జరీన్, ఇషా సింగ్‌లతో కలిసి భోజనం చేస్తున్న సీఎం కేసీఆర్. చిత్రంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ క్రీడాకారులకు ఎల్లవేళలా అండగా ఉంటానని సీఎం కేసీఆర్ చెప్పారు. క్రీడారంగాన్ని ప్రోత్సహించి, రేపటి తరాలను శారీకంగా, మానసికంగా దృఢంగా తీర్చిదిద్దడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. తెలంగాణ గడ్డకు కీర్తి ప్రతిష్టలు తెచ్చిన బాక్సర్ నిఖత్ జరీన్, షూటర్ ఇషా సింగ్‌లను చూసి తెలంగాణ యువతీ యువకులు స్ఫూర్తి పొందాలని పిలుపునిచ్చారు.
నిఖత్, ఇషా సింగ్‌లతో పాటు వారి తల్లిదండ్రులను గురువారం మధ్యాహ్నం ప్రగతి భవన్‌కు ఆహ్వానించిన ఘనంగా సన్మానించి, ఆతిధ్యం ఇచ్చారు. వారితో కలిసి భోజనం చేశారు. కాసేపు ముచ్చటించారు. బాక్సింగ్ క్రీడపట్ల చిన్నతనం నుంచే మక్కువ చూపించడానికి గల కారణాలను, గోల్డ్ మెడల్ సాధించడానికి పడిన శ్రమను నిఖత్‌ను అడిగి తెలుసుకున్నారు. శిక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం అందించిన ప్రోత్సాహం, చేసిన ఆర్థిక సాయం తనలో ఎంతో ఆత్మస్థైర్యాన్ని నింపిందంటూ ధన్యవాదాలు తెలిపారు. నిఖత్ పట్టుదల, ఆత్మస్థైర్యాన్ని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అభినందించారు.
మరొకసారి కేసీఆర్ ‘పంచ్’
2014లో స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా నగదు బహుమతిగా తనకు రూ.50 లక్షల చెక్కును అందిస్తూ, తన అభ్యర్థన మేరకు సీఎం బాక్సింగ్ పంచ్ పోజిచ్చిన విషయాన్ని నిఖత్ గుర్తు చేశారు. ‘మీరిచ్చిన స్ఫూర్తితోనే ఇంతటి విజయాన్ని సాధించాను. నేను విజయంతో తిరిగి వచ్చినందుకు మరోసారి ఆరోజు మాదిరి పిడికిలి బిగించండి’అని సీఎంను కోరారు.
ఆమె విన్నపాన్ని అంగీకరించిన కేసీఆర్ పిడికిలి బిగించి ఫొటో దిగారు. రూ.2 కోట్ల నగదు బహుమతిని అందించి, విలువైన నివాస స్థలాన్ని ఇస్తున్నందుకు ఆమె తల్లిదండ్రులు జమీల్ అహ్మద్, పర్వీన్ సుల్తానా సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. కాగా, ఇషాతో కూడా సీఎం మాట్లాడారు. ఆమె తల్లిదండ్రు లు సచిన్ సింగ్, శ్రీలతను అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment