అల్లు అర్జున్‌పై నాకెందుకు కోపం: సీఎం రేవంత్‌ | Telangana CM Revanth Reddy Meets Tollywood Film Industry Celebrities In Hyderabad, Comments Goes Viral | Sakshi
Sakshi News home page

అల్లు అర్జున్‌పై నాకెందుకు కోపం: సీఎం రేవంత్‌

Published Fri, Dec 27 2024 3:46 AM | Last Updated on Fri, Dec 27 2024 5:25 PM

Telangana CM Revanth Reddy meets Telugu actors in Hyderabad

అంతర్జాతీయంగా బ్రాండ్‌ ఇమేజ్‌ తీసుకురావాలని నిర్ణయం

సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడి 

ఐటీ, ఫార్మాతో పాటు చిత్ర పరిశ్రమ కూడా మాకు ముఖ్యమే 

త్వరలో హైదరాబాద్‌లో అంతర్జాతీయ సినీ సదస్సు... చిత్ర పరిశ్రమ సమస్యలపై మంత్రివర్గ ఉపసంఘం  

శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలిగినా సహించం... తెలుగు సినీ ప్రముఖులతో ముఖ్యమంత్రి భేటీ 

గైర్హాజరైన అగ్ర నటుడు చిరంజీవి

సాక్షి, హైదరాబాద్‌: తెలుగు చలనచిత్ర పరిశ్రమను మరో స్థాయికి తీసుకెళ్లి అంతర్జాతీయంగా ఒక బ్రాండ్‌ ఇమేజ్‌ తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి తెలిపారు. ఐటీ, ఫార్మాతో పాటు చిత్ర పరిశ్రమ కూడా తమకు ముఖ్యమేనన్నారు. విశ్వనగరాల్లో హైదరాబాద్‌ అత్యుత్తమమైనదని, హాలీవుడ్, బాలీవుడ్‌లు హైదరాబాద్‌కు తరలివచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. త్వరలో హైదరాబాద్‌లో భారీ అంతర్జాతీయ సినీ సదస్సు ఏర్పాటు చేసి ఇతర చిత్ర పరిశ్రమలను ఆకట్టుకునే ఏర్పాట్లు చేస్తామన్నారు.

సంధ్య థియేటర్‌ ఘటన నేపథ్యంలో గురువారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిలతో కలిసి ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ (ఐసీసీసీ)లో తెలుగు సినీ ప్రముఖులతో సీఎం సమావేశమయ్యారు. పుష్ప–2 సినిమా బెనిఫిట్‌ షో సందర్భంగా నటుడు అల్లు అర్జున్‌ సంధ్య థియేటర్‌కు రాగా అభిమానులు ఎగబడడంతో జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మరణించగా, ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో కోలుకుంటున్న విషయం తెలిసిందే. కాగా సీఎం రేవంత్‌ జరిపిన ఈ భేటీకి టాలీవుడ్‌ అగ్ర నటుడు చిరంజీవి గైర్హాజరు కావడం విశేషం. సీఎం ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి. 

తొక్కిసలాటలకు చిత్ర యూనిట్‌దే బాధ్యత 
‘తెలుగు సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు పరిశ్రమ అభివృద్ధికి అవసరమైన రాయితీలు, ప్రోత్సాహకాలపై సినీ ప్రముఖులతో చర్చించడానికి మంత్రివర్గ ఉసంఘాన్ని నియమిస్తాం. చిత్ర పరిశ్రమ తరఫున కూడా ఓ కమిటీ ఏర్పాటు చేసుకోవాలి. సినిమా ప్రీ రిలీజ్‌ కార్యక్రమాల్లో ఎలాంటి తొక్కిసలాట జరిగినా అందుకు సంబంధిత చిత్ర యూనిట్‌దే పూర్తి బాధ్యత. శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలిగినా సహించేది లేదు. అలా చేసే వారెవరికీ మినహాయింపులుండవు. రాష్ట్రంలో షూటింగ్‌లకు అనుమతులిస్తాం. తెలంగాణలో ప్రకృతి, ధార్మిక పర్యాటకాన్ని టాలీవుడ్‌ ప్రోత్సహించాలి. ప్రభుత్వం, సినీ పరిశ్రమ మధ్య అనుసంధానకర్తగా ఉండేందుకే దిల్‌ రాజును ఎఫ్‌డీసీ చైర్మన్‌గా నియమించాం..’ అని ముఖ్యమంత్రి చెప్పారు.  

అల్లు అర్జున్‌పై నాకెందుకు కోపం?   
‘నాకు వ్యక్తిగతంగా ఇష్టాయిష్టాలు లేవు. సీఎంగా చట్టాన్ని అమలు చేయాల్సిన బాధ్యత నాపై ఉంది. సినీ పరిశ్రమ కూడా బాధ్యతాయుతంగా మెలగాలి. అల్లు అర్జున్‌పై నాకెందుకు కోపం ఉంటుంది? బన్నీ నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. వ్యక్తిగత అభిప్రాయాలు ఎలా ఉన్నా, చట్టం ప్రకారం వ్యవహరించాలన్నది నా విధానం. సినీ ప్రముఖులు ఏర్పాటు చేసుకుంటున్న బౌన్సర్ల దౌర్జాన్యాలను ఎట్టి పరిస్థితుల్లో సహించబోము.

అభిమానులను నియంత్రణలో పెట్టుకోవాల్సింది నటులే. గంజాయి, డ్రగ్స్‌ను రూపుమాపేందుకు ప్రభుత్వం చేస్తున్న యత్నాలకు కూడా నటీనటులు సహకరించాలి. డ్రగ్స్, మహిళల భద్రత విషయంలో యువతకు అవగాహన కల్పించేలా లఘు చిత్రాలు చిత్రీకరించి సినిమాకు ముందు విధిగా థియేటర్లలో ప్రదర్శించాలి. సినీ పరిశ్రమ సామాజిక బాధ్యతగా ప్రభుత్వ కార్యక్రమాలు, అభివృద్ధిలో భాగస్వాములు కావాలి..’ అని సీఎం ఆకాంక్షించారు.  

సినీ పరిశ్రమకు కాంగ్రెస్‌ ప్రభుత్వాలు మేలు చేశాయి.. 
‘సినీ పరిశ్రమకు ఏది చేసినా కాంగ్రెస్‌ ప్రభుత్వాలే చేశాయి. సినీ స్డూడియోలకు స్థలాలు, నిర్మాణాలకు అనుమతులు, ఇళ్ల స్థలాలు, ఫిల్మ్‌నగర్, చిత్రపురి కాలనీల ఏర్పాటు, కార్మికులకు ఇళ్లు, ఇతర సౌకర్యాలను కాంగ్రెస్‌ ప్రభుత్వాలే ఇచ్చాయి. ఆ వారసత్వాన్ని కొనసాగిస్తాం. సినీ పరిశ్రమకు అండగా ఉండి ప్రోత్సహించాలన్నది మా ఉద్దేశం. 8 సినిమాలకు మా ప్రభుత్వం ప్రత్యేక అనుమతులతో జీవోలిల్పింది. పుష్ప సినిమాకు పోలీస్‌ గ్రౌండ్‌ ఇచ్చాం. తెలుగు సినీ పరిశ్రమ తెలుగు సినిమాలకే పరిమితం కాకుండా అన్ని భాషల సినిమాల నిర్మాణం చేపట్టేలా అందరం కలిసి అభివృద్ధి చేద్దాం..’ అని రేవంత్‌ అన్నారు.     

సినిమా టికెట్లపై సెస్‌: డిప్యూటీ సీఎం భట్టి 
‘రాష్ట్రంలో విద్యార్థుల భవిష్యత్తును అద్భుతంగా తీర్చిదిద్దడానికి ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలలు నిర్మిస్తున్నాం. ఒక్కో పాఠశాల పూర్తికి రూ.20 కోట్ల నుంచి రూ.25 కోట్ల పెట్టుబడి పెడుతున్నాం. దీనికోసం సినీ పరిశ్రమ నుంచి కొంత టికెట్లపై సెస్‌ రూపంలో ఆర్థిక వనరులు సమకూర్చాలని అనుకుంటున్నాం. ఇదో బృహత్తర కార్యక్రమం. ఇందుకు సినీ పరిశ్రమ సహకరించాలి..’ అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కోరారు. సామాజిక బాధ్యతలో భాగంగా రాష్ట్రంలో డ్రగ్స్‌ నిర్మూలనకు సినీ పరిశ్రమ పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించాలి..’ అని విజ్ఞప్తి చేశారు. పలువురు సినీ ప్రముఖులు కూడా ఈ సందర్భంగా మాట్లాడారు. 

ప్రపంచ సినీ రంగానికి హైదరాబాద్‌ రాజధాని కావాలి 
హైదరాబాద్‌ ప్రపంచ సినీ రంగానికి రాజధాని కావాలన్నది మా కోరిక. రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి రాయితీలిస్తే సినీ పరిశ్రమ ప్రపంచ స్థాయికి ఎదుగుతుంది. నగరంలో ప్రపంచ స్థాయి స్టూడియో సెటప్‌ ఉండాలి.
 – నటుడు అక్కినేని నాగార్జున  

ప్రభుత్వంపై మాకు నమ్మకం ఉంది:  
ప్రభుత్వంపై మాకు నమ్మకం ఉంది. ప్రభుత్వ సహాయంతోనే అప్పట్లో తెలుగు సినీ పరిశ్రమ చెన్నై నుంచి హైదరాబాద్‌కు తరలివచ్చింది. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్‌ సహా అన్ని ఏజెన్సీలకు హైదరాబాద్‌ చిరునామాగా ఉండాలి.  
– నిర్మాత డి.సురేష్‌ బాబు   

సంధ్య థియేటర్‌ ఘటన మమ్మల్ని బాధించింది:  
సంధ్య థియేటర్‌ ఘటన మమ్మల్ని బాధించింది. సినిమా విడుదలలో పోటీ పెరగడంతో ప్రమోషన్‌ కీలకంగా మారింది. ఎన్నికల ఫలితాల తరహాలోనే సినిమా ఫలితం తొలిరోజే తేలిపోతుంది. 
 – నటుడు మురళీమోహన్‌ 

ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ నిర్వహించాలి     
సినీ పరిశ్రమను గతంలో మాదిరి ఈ ప్రభుత్వం కూడా బాగానే చూసుకుంటోంది. అప్పట్లో చంద్రబాబు బాలల చలన చిత్రోత్సవం నిర్వహించారు. ప్రస్తుతం ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ను నిర్వహించాలని కోరుతున్నాం.  
– సినీ దర్శకుడు రాఘవేంద్రరావు 

టాలీవుడ్‌కు మద్దతుగా ఉండాలి 
మర్రి చెన్నారెడ్డి, అక్కనేని నాగేశ్వర్‌రావు వల్లే తెలుగు సినీ పరిశ్రమ హైదరాబాద్‌కు తరలివచ్చింది. ప్రభుత్వం టాలీవుడ్‌కు మద్దతుగా ఉంటుందని భావిస్తున్నాం.  
– సినీ దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ 

పరిశ్రమలో మహిళలే లేరా? 
ముఖ్యమంత్రితో జరిగిన సమావేశంలో తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ఒక్క మహిళ కూడా లేకపోవడం శోచనీయం. చిత్ర పరిశ్రమలో మహిళలకు సమస్యలే లేవన్నట్టుగా వ్యవహరించారు. 
– ‘ఎక్స్‌’ వేదికగా నటి పూనమ్‌ కౌర్‌ 
 


సంక్రాంతి సినిమాల సంగతేంటి? 
బెనిఫిట్‌ షోలకు, టికెట్‌ ధరల పెంపునకు ప్రభుత్వం అనుమతించని పక్షంలో వచ్చే సంక్రాంతికి రానున్న సినిమాల పరిస్థితి ఏంటి? అనేది  చర్చనీయాంశంగా మారింది. గురువారం సీఎం వద్ద జరిగిన సమావేశంలో ఈ అంశం చర్చకు రాలేదని సినీ, ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ సంక్రాంతికి రామ్‌చరణ్‌ ‘గేమ్‌ ఛేంజర్‌’ (జనవరి 10), వెంకటేశ్‌ ‘సంక్రాంతికి వస్తున్నాం’ (జనవరి 14), బాలకృష్ణ ‘డాకు మహరాజ్‌’ (జనవరి 12) వంటి చిత్రాలు విడుదల కానున్నాయి.

పండగ బరిలో ఉన్న ‘గేమ్‌ ఛేంజర్‌’, ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రాలకు ‘దిల్‌’ రాజు నిర్మాత. అలాగే ‘డాకు మహరాజ్‌’ని ఓ ఏరియాలో ‘దిల్‌’రాజు పంపిణీ చేస్తారని టాక్‌. ఆ విధంగా చూస్తే సంక్రాంతి ‘దిల్‌’ రాజుకు కీలకమైంది. త్వరలో మరోసారి సమావేశం అంటున్నందున ఆ సమావేశంలో బెనిఫిట్‌ షోలు, టికెట్ల ధరల పెంపుపై నిర్ణయం తీసుకుంటారన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement