
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో బుధ, గురువారాల్లో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. వాతావరణంలో మార్పులతో గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గుతాయని వెల్లడించింది. ప్రస్తుతం రాష్ట్రంలో సాధారణ స్థితిలోనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయంది.
మంగళవారం రాష్ట్రంలో నమోదైన ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే గరిష్ట ఉష్ణోగ్రత ఖమ్మంలో 33.2 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత మెదక్‌లో 18.5 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. బుధ, గురు వారాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల సెల్సియస్ మేర తగ్గే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేసింది. రాష్ట్రానికి ఆగ్నేయ దిశ నుంచి తక్కువ ఎత్తులో బలంగా గాలులు వీస్తున్నాయంది. గాలుల ప్రభావంతో చలి తీవ్రత పెరిగే అవకాశం ఉందని తెలిపింది.