
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో జ్యోతిష్యం ప్రకారం ఎన్నికలు జరుగుతాయని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. 2018 ఎన్నికల్లో గోషామహల్ నుంచి ఎన్నికైన రాజాసింగ్ అఫిడవిట్‌లో క్రిమినల్ కేసుల వివరాలు ఇవ్వలేదంటూ టీఆర్‌ఎస్ అభ్యర్థి ప్రేమ్‌సింగ్ రాథోడ్ దాఖలు చేసిన పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. హైకోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ ప్రేమ్‌సింగ్ చేసిన అప్పీలు మంగళవారం.. జస్టిస్ రవీంద్రభట్, జస్టిస్ వి.రామసుబ్రమణియన్‌లతో కూడిన ధర్మాసనం ముందుకొచ్చింది.
కొన్ని డాక్యుమెంట్లు అందజేయడానికి సమయం కావాలని పిటిషనర్ తరఫు న్యాయవాది కోరారు. ఈ విచారణ వాయిదా వేసే క్రమంలో ధర్మాసనం ఆసక్తికరమైన వ్యాఖ్య చేసింది. 2018లో ముందస్తు ఎన్నికలు జరిగిన విషయాన్ని గుర్తు చేస్తూ ‘తెలంగాణలో జ్యోతిష్యం ప్రకారం ఎన్నికలు జరుగుతాయి. ఈ కేసు వినాలన్నా గ్రహాలన్నీ అనుకూలించాలి’అని (నవ్వుతూ) వ్యాఖ్యానించింది. అనంతరం విచారణను జనవరి, 2023కు వాయిదా వేసింది.
చదవండి: TRS Party: ఎదురుదాడికి టీఆర్‌ఎస్ స్పెషల్ స్ట్రాటజీ