ధరణి దరఖాస్తుల పరిష్కార అధికారాలను వికేంద్రీకరించిన ప్రభుత్వం
తొలి దశలో 15 మాడ్యూల్స్ వివిధ స్థాయిల్లో పంపిణీ
కీలకమైన టీఎం 33 మాడ్యూల్‌లోని సమస్యలపై ఆర్డీవో, కలెక్టర్, సీసీఎల్‌ఏలకు పరిష్కార అధికారాలు
ప్రతి దరఖాస్తు పరిష్కార ప్రక్రియను రికార్డు చేయాల్సిందే
గరిష్టంగా వారంలో దరఖాస్తుల పరిష్కారం.. ఉత్తర్వులు జారీ
సాక్షి, హైదరాబాద్: ధరణి పోర్టల్‌లో పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారానికి అధికార వికేంద్రీకరణ పూర్తయింది. తహసీల్దార్ల నుంచి భూ పరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్‌ఏ) వరకు పలు రకాల దరఖాస్తు లను పరిష్కరించే అధికారాలను పంపిణీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏ స్థాయి అధికారులకు ఏయే దర ఖాస్తులను పరిష్కరించేఅధికారం ఇవ్వాలో నిర్దేశిస్తూ రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి, భూ పరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్‌ఏ) నవీన్ మిట్టల్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ ఉత్తర్వుల ప్రకారం తహసీల్దార్, ఆర్డీవో, అదనపు కలెక్టర్, కలెక్టర్, సీసీఎల్‌ఏ స్థాయిలో ధరణి పోర్టల్ దరఖాస్తులను పరిష్కారించాల్సి ఉంటుంది. ఈ మేరకు ఆయా స్థాయిల్లోని అధికారులు వారికి కేటాయించిన మాడ్యూళ్లలోని దరఖాస్తుల పరిష్కారంపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.
అన్నీ భద్రపర్చాల్సిందే..
క్షేత్రస్థాయిలో తహసీల్దార్ల నేతృత్వంలో కలెక్టర్లు కమిటీలు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఈ కమిటీలు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసిన డాక్యుమెంట్లను పరిశీలించనున్నాయి. ఒకవేళ దరఖాస్తుదారుడు తగిన డాక్యుమెంట్లను సమర్పించని పక్షంలో వాటిని తెప్పించుకోవాల్సి ఉంటుంది. పెండింగ్ దరఖాస్తులన్నింటినీ వేగంగా క్లియర్ చేయాల్సి ఉంటుంది. ఏ దరఖాస్తునూ పెండింగ్‌లో లేకుండా చర్యలకు ఉపక్రమించాలి. ప్రతి లావాదేవీని ఎలక్ట్రానిక్ రికార్డ్ చేసి భద్రపర్చాలి. ప్రభుత్వ భూముల పరిరక్షణ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని దరఖాస్తుల పరిష్కారాన్ని పూర్తి చేయాల్సి ఉంటుంది.
తిరస్కరిస్తే కారణాలు చెప్పాలి..
తహసీల్దార్ స్థాయిలో దరఖాస్తుల పరిష్కారానికి సేత్వార్, ఖాస్రా పహాణీ, సేస్లా పహాణీ, ఆర్వోఆర్ రికార్డులను సరిచూసుకోవాలి. ఫీల్డ్ లెవల్ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి ఇచ్చిన నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవాలి. ఒకవేళ దరఖాస్తును తిరస్కరిస్తే అందుకు కారణాలను తెలపాలి. ఆర్డీవో స్థాయి అధికారికి టీఎం 33లోని డేటా కరెక్షన్, మిస్సింగ్ సర్వే నంబర్లు, విస్తీర్ణం, సర్వే నంబర్ల మిస్సింగ్‌ల పరిష్కార బాధ్యతలు అప్పగించారు. వారికి ఎకరం రూ. 5 లక్షలోపు ఉన్న భూములు, ఏరియాలకు సంబంధించిన అధికారం కట్టబెట్టారు. ఆర్డీవోలు తహసీల్దార్ ద్వారా విచారణ జరపాలి. తహసీల్దార్ ఇచ్చింన నివేదికలు, ఆర్డర్లను పున:పరిశీలించాలి. అన్ని స్థాయిల్లో సమస్యలు, పెండింగ్‌ల పరిష్కారానికి ఈ దఫా నిర్ణీత కాలపరిమితి నిర్దేశించారు. తహసీల్దార్, ఆర్డీవోల స్థాయిల్లో జరుగుతున్న పురోగతిని కలెక్టర్లు, జిల్లాలవారీ పురోగతిని సీసీఎల్‌ఏ పర్యవేక్షించాల్సి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment