సరళను 1992 జూలైలో హత్య చేశారు. సరళను చంపిన శంకరన్న అలియాస్‌ దొంతు మార్కండేయ రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డిపేటవాసి. శంకరన్న అప్పటి పీపుల్స్‌వార్‌లో ఉత్తర తెలంగాణ కార్యదర్శిగా ఉన్నారు.

ఆ రోజు ఏం జరిగింది..?
► ఖమ్మం జిల్లాకు చెందిన తూము సరళ ఇల్లు వదిలి సిర్నాపల్లి అటవీ ప్రాంతానికి చేరింది. వాస్తవానికి అప్పటికే శంకరన్న భార్య జ్యోతి ఎన్‌కౌంటర్‌లో మరణించింది. 
► ఆ వార్తను పత్రికల్లో చూసిన సరళ, శంకరన్నను కలిసేందుకు ఇల్లు వీడి నిజామాబాద్‌ జిల్లా సిర్నాపల్లి ప్రాంతానికి చేరింది. 
► అటవీ ప్రాంతంలోని డొంకల్, గన్నారం, సిర్నాపల్లి గ్రామాల్లో ఉంటూ.. పార్టీలో చేరాలని, శంకరన్నను కలవాలని         ప్రయత్నించింది. 
► ఈక్రమంలోనే డొంకల్‌ అటవీ ప్రాంతంలో పార్టీ జిల్లా కమిటీ సమావేశం జరుగుతుండగా.. సరళను పిలిచి విచారించారు. 
► శంకరన్నతోపాటు హరిభూషణ్, కుమార్‌ దళాలు ఉన్నాయి. సరళను పోలీస్‌ ఇన్‌ఫార్మర్‌గా భావించి, కోవర్టుకు పాల్పడుతోందనే భయంతో ఆమెను విచారించారు.
► సరళ ఎంత కొట్టినా.. తాను పార్టీలో చేరేందుకు వచ్చానని పదే పదే చెప్పినట్లు     సమాచారం. 
► చివరకు శంకరన్న, సరళను భయపెట్టేందుకు ఫైర్‌ చేయగా.. అది పొరపాటున సరళకు తగిలి మరణించినట్లు అప్పట్లో పార్టీలో పనిచేసి లొంగిపోయిన మాజీ దళ నేత కుమార్‌ వెల్లడించారు. అలా సరళ సిర్నాపల్లి అడవుల్లో శవమైంది.

సిరిసిల్ల జిల్లాలో గోడలపై సిర్నాపల్లి రాతలు
రాజన్న సిరిసిల్ల జిల్లా అటవీ ప్రాంతాల్లోని పల్లెల్లో గోడలపై సరళ ఉదంతాన్ని ఉటంకిస్తూ పీపుల్స్‌వార్‌కు వ్యతిరేకంగా అప్పటి జనశక్తి పార్టీ వాల్‌ రైటింగ్స్‌ చేసింది. పీపుల్స్‌వార్‌ నేత శంకరన్న చేసిన ఘాతుకం అంటూ ప్రచారం చేసింది. నిజానికి సరళ తల్లిదండ్రులు సరోజ, భిక్షమయ్య.. సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ పార్టీ మద్దతుదారులు కావడంతో జనశక్తి పార్టీ ఈ ఘటనపై వ్యతిరేకంగా ప్రచారం చేసింది. సరళ మృతదేహాన్ని కూడా వారి తల్లిదండ్రులకు ఇవ్వలేదని, అడవుల్లోనే కాల్చివేశారంటూ తీవ్రస్థాయిలో ఖండించారు.

పొరపాటును గుర్తించిన శంకరన్న
సిర్నాపల్లి అడవుల్లో జరిగిన సరళ ఘటనపై పీపుల్స్‌వార్‌ పార్టీలో తీవ్రస్థాయిలో చర్చసాగింది. ఆ అమ్మాయిని ఇంటికి పంపించే క్రమంలోనే మిస్‌ ఫైర్‌ కారణంగా మరణించిందని శంకరన్న స్పష్టం చేశారు. పార్టీ సమావేశంలో శంకరన్న ఆత్మవిమర్శ చేసుకుని పొరపాటును ఒప్పుకున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. 1993 జనవరి 27న నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని హౌసింగ్‌బోర్డులో శంకరన్న ఎన్‌కౌంటర్‌లో మరణించాడు. ఎల్లారెడ్డిపేటకు చెందిన మార్కండేయ పీపుల్స్‌వార్‌లో చేరి ఉత్తర తెలంగాణ కార్యదర్శిగా ఎదిగారు. ఆయన అనేక ఎన్‌కౌంటర్లలో తప్పించుకున్నారు. చివరికి సరళ ఘటన ఆయన్ని మానసికంగా బాధించిందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. మొత్తంగా విరాటపర్వంలో సిరిసిల్ల అధ్యాయంపై ఆసక్తికర చర్చ సాగుతోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement