సాక్షి, హైదరాబాద్: త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మద్యం, ధన ప్రవాహం, డ్రగ్స్ సరఫరా కట్టడికి పటిష్టమైన పకడ్బందీ చర్యలు తీసుకునేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఇందుకుగాను వివిధ విభాగాలతో ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్టుల్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా, రాష్ట్రంలోనే ఓటర్ల సంఖ్య అత్యధికంగా.. ఐదు లక్షల కంటే ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు.
ఓటర్లు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో డబ్బు, మద్యం ప్రవాహం కూడా ఎక్కువే ఉంటుంది కనుక.. వాటిపై స్పెషల్ నిఘా వేయనున్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో సైతం ఆ నియోజకవర్గాల్లో అధిక మొత్తంలో ధనం, మద్యం ప్రవాహం జరిగినట్లు గుర్తించిన కేంద్ర ఎన్నికల సంఘం ఈసారి అందుకు తావులేకుండా అడ్డుకట్ట వేయాల్సిందిగా సంబంధిత ఉన్నతాధికారులను ఆదేశించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో ఉన్న, జీహెచ్‌ఎంసీ పరిధిలోకొచ్చే సదరు అసెంబ్లీ నియోజకవర్గాలపై ప్రత్యేక నిఘా ఉండనుంది.
ఇటీవల రాష్ట్ర పర్యటనకు వచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు సైతం సదరు నియోజకవర్గాల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించినట్లు సమాచారం. దీంతో సదరు నియోజకవర్గాల్లో డ్రగ్స్, మద్యం,డబ్బు పంపిణీ నిరోధానికి పకడ్బందీ చర్యలు తీసుకోనున్నారు. ఇందులో భాగంగా డ్రగ్స్, లిక్కర్ సరఫరా నియంత్రణకు శివార్లలోని పెద్ద అంబర్‌పేట, ఘట్‌కేసర్ తదితర ప్రాంతాల్లో స్పెషల్ ఆపరేషన్లు నిర్వహించాల్సిందిగా కూడా ఉన్నతాధికారులు సంబంధిత అధికారులకు ఇప్పటికే సూచించారు.
ఐదు లక్షలకు పైగా ఓటర్లున్న నియోజకవర్గాలివీ..
శేరిలింగంపల్లి (6,98,133 మంది ఓటర్లు)
కుత్బుల్లాపూర్ (6,69,361 ఓటర్లు)
ఎల్‌బీనగర్ (5,66,866 ఓటర్లు)
మహేశ్వరం(5,17,316 ఓటర్లు)
రాజేంద్రనగర్ (5,52,455 ఓటర్లు)
మేడ్చల్ (5,95,536 ఓటర్లు)
ఉప్పల్ (5,10,345మంది ఓటర్లు)
మల్కాజిగిరి నియోజకవర్గంలో ఐదు లక్షల కంటే కాస్త తక్కువగా 4,69,078 మంది ఓటర్లున్నారు.
Comments
Please login to add a commentAdd a comment