
సాక్షి, హైదరాబాద్: సంక్రాంతికి సొంత ఊరెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధంచేసుకుంటున్ననగర ప్రజలను రైళ్లలో బెర్తుల కొరత నిరాశకు గురి చేస్తోంది. హైదరాబాద్ నుంచి తెలుగు రాష్ట్రాలకు, ఇతర ఇరుగు పొరుగు ప్రాంతాలకు రాకపోకలు సాగించే అన్ని రైళ్లలో వెయిటింగ్ లిస్టు వందల్లోకి చేరింది. కొన్ని రైళ్లలో ఇక ఏ మాత్రం బుకింగ్‌కు అవకాశం లేకుండా ‘నో రూమ్’దర్శనమిస్తోంది.
సాధారణంగా సంక్రాంతి రద్దీని దృష్టిలో ఉంచుకొని నవంబర్ నెలలోనే ప్రత్యేక రైళ్లనుప్రకటించవలసిన దక్షిణమధ్య రైల్వే అధికారులు.. ఇప్పటి వరకు ఆ దిశగా ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో ప్రయాణికుల్లో ఆందోళన నెలకొంది. ‘ఈ నెలలో కూడా ప్రత్యేక రైళ్లను ప్రకటించే అవకాశంలేదు. ప్రయాణికు ల డిమాండ్, రద్దీమేరకు ఏ రూట్లో ఎన్ని రైళ్లు అవసరమనే అంశంపై ఇప్పటివరకు ఎలాంటి కార్యాచరణ కూడా లేదు’..అని దక్షిణమధ్య రైల్వే అధికారి ఒకరు స్పష్టంచేశారు. దీంతో రెగ్యులర్ రైళ్లలో రిజర్వేషన్‌లకు అవకాశంలేక ప్రత్యేక రైళ్ల కోసం ఎదురు చూస్తున్న ప్రయాణికులు చివరి నిమిషం వరకు పడిగాపులు పడాల్సిన పరిస్థితి నెలకొంది.
భారీగా పెరగనున్న రద్దీ..
సాధారణంగా ఏటా సంక్రాంతికి హైదరాబాద్ నుంచి సుమారు 25 లక్షల మందికి పైగా సొంత ఊళ్లకు తరలి వెళ్తారు. ఈసారి ప్రయాణికుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అంచనా. డిసెంబర్ మొదటి వారం వరకే అన్ని రైళ్లలో స్లీపర్, ఏసీ బెర్తులు రిజర్వ్ అయిపోవడం, ఫిబ్రవరి మొదటి వారం వరకు బెర్తులు అందుబాటులో లేకపోవడం వంటి పరిణామాల దృష్ట్యా ఈ ఏడాది డిమాండ్ పెరగవచ్చని అధికారులు పేర్కొంటున్నారు. ఏటా నవంబర్‌లో ఒకసారి, డిసెంబర్ చివర్లో మరోసారి 100కు పైగా రైళ్లను అదనంగా నడిపేందుకు ప్రణాళికలను రూపొందిస్తారు.
ఈసారి అలాంటివేవీ లేకపోవడంతో చివరి నిమిషంలో అప్పటికప్పుడు ప్రత్యేక రైళ్లను ప్రకటించినా పెద్దగా ఉపయోగం ఉండబోదని కూకట్‌పల్లి హౌసింగ్‌బోర్డుకు చెందిన ప్రయాణికుడు శివరాజ్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి బయల్దేరే గోదావరి, విశాఖ, కోణార్క్, గౌతమి, నర్సాపూర్, పద్మావతి, నారాయణాద్రి తదితర అన్ని రైళ్లలోనూ 150 నుంచి 300 వరకు వెయిటింగ్ లిస్టు కనిపించడం గమనార్హం. హైదరాబాద్ నుంచి విశాఖ, విజయవాడ, కాకినాడ, తిరుపతి, బెంగళూరు తదితర నగరాలకు ప్రయాణికుల డిమాండ్ ఎక్కువగా ఉంది.
ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు.. సంక్రాంతి సందర్భంగా 4,000కు పైగా ప్రత్యేక బస్సులను నడిపేందుకు ఆర్టీసీ ఏర్పాట్లు చేసింది. తెలుగు రాష్ట్రాలకు ప్రయాణికులరద్దీ మేరకు ఈ బస్సులను నడుపనుంది.
Comments
Please login to add a commentAdd a comment